Credit Cards: భారత్‌లో టాప్‌ 10 లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్‌ కార్డులివే

ఈ మధ్యకాలంలో ఎటువంటి ఛార్జీలు లేకుండా మంచి ప్రయాజనాలు అందించే క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అటువంటి క్రెడిట్‌ కార్డుల గురించి ఇక్కడ చూడండి.

Published : 28 Dec 2023 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో క్రెడిట్‌ కార్డు వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్‌ నాటికి 8.60 కోట్ల క్రెడిట్‌ కార్డులు వాడకంలో ఉండగా.. ఈ సంఖ్య 2024 ప్రారంభం నాటికి 10 కోట్లకు చేరవచ్చని ఒక అంచనా. కొన్ని బ్యాంకులు వీటిపై వార్షిక ఫీజును వసూలు చేస్తుండంగా.. మరి కొన్ని వార్షిక ఫీజు/జాయినింగ్‌ ఫీజు లేకుండానే కార్డులు అందజేస్తున్నాయి. ఈ కార్డులతో రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, సైన్‌-అప్‌ బోనస్‌, వోచర్‌లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఇంకా మరెన్నో ఆఫర్లను అందుకోవచ్చు. ఫీజులు లేని ప్రముఖ బ్యాంకుల క్రెడిట్‌ కార్డులు, వాటి ప్రయోజనాలు కింద ఉన్నాయి.

కోటక్‌ ఫార్చ్యూన్‌ గోల్డ్‌ క్రెడిట్‌ కార్డు

వ్యాపారుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఈ కార్డు.. ఇంధనం, టికెట్‌ బుకింగ్‌ మొదలైన వాటిపై ప్రాథమిక క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్డుతో ఒక సంవత్సరంలో రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తే, నాలుగు పీవీఆర్‌ టికెట్లు లేదా రూ.750 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. రూ.500-3,000 ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపును పొందే అవకాశం ఉంది. ఈ కార్డు గలవారు కుటుంబసభ్యులకు యాడ్‌-ఆన్‌ కార్డును కూడా పొందొచ్చు.

అమెజాన్‌ పే-ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు

అమెజాన్‌ అనేక షాపింగ్‌ అవసరాలకు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అయినందున ఈ కార్డుతో చాలా ప్రయోజనాలుంటాయి. రోజువారీ కొనుగోళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్‌ కార్డు ఉన్న కస్టమర్లు కలినరీ ట్రీట్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా భారత్‌లోని 2,500 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌లో డైనింగ్‌ బిల్లులపై 15% ఆదా చేసుకోవచ్చు. 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపును కూడా పొందే అవకాశముంది. పొందిన రివార్డులపై పరిమితి, గడువు తేదీ లేదు. అమెజాన్‌లో రివార్డు పాయింట్లను రిడీం చేసుకోవచ్చు. మీరు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగి ఉంటే అమెజాన్‌ ఇండియాలో కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ లేకపోతే 3% క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఉంది.

AU LIT క్రెడిట్‌ కార్డు

దేశీయ, అంతర్జాతీయ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రిటైల్‌ లావాదేవీలపై 5X, 10X రివార్డు పాయింట్లను పొందొచ్చు. 90 రోజుల కాలవ్యవధిలో మూడుసార్లు 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ఖర్చు చేసిన ప్రతి రూ.100కు 1 రివార్డు పాయింట్‌తో పాటు మీ రిటైల్‌ లావాదేవీల కోసం 2-5% క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి అవకాశముంది. రూ.400-5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు పొందొచ్చు. ప్రతి 3 నెలలకు నాలుగు సార్లు విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్‌ పొందొచ్చు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రైమ్‌ క్రెడిట్‌ కార్డు

రోజువారీ ఖర్చులపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను కోరుకునేవారికి ఈ కార్డు సరైనది. ఈ కార్డుకు వార్షిక, పునరుద్ధరణ రుసుము లేవు. కనీసం రూ.15 వేలు ఎఫ్‌డీ చేసినవారికి ఈ కార్డును జారీచేస్తారు. లావాదేవీలపై వచ్చే రివార్డు పాయింట్లకు సరిపడా నగదు మొత్తాన్ని మీ క్రెడిట్‌ కార్డుకు జమ చేస్తారు. రూ.2,500 కంటే ఎక్కువ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతి నెలా రూ.250 వరకు ఇంధన సర్‌ఛార్జీ మాఫీ చేస్తారు.

షాపర్స్‌ స్టాప్‌-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు

ఈ క్రెడిట్‌ కార్డుతో ప్రతి కొనుగోలుపై రివార్డ్స్‌ పొందొచ్చు. కార్డుదారులు షాపర్స్‌ స్టాప్‌ ప్రైవేట్‌ లేబుల్‌ బ్రాండ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ.150 కొనుగోలుపై 6 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లను పొందొచ్చు. రూ.500 విలువైన షాపర్స్‌ స్టాప్‌ వోచర్‌ను పొందొచ్చు. దీంతో షాపర్స్‌ స్టాప్‌ స్టోర్‌లో కనీసం రూ.3000 కొనుగోలు చేసినప్పుడు ఆ వోచర్‌ను రిడీం చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్డుపై ఒక సంవత్సరంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే, 2000 ఫస్ట్‌ సిటిజన్‌ పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. రూ.400-5000 మధ్య ఇంధన లావాదేవీలపై 1% ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపు పొందొచ్చు. అధికంగా షాపింగ్‌ చేసేవారికి ఈ క్రెడిట్‌ కార్డు అనువైనది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినం చిప్‌ క్రెడిట్‌ కార్డు

ఈ కార్డుతో ఇంధనం మినహా రిటైల్ స్టోర్లలో మీరు ఖర్చు చేసే ప్రతి రూ.100కు 2 రివార్డు పాయింట్లను పొందొచ్చు. ఈ కార్డును నిర్వహించడం కూడా చాలా సులభం. బీమా, యుటిలిటీపై ఖర్చు చేసే ప్రతి రూ.100కు 1 రివార్డ్‌ పాయింట్‌ లభిస్తుంది. భారత్‌ అంతటా హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ పంపుల వద్ద 1% (గరిష్ఠంగా రూ.4 వేలు) ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపును పొందొచ్చు. దేశంలో 12 ప్రధాన నగరాల్లో 2,500 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌లో డైనింగ్‌పై కనీసం 15% ఆదా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎక్కువ రివార్డు పొందాలనుకునేవారికి ఈ కార్డు అనుకూలంగా ఉంటుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ సెలక్ట్‌ క్రెడిట్‌ కార్డు

ఈ కార్డుకు ప్రవేశ, వార్షిక ఫీజులు లేనప్పటికీ లగ్జరీ క్రెడిట్‌ కార్డు మాదిరి అన్ని ఫీచర్లను అందిస్తుంది. ఈ కార్డుతో రూ.15 వేలు ఖర్చు చేస్తే, రూ.500 విలువైన వోచర్‌ను పొందొచ్చు. ఆన్‌లైన్‌లో చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 6 రివార్డ్‌ పాయింట్లు, ఆఫ్‌లైన్‌లో ప్రతి 150 ఖర్చుపై 3 రివార్డ్‌ పాయింట్లు పొందొచ్చు. ఒక రివార్డు పాయింట్‌ విలువ 25 పైసలు. రివార్డు పాయింట్లపై పరిమితి లేదు. త్రైమాసికానికి 4 ఉచిత విమానాశ్రయ, రైల్వే లాంజ్‌ సందర్శనలు చేయొచ్చు. నెలకు రూ.300 వరకు ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపును పొందొచ్చు. ఈ కార్డు పొందిన వారికి ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా ఉంది. ఈ కార్డుతో రూ.1 కోటి విమాన ప్రమాద కవర్‌, రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద కవర్‌, రూ.22,500 సమగ్ర ప్రయాణ బీమా రక్షణ లాంటి ప్రయోజనాలను పొందొచ్చు.

ధనలక్ష్మి బ్యాంక్‌ ప్లాటినం క్రెడిట్‌ కార్డు

ఇది సూపర్‌ మార్కెట్లు, డిపార్ట్‌మెంట్ల స్టోర్ల కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఈ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై రూ. 1 లక్ష వరకు ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఉంది. విమాన ప్రమాద బీమా రూ.20 లక్షల వరకు ఉంది. దీనికి గాను గ్లోబల్‌ కస్టమర్‌ కేర్ అందుబాటులో ఉంటుంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ నియో క్రెడిట్‌ కార్డు

ఈ కార్డు ద్వారా చేసే అన్ని కొనుగోళ్లపై ఎడ్జ్‌ రివార్డ్‌ పాయింట్లను పొందడంతో పాటు Paytm, Myntra, Zomato వంటి భాగస్వామ్య బ్రాండ్‌లపై డిస్కౌంట్స్‌ పొందుతారు. బుక్‌మైషో ద్వారా సినిమా టిక్కెట్లు కొనుగోలు చేస్తే, 10% డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రతి రూ.200 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్‌ పొందుతారు. మీరు యుటిలిటీ బిల్లులపై 5% తగ్గింపును పొందొచ్చు. అంతేకాకుండా ఈ క్రెడిట్‌ కార్డును గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లకు లింక్‌ చేయొచ్చు.

ఇండస్‌ఇండ్‌ లెజెండ్‌ క్రెడిట్‌ కార్డు

షాపింగ్‌ నుంచి ప్రయాణాల వరకు అన్ని ఖర్చులపై రివార్డ్స్‌ పాయింట్లు, డిస్కౌంట్స్‌ పొందుతారు. ఇది అన్ని ఆదాయ వర్గాల వారికి సరిపోతుంది. ఈ కార్డుతో సోమవారం నుంచి శుక్రవారం వరకు చేసే ప్రతి రూ.100 విలువ గల కొనుగోలుపై ఒక రివార్డు పాయింట్‌ పొందుతారు. అదే శనివారం, ఆదివారం అయితే రూ.100 కొనుగోలుపై 2 రివార్డ్‌ పాయింట్లు పొందుతారు. ఈ కార్డుతో సినిమా టికెట్ల బుకింగ్‌పై కూడా ఆఫర్లు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని