Tips for young earners: ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నారా? ఈ 10 టిప్స్‌ మీ కోసమే!

సంపాదించడం ప్రారంభించిన వెంటనే పెద్ద పెద్ద లక్ష్యాల కోసం పెట్టుబడి ప్రారంభించాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఖర్చుల్ని మేనేజ్‌ చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా కొత్త సంపాదన ప్రారంభించిన వారికి ఉపయోగపడే కొన్ని టిప్స్‌ చూద్దాం.

Updated : 11 Dec 2022 20:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యాధునిక సాంకేతికత, మారుతున్న ప్రజల అవసరాలు, జీవన విధానాల్లో వస్తున్న మార్పుల కారణంగా నేటితరం యువత ఏదో ఒకరకమైన ఉపాధి పొందే వరకు విశ్రమించడం లేదు. పైగా ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు భారం కాకుండా వీలైనంత త్వరగా ఉద్యోగమో లేక వ్యాపారంలోనో స్థిరపడిపోవాలని చూస్తున్నారు. చిన్న వయసులోనే సంపాదించడం ప్రారంభిస్తే.. తొందరగా రిటైరై మలిదశ జీవితాన్ని ఆనందంగా గడపాలని కలలు కంటున్నారు. అందుకోసం చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో సంపాదించే మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. సంపాదించిన డబ్బును సరిగా నిర్వహించడంలో మాత్రం చతికిల పడుతున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? ఖర్చుల్ని ఎలా నియంత్రించాలో తెలియక ఆర్థిక లక్ష్యాల్ని చేరుకోవడంలో తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా సంపాదించడం ప్రారంభించినవారికి బాగా ఉపయోగపడే ఓ 10 చిట్కాలను గమనిద్దాం..

  • సంపాదించిన తొలినాళ్లలోనే పెద్ద పెద్ద ఖర్చులకు దూరంగా ఉండాలి. నెలవారీగా వస్తున్న ఆదాయం ఎలా ఖర్చవుతుందో కొన్ని నెలల పాటు నిశితంగా గమనించాలి. అద్దె, ఫోన్‌, భోజనం, ప్రయాణం.. ఇలా నిత్యావసరాలకు ఎంత ఖర్చవుతోంది? ఇవిగాక ఇంకా ఎలాంటి ఖర్చులు వస్తున్నాయో కొన్ని నెలల పాటు పరిశీలించాలి. తొలినాళ్లలోనే వాహనం, ఇంటి కొనుగోలుకు దూరంగా ఉంటే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
  • మీ దగ్గర ఉన్న డబ్బును సమర్థంగా ఉపయోగించుకోగలగాలి. నెలవారీ ఖర్చులుపోనూ మిగిలిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారనేది చాలా ముఖ్యమైన అంశం. నిజానికి డబ్బు నిర్వహణ అనేది ఒక నైపుణ్యం. ఎప్పటికప్పుడు కొత్త ఖర్చులు వస్తూనే ఉంటాయి. వాటన్నింటికీ మీ దగ్గర ఉన్న డబ్బు సరిపోయేలా చూసుకోవాలి. బ్యాంకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ ఎంతో తరచూ చెక్‌ చేసుకుంటుండాలి. నెలమొత్తానికి అవి సరిపోయేలా చూసుకోవాలి. మీ దగ్గర మిగిలి ఉన్న సొమ్ముకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి.
  • యువతలో సాధారణంగా ఉండే అవలక్షణం బద్ధకం. ఈ క్రమంలో ఫోన్‌, అద్దె, విద్యుత్తు.. ఇలా అన్ని బిల్లులను సకాలంలో చెల్లించడంలో ఆలస్యం చేస్తుంటారు. దీనికి చక్కని మార్గం ‘ఆటోపే’. అన్ని ఖర్చుల్ని మీకు మీరే మేనేజ్‌ చేయాలంటే కొంత ఇబ్బందికరమైన విషయమే. అందుకే కొన్ని బిల్లులకు ఆటోపే ఆప్షన్‌ సెట్‌ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు.
  • అత్యవసరమైతేనే క్రెడిట్‌ కార్డు తీసుకోండి. చెల్లింపులు చేయడానికి ఇప్పుడు అనేక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐలు ఉన్నా.. బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయండి. డబ్బు నిర్వహణపై మీకు ఓ స్పష్టత వచ్చే వరకు క్రెడిట్‌ కార్డు తీసుకోకపోవడమే మేలు.
  • మీరు ఎలా జీవించాలనుకుంటున్నారనే దానిపైనే మీ ఖర్చులు ఆధారపడి ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటే ఖర్చులు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఆర్జించడం ప్రారంభించిన తొలి రోజుల్లో సౌకర్యాలకు దూరంగా ఉండడమే మేలు. అప్పుడే మీకు డబ్బు నిర్వహణపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. ముందే భారీ ఎత్తున ఖర్చుపెట్టడానికి అలవాటు పడితే తర్వాత ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మేనేజ్‌ చేయలేక సతమతమవ్వాల్సి వస్తుంది.
  • బ్యాంకుల్లో కేవైసీ పత్రాలు సమర్పించడం, ఆధార్‌- పాన్‌ అనుసంధానం చేయడం, ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా ఖాతా తెరవడం వంటి ప్రాథమిక పనులన్నీ పూర్తి చేసుకోవాలి. అప్పుడే తర్వాత మీ పెట్టుబడులు, పన్ను చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయ పన్ను పరిధిలోకి వస్తే ఐటీఆర్‌ మీరే స్వయంగా దాఖలు చేయాలి. వివిధ రకాల ఐటీఆర్‌ ఫారాల గురించి తెలసుకోవాలి. అలాగే ఇల్లు, నీటి పన్ను సహా ఇతర పన్నులన్నీ మీరే స్వయంగా చెల్లించి ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
  • ఖర్చులను సరిగ్గా మేనేజ్‌ చేయగలగాలి. అందుకోసం వాటిని ఓ క్రమపద్ధతిలో విభజించుకోవాలి. నిత్యావసర వ్యయాలను ముందే పక్కకు తీసిపెట్టాలి. సరదాగా సినిమాకి వెళ్లడం, స్నేహితులతో చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం లాంటి ఖర్చులు తరచూ ఉండవు. అలాంటి వాటికి కూడా ఎంతో కొంత ముందే కేటాయించుకోవాలి. ఇలా ఖర్చులను విభజించుకుంటే దేనిపై ఎంత వరకు ఖర్చు చేయగలరో ముందే తెలిసిపోతుంది.
  • ఎట్టిపరిస్థితుల్లో అప్పులను నిర్లక్ష్యం చేయొద్దు. చదువుకునే సమయంలో లోన్‌ తీసుకొని ఉంటే వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఇతరత్రా అప్పులేమైనా ఉంటే.. వాటిని కూడా సకాలంలో చెల్లించేందుకు ప్రయత్నించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. వడ్డీ పేరుకుపోయి భారంగా పరిణమిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మీ ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
  • రిటైర్‌మెంట్‌కు ముందే ప్లాన్ చేసుకోవడం, ఇల్లు కొనడం.. వంటి పెద్దలు ఇచ్చే సలహాల్ని విస్మరించడానికి వీల్లేదు. కానీ, సంపాదించడం ప్రారంభించిన వెంటనే వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. వేతనం అందుకున్న రెండో లేదా మూడో నెలలోనే వీటిని ప్రారంభించారంటే అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం మానేయాల్సి వస్తే ఏంటి పరిస్థితి? అందుకే కాస్త కుదురుకొని.. మీ సంపాదన, ఖర్చులు, పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలపై ఓ క్లారిటీ వచ్చే వరకు ఆగడం మేలు.
  • ఒకరకంగా పీఎఫ్‌తోనే మీ మదుపు ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకే తొందరపడి వెంటనే పెద్ద పెద్ద మదుపు మార్గాలను ఆశ్రయించొద్దు. దాదాపు ఒక సంవత్సరం వరకు పొదుపుపైనే దృష్టి పెట్టండి. అప్పటి కల్లా మీకు మీ ఆర్థిక విషయాలపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు నెమ్మదిగా మీ అవసరాలు, లక్ష్యాలను బట్టి మదుపు చేయడం ప్రారంభించండి. మీరు సంపాదించేదంతా పెట్టుబడిలోకి మళ్లించి నిత్యావసరాల కోసం ఇబ్బంది పడొద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని