Stock Market: ఆరంభంలోనే ‘బేర్‌’మన్న మార్కెట్లు.. 400 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌

Stock Market Opening Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 70వేల మార్క్‌ వద్ద ఊగిసలాడుతోంది.

Published : 21 Dec 2023 09:39 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock Market)పై బేర్‌ పట్టు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు.. షేర్ల విలువలు బాగా పెరిగాయనే భావనతో మదుపర్లు లాభాలు స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. అటు మరోసారి కొవిడ్ కేసుల పెరుగుదల, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. 

ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (BSE) 432 పాయింట్లు నష్టపోయి 70074 వద్ద, నిఫ్టీ (NSE) 140 పాయింట్లు దిగజారి 21,009 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు క్షీణించి రూ.83.22గా కొనసాగుతోంది. నిఫ్టీలో మారుతి సుజుకీ, అపోలో హాస్పిటల్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు రాణిస్తున్నాయి.

జీడీపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. డోజోన్స్‌ 1.27శాతం, నాస్‌డాక్‌ 1.50శాతం మేర కుంగాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.47శాతం పతనమైంది. అటు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా గురువారం నష్టాల్లోనే సాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్‌ సూచీ 0.40శాతం, జపాన్‌ నిక్కీ 1.50శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.69శాతం, హాంగాంక్‌ హాంగ్‌సెంగ్ సూచీ 0.98శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని