Maruti Suzuki: ఎలక్ట్రానిక్ భాగాల కొరతతో మారుతీ.. ఉత్పత్తిపై ప్రభావం పడనుందా?

Maruti Suzuki:దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఎలక్ట్రానిక్‌ భాగాల సరఫరా తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఉత్పత్తి పరిమాణం దెబ్బతింటుందని తెలిపింది. 

Published : 03 Apr 2023 20:48 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) లో కార్ల ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ (Maruti Suzuki)తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్‌ భాగాల ఉత్పత్తి తగ్గడంతో  వాహన ఉత్పత్తి క్షీణించే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ అభిప్రాయం వ్యక్తం చేసింది. సెమీకండక్టర్లు, చిప్స్‌ కొరతతో ఇంత కాలం ఇబ్బందులు ఎదుర్కొన్న మారుతీ సుజుకీకి ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ భాగాల కొరత ఏర్పడింది. గతేడాది వాహనాల తయారీ తగ్గటానికి కూడా ఎలక్ట్రానిక్ భాగాల కొరతే కారణం అని కంపెనీ తన ఫైలింగ్‌లో తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 20 లక్షల యూనిట్ల వాహనాలు ఉత్పత్తి చేయాలని మారుతీ నిర్ణయించింది. కానీ లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. కేవలం 19.22 లక్షల యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. ప్యాసింజర్ వాహనాలు, లైట్‌ కమర్షియల్‌ వాహనాలతో సహా కంపెనీ మొత్తం ఉత్పత్తే పెద్ద ఎత్తున క్షీణించింది.  దంతో గతేడాది 1,63,392 యూనిట్ల ఉత్పత్తి నమోదు చేసుకోగా ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 6 శాతం తగ్గి 1,54,148  యూనిట్లకు చేరింది. 1,59,211 యూనిట్లగా ఉన్న ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి ఈ ఏడాది మార్చి నాటికి 1,50,820 యూనిట్లకు తగ్గింది. మినీ, కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో కార్ల ఉత్పత్తి 1,08,001 యూనిట్లకే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం(2022) ముగిసేనాటికి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 36,249 యూనిట్లుగా ఉండేది. ఈ ఏడాది మార్చి నాటికి వాటి ఉత్పత్తి భారీగా తగ్గి 29,440 యూనిట్లకు చేరింది. వాణిజ్య వాహనాల ఉత్పత్తి కూడా భారీగా క్షీణించింది. 4,181 యూనిట్ల నుంచి 3,328 యూనిట్లకు చేరింది.

సెమీకండక్టర్ల కొరత రానున్న త్రైమాసికాల్లోనూ కొనసాగనున్నట్లు మారుతీ సుజుకీ  ఇండియా ఈ ఏడాది మార్చిలో అంచనా వేసింది. దీంతో పెద్ద ఎత్తున ఉన్న పెండింగ్‌ ఆర్డర్లు మరింత పెరగనున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితి మరిన్ని నెలల పాటు కొనసాగుతుందని అంచనా వేసింది. 2021లో మారుతీ సుజుకీ చిప్‌ల కొరతతో ఇబ్బందిపడింది. దాంతో వాహనాల ఉత్పత్తి పెద్ద ఎత్తున క్షీణించింది. ముఖ్యంగా ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తిలో ఈ ప్రభావం కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విక్రయాల్లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ ఇండియా వాటా తగ్గింది. మౌలిక వసతులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వాహన గిరాకీ పుంజుకోవడానికి దోహదం చేస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని