స్విచ్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 250KM

Electric double-decker AC Bus: స్విచ్‌ మొబిలిటీ (Switch Mobility) దేశీయంగా తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును విడుదల చేసింది.

Updated : 18 Aug 2022 15:34 IST

ముంబయి: స్విచ్‌ మొబిలిటీ (Switch Mobility) దేశీయంగా తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును ఆవిష్కరించింది. హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ అశోక్‌ లే ల్యాండ్‌ ఎలక్ట్రిక్‌ విభాగానికి చెందిన ఈ కంపెనీ.. EiV 22 పేరిట దీన్ని ముంబయిలో గురువారం లాంచ్‌ చేసింది.  వీటిని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆవిష్కరించారు. నగర రవాణాకు అనువుగా ఈ బస్సును తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సులు యూకే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే భారత్‌లో సైతం అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే 200 బస్సుల కోసం బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (BEST) ఆర్డర్‌ చేసిందని స్విచ్‌ మొబిలిటీ ఇండియా సీఓఓ మహేశ్‌ బాబు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 50 బస్సులను ముంబయికి డెలివరీ చేయనున్నామని చెప్పారు. ఈ బస్సుల డెలివరీకి మరింత మందితో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికల్లా 150-250 బస్సులను డెలివరీ చేయనున్నట్లు వివరించారు.

అశోక్‌ లేల్యాండ్‌కు చెందిన విద్యుత్‌ వాహన విభాగమైన స్విచ్‌.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 300 మిలియన్‌ పౌండ్లు పెట్టుబడి పెట్టింది. భారత్‌, యూకేలో ఎలక్ట్రిక్‌ బస్సులు, లైట్‌ కమర్షియల్‌ వాహనాల అభివృద్ధికి ఈ మొత్తం వినియోగించనుంది. ముంబయిలో 1967లోనే తొలి డబుల్‌ డెక్కర్‌ బస్సును అశోక్‌ లే ల్యాండ్‌ అందించింది. అదే వారసత్వాన్ని స్విచ్‌ మొబిలిటీ కొనసాగించనుందని కంపెనీ పేర్కొంది. 231 kWh కెపాసిటీ కలిగిన ఈ బస్సు డ్యూయల్‌ గన్‌ ఛార్జింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది. సింగిల్‌ ఛార్జ్‌తో 250 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. దేశీయ పరిస్థితులకు, నగర ప్రయాణానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని