Home Loan: గృహ రుణం తీర్చేశాక ఏం చేయాలి?
గృహ రుణ బకాయిలను పూర్తిగా చెల్లించిన తర్వాత రుణగ్రహీత కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ బ్యాంకుల వద్ద సేకరించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటి కొనుగోలుకు లేదా నిర్మాణానికి చాలా మంది బ్యాంకుల వద్ద రుణం తీసుకుంటారు. అయితే రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. రుణం క్లియర్ అయిన తర్వాత రుణానికి సంబంధించిన అన్ని చట్టపరమైన వివాదాల నుంచి మీరు అప్పుడే సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఏ రకమైన రుణాన్ని తీసుకున్నా, అది మీ క్రెడిట్ రికార్డులలో నమోదవుతుంది. ఇది మీ భవిష్యత్ రుణాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ గృహ రుణ బకాయిలను పూర్తిగా చెల్లించి ఖాతాను మూసివేసేటప్పుడు కొన్ని పనులు జాగ్రత్తగా చేయడం విస్మరించకూడదు. అవేంటో చూద్దాం..
ఆస్తి పత్రాల సేకరణ
గృహ రుణం అనేది సురక్షితమైన రుణం కాబట్టి, మీరు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక రుణ సంస్థల నుంచి డబ్బు అప్పు తీసుకున్నప్పుడు మీ ఆస్తి (ఇంటి)ని తాకట్టు పెడతారు. మీరు రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించే వరకు అన్ని ఒరిజినల్ ఆస్తి పత్రాలను తప్పనిసరిగా ఆ రుణ సంస్థ వద్ద ఉంచాల్సి ఉంటుంది. మీ గృహ రుణాన్ని పూర్తిగా తీర్చివేసిన తర్వాత రుణ ఖాతాను మూసివేసినప్పుడు బ్యాంకుకు అందజేసిన అన్ని ఒరిజినల్ పత్రాలను తిరిగి తీసుకోవాలి. సాధారణంగా సేల్ డీడ్, బిల్డర్-కొనుగోలుదారు ఒప్పందం, ఇంటి కేటాయింపు పత్రం, ఇల్లు స్వాధీన పత్రం, విక్రయ ఒప్పందం, ఇంకా బ్యాంకుతో కలిసి సమర్పించిన ఏవైనా ఇతర పత్రాలు ఉంటాయి. వీటిని బ్యాంకు నుంచి తీసుకునేటప్పుడు ఈ పత్రాలు అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని సరిచూసుకోవాలి.
నో-డ్యూస్ సర్టిఫికెట్
నో-డ్యూస్ సర్టిఫికెట్ చాలా ముఖ్యమైన పత్రాల్లో ఒకటి. గృహ రుణ పూర్తి బకాయిలను చెల్లించిన వెంటనే బ్యాంకు నుంచి నో-డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ పత్రం మీరు మీ బకాయిలన్నింటినీ చెల్లించారని, రుణ పంపిణీ సమయంలో బ్యాంకు వద్ద తనఖా పెట్టిన ఆస్తిపై బ్యాంకుకు ఎలాంటి హక్కూ ఇక లేదని నిర్ధారిస్తుంది. ఈ పత్రాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఆస్తి వివరాలు, మీ పేరు మొదలైనవి సరిగ్గా ఉన్నాయా, లేవా అనేది చూడండి. భవిష్యత్‌లో బకాయిలకు సంబంధించి బ్యాంకుతో ఎలాంటి చట్టపరమైన వివాదం లేదని ఈ పత్రం నిర్ధారిస్తుంది.
ఆస్తిపై హక్కు
ఇంటిపై రుణం తీసుకున్న రుణగ్రహీత ఆ ఇంటిని అనుభవిస్తున్నప్పటికీ..ఇంటిని బ్యాంకు పేరుపై తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ఇంటిపై బ్యాంకుకు కూడా హక్కు ఉంటుంది. బకాయిని పూర్తిగా చెల్లించే వరకు రుణగ్రహీత ఆస్తి (ఇంటి)ని విక్రయించే వీలుండదు. కాబట్టి, రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత ఆస్తిని తిరిగి మీ పేరుపై మార్చుకోవాలి. ఆ తర్వాత ఆస్తిపై మీరు పూర్తి హక్కు పొందొచ్చు. అవసరం అయితే విక్రయించొచ్చు.
నాన్-ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ మీ ఆస్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులను కలిగి ఉంటుంది. నాన్-ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, ఆస్తిపై ఎటువంటి నమోదిత ఎన్‌కంబరెన్స్ లేవని ప్రకటించే చట్టపరమైన పత్రం. మీరు బ్యాంకుతో మీ బకాయిలను తీర్చివేసిన తర్వాత, ఈ రీపేమెంట్‌ను ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌లో ప్రతిబింబించేలా చూసుకోవాలి. దీని ఆధారంగా రుణ చెల్లింపు పూర్తి అయిన తర్వాత నాన్-ఎన్‌కంబరెన్స్ పొందుతారు. ఇది ఆస్తిపై ద్రవ్య, చట్టపరమైన హక్కులు బ్యాంకుకు లేవని నిర్ధారిస్తుంది.
క్రెడిట్ రికార్డుల అప్‌డేట్
మీరు ఏ రకమైన రుణాన్ని తీసుకున్నా.. అది మీ క్రెడిట్ రికార్డులలో నమోదవుతుంది. రుణం తీసుకున్నప్పుడు, బకాయిలు తీరుస్తున్నప్పుడు.. ఇవన్నీ మీ క్రెడిట్ రికార్డులలో అప్‌డేట్ అవుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు చూసుకోవడం మంచిది. అయితే ఈ రికార్డులు అప్‌డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. మీ రికార్డులు అప్‌డేట్ అయ్యాయని నిర్ధారించుకోవడానికి మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయవచ్చు. మీ రుణ చెల్లింపుల అనుగుణంగా క్రెడిట్ రికార్డులు అప్‌డేట్ అయితే, అవసరమైనప్పుడు కొత్తగా రుణం తీసుకోవడానికి మీకు అవకాశాలు మెరుగవుతాయి.
గృహ రుణాన్ని సెటిల్ చేయడం అనేది చాలా మంది రుణగ్రహీతలకు రుణ విముక్తిలాంటిదే. అయితే, పైన పేర్కొన్న చర్యలను విస్మరించడం వల్ల బ్యాంకులు ఏమైనా తప్పులు చేస్తే, భవిష్యత్‌లో రుణగ్రహీతకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. అందుచేత రుణం తీసుకునేటప్పుడు ఏయే పత్రాలు బ్యాంకుకు సమర్పించామో వాటి జాబితాను మీరు నోట్ చేసుకోవాలి. లేదా అవసరమైన పత్రాలను నకలు తీసి మీ వద్ద పెట్టుకోవాలి. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత వాటిని తిరిగి పొందడానికి ఈ జాబితా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ తనఖా పెట్టిన ఆస్తిపై మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!