IMF: సంస్కరణలే భారత ఆర్థిక విజయానికి సోపానాలు: ఐఎంఎఫ్‌

IMF: భారత ఆర్థిక వ్యవస్థ ప్రకాశిస్తోందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలినా విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated : 02 Feb 2024 12:02 IST

వాషింగ్టన్‌: భారత దేశ ఆర్థిక విజయం గతకొన్ని సంవత్సరాల సంస్కరణల్లో దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా గురువారం అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని భారత్‌ సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2024 భారత వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్‌ మెరుగుపర్చడం విశేషం. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ (Union Budget 2024) ప్రవేశపెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే క్రిస్టలినా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ప్రకాశిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది కూడా. 2024 భారత వృద్ధి అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ 2023లో చాలా బలమైన పనితీరు కనబర్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆమె వివరించారు. డిజిటలీకరణ విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రయోజనాన్ని చేకూర్చాయని తెలిపారు. ఇదే ఇప్పుడు దేశానికి బలమైన శక్తిగా మారిందని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు సైతం మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు డిజిటల్‌ వసతులు దోహదం చేశాయన్నారు.

భారత శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ తక్కువగా ఉందని ఆమె తెలిపారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించడం సరైన నిర్ణయమని కితాబిచ్చారు. భవిష్యత్తు పోటీని నూతన ఆవిష్కరణలే నిర్దేశిస్తాయని ఆ దేశం గుర్తించిందని తెలిపారు. అందుకోసం పరిశోధన-అభివృద్ధి రంగంలో సమర్థంగా పెట్టుబడులు పెడుతోందన్నారు. చంద్రుడిపై ల్యాండర్‌ను విజయవంతంగా దింపడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇలాంటి చర్యలే భవిష్యత్తు వృద్ధికి రంగాన్ని సిద్ధం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించకపోవడానికి తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని క్రిస్టలినా వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం ఉన్న సంస్కరణలను అలాగే కొనసాగించాలని సూచించారు. ప్రైవేటు పెట్టుబడులకు ఉన్న అడ్డంకులను తొలగించాలని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని