Jeff Bezos: అమ్మకానికి ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’.. బెజోస్ ఏమన్నారంటే?

అమెరికా రాజకీయాల్లో వాషింగ్టన్‌ పోస్ట్‌ (Washington Post) పత్రికకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దీని యజమానికి జెఫ్‌ బెజోస్‌. అయితే, ఓ ఫుట్‌బాల్‌ జట్టును కొనాలనుకుంటున్న ఆయన వాషింగ్టన్‌ పోస్ట్‌ (Washington Post)ను విక్రయించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Published : 24 Jan 2023 12:10 IST

న్యూయార్క్‌: అమెరికాలో ప్రధాన వార్తాపత్రిక అయిన వాషింగ్టన్‌ పోస్ట్‌ (Washington Post)ను దాని యజమాని జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) విక్రయించనున్నారంటూ అగ్రరాజ్యంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫుట్‌బాల్‌ క్రీడను అమితంగా ఇష్టపడే ఆయన ఓ జట్టును కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకోసమే ఆయన వాషింగ్టన్‌ పోస్ట్‌ (Washington Post)ను విక్రయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ పోస్ట్‌’ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

వాషింగ్టన్‌ పోస్ట్‌ (Washington Post) అధికార ప్రతినిధులతో పాటు స్వయంగా జెఫ్‌ బెజోస్ (Jeff Bezos) సైతం ఈ వార్తల్ని ఖండించినట్లు ‘సీఎన్‌ఎన్‌’ తెలిపింది. వాషింగ్టన్‌ పోస్ట్‌ను విక్రయించే ఆలోచన లేదని బెజోస్‌ (Jeff Bezos) స్పష్టం చేసినట్లు వెల్లడించింది. న్యూయార్క్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనంలో ఏమాత్రం వాస్తవం లేదని వారు పేర్కొన్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ (Washington Post) సీనియర్‌ ఉద్యోగులతోనూ బెజోస్‌ స్పష్టం చేసినట్లు రాసుకొచ్చింది. అయితే, ఇటీవల ఆయన సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. ‘వాషింగ్టన్‌ కమాండర్స్‌’ అనే ఫుట్‌బాల్‌ జట్టును కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని మాత్రం పరోక్షంగా సంకేతాలిచ్చారు.

‘వాషింగ్టన్‌ కమాండర్స్‌’ జట్టు యాజమాన్యంలో చాలా నిర్వహణ లోపాలు ఉన్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ గతంలో పలు కథనాలను ప్రచురించింది. స్వయంగా జట్టు యజమాని డ్యాన్‌ స్నైడర్‌పైనా అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఇది జెఫ్‌ బెజోస్‌, స్నైడర్‌ మధ్య వ్యక్తిగత వివాదానికి దారితీసింది. వాషింగ్టన్‌ కమాండర్స్‌ జట్టును కొనాలనుకుంటున్న బెజోస్‌.. తమపై ఒత్తిడి పెంచి విక్రయించేలా చేసేందుకే ఇలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని స్నైడర్‌ ఆరోపించారు.

ప్రపంచ స్పోర్ట్స్‌ లీగ్‌లలో వాషింగ్టన్‌ కమాండర్స్‌ను అత్యంత ప్రజాదరణ ఉన్న ఫ్రాంఛైజీగా క్రీడావర్గాలు చెబుతుంటాయి. ఈ జట్టు 1983, 1988, 1992లో సూపర్‌ బౌల్స్‌ను సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని