Parag Desai: వీధి కుక్కల దాడిలో గాయపడి వ్యాపారవేత్త పరాగ్‌ దేశాయ్‌ కన్నుమూత!

Parag Desai | వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్‌ తుదిశ్వాస విడిచారు. ఇంటికి సమీపంలో వీధి కుక్కల దాడిలో ఆయన కిందపడినట్లు సమాచారం. ఆ సమయంలోనే తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.

Published : 24 Oct 2023 01:07 IST

దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్‌ బక్రీ టీ (Wagh Bakri Tea) గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్‌ (Parag Desai)(49) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆదివారం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతవారం ఆయన ఇంటికి సమీపంలో కింద పడడంతో తలకు గాయమైనట్లు సన్నిహితులు తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే మెదడులో రక్తస్రావం వల్ల తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు.

ఇంటికి సమీపంలో వీధి కుక్కలు దాడి చేయడంతోనే పరాగ్‌ దేశాయ్‌ (Parag Desai) కింద పడ్డట్లు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దాడి విషయం భద్రతా సిబ్బంది నుంచి కుటుంబ సభ్యులు తెలుసుకొని ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నాయి. పరాగ్‌ దేశాయ్ మృతిపట్ల కాంగ్రెస్‌ ఎంపీ శక్తిసిన్హా గోహిల్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వాఘ్‌ బక్రీ టీ (Wagh Bakri Tea) గ్రూప్‌ ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లలో పరాగ్‌ దేశాయ్‌ (Parag Desai) ఒకరు. కంపెనీని ఈ-కామర్స్‌లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కంపెనీ సేల్స్‌, మార్కెటింగ్‌, ఎక్స్‌పోర్ట్‌ విభాగాల కార్యకలాపాలను పరాగ్‌ (Parag Desai) పర్యవేక్షించేవారు. ఆయన అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. వాఘ్‌ బక్రీ గ్రూప్‌ (Wagh Bakri Tea)ను 1892లో నరన్‌దాస్‌ దేశాయ్‌ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్‌ రూ.2,000 కోట్లు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు