UPI Payment: యూపీఐలో వేరొకరికి పేమెంట్‌ చేశారా? డబ్బు తిరిగి పొందొచ్చు..

యూపీఐ ద్వారా పొరపాటున డబ్బు వేరొకరికి పంపితే ఆందోళన పడకండి. మీరు డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది.

Updated : 03 Jan 2023 11:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌తో చాలా వరకు లావాదేవీలు బ్యాంకుకు వెళ్లకుండానే జరిగిపోతున్నాయి. ఇక UPIనైతే.. ఫోన్‌ ఉంటే చాలు ఉన్నచోట క్షణాల్లో చెల్లింపులు చేసేస్తున్నాం. అవతలి వ్యక్తి యూపీఐ ఐడీ, ఫోన్‌ నంబర్‌, క్యూర్‌ కోడ్‌ స్కాన్‌.. ఇలా ఏది ఉన్నా డబ్బు సులభంగా పంపించే సౌకర్యం దీంతో లభిస్తుంది. ఇన్ని సౌకర్యాల మధ్య ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు జరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు యూపీఐ ఐడీ/ఫోన్‌ నంబరు వంటివి ఎంటర్‌ చేసే క్రమంలో పారపాట్లు జరుగుతుంటాయి. ఇలా పొరపాటున డబ్బు వేరొకరికి పంపితే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు చేసి డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది.

వివరాలను భద్రపరచండి..

డబ్బు బదిలీ చేసిన తర్వాత మీ ఖాతా నుంచి డబ్బు డిడక్ట్‌ అయినట్లు మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. దాన్ని సేవ్‌ చేసుకోండి. వాపసు కోసం ఈ సందేశంలో వివరాలు అవసరమవుతాయి. అలాగే మీరు యాప్‌ నుంచి డబ్బు పంపించిన వివరాలను స్క్రీన్‌ షాట్‌ తీసి పెట్టుకోండి.

యూపీఐ యాప్‌ సపోర్ట్‌..

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ముందుగా మీరు ఏ యూపీఐ యాప్‌ (పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటివి) ద్వారా డబ్బు పంపిచారో, ఆ యాప్‌లోని కస్టమర్‌ సర్వీస్‌ ఆప్షన్ ద్వారా సమస్యను తెలియజేయండి. ప్రతి యాప్‌ కూడా వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సొంత మోకానిజంను నిర్వహిస్తున్నాయి. కాబట్టి, కస్టమర్‌ సర్వీసును సంప్రదించి వాపసు అడగవచ్చు.

NPCI

యూపీఐ యాప్‌ కస్టమర్‌ సర్వీసు నుంచి సాయం అందకపోతే, మీరు ఎన్‌పీసీఐ (NPCI) పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్‌పీఎస్‌ఐ అధికారిక వెబ్‌సైట్‌ npci.org.in వెబ్‌సైట్‌కు వెళ్లి..'What we do' ట్యాబ్‌లో యూపీఐపై క్లిక్‌ చేసి కంప్లయింట్ సెక్షన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. నేరుగా ఈ లింక్‌ను క్లిక్‌ చేసి ఫిర్యాదుల పేజీకి వెళ్లవచ్చు.

బ్యాంకు..

ఈ విషయం గురించి మీరు బ్యాంకు వద్ద కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (పీఎస్‌పీ) బ్యాంకు, ఆ తర్వాత కస్టమర్‌ ఖాతా ఉన్న బ్యాంకు వద్ద కంప్లయింట్‌ ఫైల్‌ చేయవచ్చు. బ్యాంకు వారు సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపసు చేసేందుకు ప్రయత్నిస్తారు.

అంబుడ్స్‌మెన్‌..

పైన తెలిపిన మార్గాల ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకోలేకపోతే bankingombudsman.rbi.org.in వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. 

లీగల్‌గా..

ఒకవేళ మీరు తప్పు లావాదేవీ చేసి వేరే వ్యక్తికి డబ్బు పంపితే.. ఆ వ్యక్తి డబ్బు వాపసు ఇచ్చేందుకు నిరాకరించినట్లయితే.. అప్పుడు చట్టబద్ధంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు. 

చివరిగా..

పొరపాటున డబ్బు బదిలీ చేసినప్పటికీ, డబ్బు తిరిగి ఇచ్చేందుకు కస్టమర్‌ అంగీకరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి లావాదేవీలు నిర్వహించేముందు ఫోన్‌ నంబర్‌, యూపీఐ ఐడీ వంటి వాటిని రెండు, మూడు సార్లు చెక్‌ చేసుకోవడం మంచిది. దుకాణాల వద్ద లేదా ఇతర క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు చేస్తున్నప్పుడు.. స్కాన్‌ చేసిన తర్వాత చెల్లింపులు పొందే వ్యక్తి లేదా వ్యాపార సంస్థ పేరును ధ్రువీకరించుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని