Property Sale: పాత ఇంటిని విక్రయిస్తున్నారా? ఇలా చేస్తే మీ ఇంటికి అధిక ధర!

కొనుగోలుదారుల‌కు మీ ఆస్తిని మంచిగా ప్ర‌ద‌ర్శించాలి.

Published : 29 Jul 2022 20:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగం, చ‌దువులు.. ఇలా కారణమేదైనా ఇల్లు మారుస్తుంటారు కొందరు. తమ అవసరాలకు సరికపోకపోయినా.. కొత్త ఇల్లు కొనుగోలు చేసి పాతది విక్రయిస్తుంటారు. అలాగని పాత ఇంటిని విక్రయించడం అంత సులువు కాదు. కేవలం బోర్డు పెడితేనో.. సహచరుల నోటి మాట ద్వారానో ఇల్లు అమ్ముడుపోదు. దానికి చాలానే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటిని విక్రయించాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటి అమ్మ‌కంలో సేవ‌లు: నో బ్రోకర్, ప్రాప్‌టెక్‌, మ్యాజిక్ బ్రిక్స్ లాంటి ప్లాట్ ఫామ్స్ ఇంటి అమ్మకం లేదా అద్దెకు ఇవ్వడంలో చాలా సహాయపడతాయి. ఇవి ప‌నులు సుల‌భంగా, సౌక‌ర్య‌వంతంగా అయ్యేలా.. మంచి ధ‌ర వ‌చ్చేలా చూస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు మీ ఆస్తికి మంచి ధ‌ర వ‌చ్చేలా చేయ‌డానికి సాంకేతిక‌త‌ను ఉప‌యోగించ‌డ‌మే కాకుండా ఆస్తికి సంబంధించిన స‌రైన ధ‌ర‌ను అంచ‌నా వేస్తాయి. మీ అవసరాన్ని బట్టి యాడ్ మాత్రమే ఇచ్చే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ సర్వీసు పూర్తిగా ఉచితం.

మీ ఇంటిని అమ్మే ముందు చేయాల్సిన ప‌నులు: ఇంటి తాళాలు స‌రిగ్గా ఉండేలా చూసుకోవాలి. లీకేజీలు ఉంటే బాగు చేయించ‌డం, నీటి సౌకర్యంలో ఇబ్బందులు ఉంటే తీర్చడం, ఇంటిలో రంధ్రాలు ఉంటే వాటిని పూడ్చి క‌నిపించ‌కుండా చేయ‌డం లాంటి చిన్న ప‌నులన్నీ పూర్తి చేయాలి. ఇంటిలో లొసుగులు క‌నిపించ‌కుండా ఆక‌ర్షించే విధంగా న‌వీక‌రించాలి.

ఆక‌ర్ష‌ణ పెంచే ఫోటోలు: ప్ర‌త్యేకించి ఇంటిని విక్రయించాలనుకునేటప్పుడు ఆస్తి ఫోటో ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలి. కొనుగోలుదారులు చాలా ఆస్తుల‌ను ప‌రిశీలిస్తుంటారు. ఒక లిస్ట్‌ని త‌యారు చేసుకుంటారు. అటువంట‌ప్పుడు ఆస్తి ఫోటో ఆక‌ర్ష‌ణీయ‌ంగా ఉండడం వల్ల అమ్మ‌కంలో మంచి ధ‌ర‌ రాబట్టొచ్చు. ఆస్తి కొత్త‌ది కానందున కొనుగోలుదారులు ఆస్తిలో లొసుగుల గురించి అప్ర‌మ‌త్తంగా ఉంటారు. మీ ఇంటి 3డీ ఫోటో పోస్ట్ చేయ‌డం ద్వారా కొనుగోలుదారుల ఆసక్తిని పెంచొచ్చు.

వెలుతురు స‌రిగ్గా ఉండేలా చూడండి: త‌క్కువ వెలుతురు ఉన్న ఇంటిని చూసి ఎవ‌రైనా నిరుత్సాప‌డ‌తారు. కాబట్టి సరిపడా ట్యూబ్ లైట్స్, బల్బ్స్ లాంటివి అమర్చండి. అలాగే మీ ఇంటిని చింద‌ర‌వంద‌ర‌గా ఉంచొద్దు. ఫ‌ర్నిచ‌ర్, టేబుల్ ల్యాంప్‌లు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు వంటి గృహోప‌క‌ర‌ణాలు అన్నీ చ‌క్క‌గా అమ‌ర్చండి.

పెయింటింగ్‌: తాజాగా పెయింటింగ్ చేసిన ఇల్లు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షించ‌డంలో ఈ అంశం చాలా ముఖ్య‌మైన‌ది. కాస్త ఖర్చు అయినప్పటికీ పెయింట్ చేయించాకే ఇంటికి అమ్మకానికి పెట్టడం మంచిది.

విక్ర‌య ప‌త్రాలు: గృహ విక్రేత‌లు ఆస్తికి సంబంధించిన అన్ని చ‌ట్ట‌ప‌ర‌మైన ప‌త్రాల‌ను సేక‌రించ‌డం చాలా కీల‌కం. కాబోయే కొనుగోలుదారులు ఎటువంటి చ‌ట్ట‌ప‌ర‌మైన వివాదాలు లేని ఆస్తిని కొనుగోలుచేయడానికే ఆసక్తి చూపుతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని