iphone 14: ఐఫోన్‌ 14పై స్టీవ్‌జాబ్స్‌ కుమార్తె సెటైర్‌.. పోస్ట్‌ వైరల్‌!

యాపిల్‌ మాజీ బాస్‌ స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఐఫోన్‌ 14 పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె పెట్టిన మీమ్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Updated : 08 Sep 2022 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజం యాపిల్‌ (apple) కొత్త ఐఫోన్‌ 14 మోడళ్లను విడుదల చేసింది. ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ పేరిట నాలుగు మోడళ్లను ఆవిష్కరించింది. దీంతో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులను సైతం తీసుకొచ్చింది. ప్రపంచమంతా కొత్త మోడల్‌ ధరెంత? ఫీచర్లేంటి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటూ ఆరా తీస్తున్న వేళ యాపిల్‌ మాజీ బాస్‌ స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఐఫోన్‌ 14 పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె పెట్టిన మీమ్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా యాపిల్‌ విడుదల చేసే ఐఫోన్లన్నీ దాదాపు ఒకే తరహాలో ఉంటాయి. సాంకేతికంగా ఫోన్‌ను ఆధునికీకరించడం మినహా డిజైన్‌లో పెద్దగా మార్పులుండవు. స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె అయిన ఈవ్‌ జాబ్స్‌ సైతం ఇదే విషయాన్ని ఓ మీమ్‌ రూపంలో పంచుకుంది. ‘ఐఫోన్‌ 13 నుంచి ఐఫోన్‌ 14కు మారడం అంటే ప్రస్తుతం ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం లాంటిది’ అని చెప్పే మీమ్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌చేసింది. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొందరు ఈ విషయాన్ని ఏకీభవిస్తూ పోస్టులు పెట్టగా.. ‘ఇన్నాళ్లకు స్టీవ్‌ జాబ్స్‌ కుమార్తె ఈవ్‌ జాబ్స్‌ అనే విషయం తెలిసింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమెతో పాటు ఐఫోన్‌ 14కు సంబంధించి మరికొంతమంది సైతం సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర పోస్టులు పెట్టారు. యాపిల్‌ వ్యవస్థాపకుల్లో స్టీవ్‌ జాబ్స్‌ ఒకరు. 2011లో ఆయన మరణం తర్వాత టిమ్‌ కుక్ యాపిల్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

 







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు