New Year: కొత్త ఏడాది నుంచి వచ్చే కీలక ఆర్థిక మార్పులివే..

New Year: 2024 జనవరి 1 నుంచి మొదలుకొని ఆర్థికపరంగా కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. అవేంటో చూద్దాం..

Updated : 01 Jan 2024 11:23 IST

Financial changes in 2024 |  ఇంటర్నెట్‌డెస్క్‌: 2023కు వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. కొత్త ఏడాదికి క్యాలెండర్‌ మారటంతో పాటు ఆర్థిక పరంగా కొన్ని కీలక మార్పులు వచ్చేశాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి.. సిమ్‌ కార్డు జారీకి కొత్త నిబంధనల వరకూ పలు స్కీమ్‌లలో ఈ రోజు (జనవరి 1) నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..

వీటి వడ్డీ రేట్లు పెంపు..

సుకన్య సమృద్ధి యోజన (SSAS) వడ్డీ రేటు పెరిగింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8 శాతం వడ్డీ ఇస్తుండగా.. దాన్ని 20 బేసిస్‌ పాయింట్లు పెంచి 8.2 శాతానికి చేర్చారు. మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై 7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.1 శాతానికి పెంచారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి త్రైమాసికానికోసారి కేంద్రం వడ్డీ రేటును సవరిస్తుంటుంది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కొత్త రేట్లు వర్తించనున్నాయి.

వీటి ధరలు మరింత ప్రియం..

ప్రముఖ ఆటోమొబైల్‌  సంస్థలు.. టాటా మోటార్స్‌ (Tata Motors), ఆడి (Audi),  మారుతీ సుజుకీ (Maruti Suzuki), మెర్సిడెస్‌ బెంజ్‌ (Mercedes Benz) జనవరి నుంచి తమ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ముడి సరకు ధరలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో వాహన ధరలు 2 నుంచి 3 శాతం వరకు పెరగనున్నాయి.

యూపీఐ ఖాతాలు నిలిచిపోతాయ్‌..

ఏడాదికి పైగా పనిచేయకుండా ఉన్న గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎంల వంటి యూపీఐ యాప్‌లోని యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లు ఈ రోజు నుంచే డీయాక్టివేట్‌ అవుతాయి. దీనికి సంబంధించి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) 2023 నవంబర్‌ 7నే ఉత్తర్వులు జారీ చేసింది.

బీమా నిబంధనలు అర్థమయ్యేలా..

ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన  ప్రాథమిక సమాచారాన్ని పాలసీ హోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ‘కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌’లను (CIS) విడుదల చేయాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (IRDAI) బీమా సంస్థలకు సూచించింది. ఈ నిబంధనలు కూడా ఈ రోజు (2024 జనవరి 1) నుంచే అమల్లోకి వచ్చేశాయి.

సిమ్ కార్డ్‌ కోసం కొత్త రూల్స్‌..

సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్స్‌ ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది. ఆ స్థానంలోనే డిజిటల్‌ వెరిఫికేషన్‌ తీసుకొచ్చింది. ఇకపై టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్‌ ద్వారానే వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి. సిమ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా కొత్తగా ఈ డిజిటల్‌ విధానాన్ని తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని