PPF Claim: పీపీఎఫ్‌ ఖాతాదారుడు మరణిస్తే డబ్బు ఎవరికి చెల్లిస్తారు?

ఈ ఖాతాకు లభించే వడ్డీ రాబడికి ఆదాయపు పన్ను లేకపోవడం ప్రధాన ఆకర్షణ.

Updated : 19 Oct 2022 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన పొదుపు పథకాలలో పీపీఎఫ్‌ ఒకటి. పీపీఎఫ్‌కు వడ్డీ ప్రస్తుతం 7.10%గా ఉంది. దీని కాలవ్యవధి 15 సంవత్సరాలు. వడ్డీపై ఆదాయపు పన్ను లేకపోవడం ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణ. పోస్టాఫీసు శాఖల్లోనే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో కూడా పీపీఎఫ్‌ తీసుకోవచ్చు.

18 సంవత్సరాలు నిండిన భార‌తీయ పౌరులు ఎవ‌రైనా పీపీఎఫ్‌ ఖాతాను తెరవొచ్చు. కనిష్ఠంగా రూ. 500, గరిష్ఠంగా రూ. 1.50 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఖాతా తెర‌వ‌డానికి గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి లేదు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెర‌వాలి. 2వ ఖాతాను మైన‌ర్ పేరు మీద నిర్వహించుకోవచ్చు. అది కూడా మైన‌ర్ మైనారిటీ తీరే వ‌ర‌కు మాత్రమే. ఉమ్మడిగా ఖాతా తీసుకునే సౌక‌ర్యం లేదు. ఖాతాదారుల‌కు నామినీ సదుపాయం ఉంటుంది. అయితే మైనర్‌ తరపున ఖాతా తెరిచినపుడు నామినీకి అనుమతి ఉండదు. మేజర్‌ అయిన తర్వాత నామినీని పేర్కొనవచ్చు.

నామినీ:

ఈ ఖాతాకు నామినీ కీలకాంశం. ఖాతాదారుడు పీపీఎఫ్‌ కాలావధిలో మరణిస్తే.. అప్పటి వరకు చెల్లించిన సొమ్ము, నిబంధనల మేరకు లభించే వడ్డీతో సహా నామినీ లేదా చట్టపరమైన వారసులకు క్లెయిమ్‌ ద్వారా అందుతుంది. అలాగే ఖాతాను మూసివేస్తారు. కాలవ్యవధి ఇంకా మిగిలి ఉన్నా కూడా.. మరణించిన వారి పేరుతో లేదా నామినీ పేరు మీద ఖాతా కొనసాగించడానికి వీలుండదు. పీపీఎఫ్‌ మరొకరి పేరు మీద బదిలీ చేసే వీలుండదు.

క్లెయిమ్‌కు ఏ పత్రాలు అవసరం?

నామినీ/నామినీలు వారి గుర్తింపు పత్రాలతో సహా ఫారమ్‌-జీ నింపాలి. పీపీఎఫ్‌ ఖాతాదారుని అధికారిక మరణ ధ్రువీకరణ పత్రం, ఖాతా పాస్‌బుక్‌ వంటివన్నీ సంబంధిత పీపీఎఫ్‌ కార్యాలయానికి అందజేయాలి.

నామినీ లేకపోతే క్లెయిమ్‌ ఎలా?

ఖాతాదారుడు నామినీ పేర్కొనకుండా మరణిస్తే..లభించే మొత్తం రూ. 5 లక్షలు మించకుండా ఉన్నప్పుడు చట్టపరమైన వారసులకు డబ్బును అందజేస్తారు. క్లెయిమ్‌ మొత్తం రూ. 5 లక్షలు దాటితే.. ఫారం-11తో సహా పీపీఎఫ్‌ ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, పీపీఎఫ్‌ పాస్‌బుక్‌, డిపాజిట్‌ రశీదులు లేదా ఖాతా స్టేట్‌మెంట్‌, ఫారం-13లో 'అఫిడవిట్‌' (లిఖిత వాంగ్మూలం), ఫారం-14లో 'డిస్‌క్లైమర్‌ పత్రం', ఫారం-15లో 'బాండ్‌ ఆఫ్‌ ఇండెమ్నిటీ'తో పాటు కోర్టు జారీచేసిన 'సక్సెషన్‌ (వారసత్వ) సర్టిఫికేట్‌'ను పీపీఎఫ్‌ కార్యాలయానికి సమర్పించి చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

నామినీకి చట్టపరమైన వారసత్వం లేకపోతే..

వారసత్వ చట్టం ప్రకారం, చట్టపరమైన వారసులు లేదా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి మాత్రమే ట్రస్టీగా నామినీ వ్యవహరించగలడు. అంటే.. చట్టపరమైన వారసులకు క్లెయిమ్‌ మొత్తాన్ని అప్పగించడాన్ని నామినీ అడ్డుకోలేడు.

నామినీలు ఎంతమంది ఉండొచ్చు?

పీపీఎఫ్‌ ఖాతాను తెరిచినప్పుడు మొత్తం నలుగురు నామినీల వరకు పేర్కొనవచ్చు. ఖాతా కాలవ్యవధిలో ఎప్పుడైనా నామినీని ఫారం-ఈ అందజేసి జోడించవచ్చు. ఫారం-ఎఫ్‌ అందజేసి ఒక నామినీని తీసివేసి ఇంకొకరి పేరును పేర్కొనవచ్చు. బహుళ నామినీల విషయంలో ప్రతి నామినీకి లబ్ధి పొందే వాటా శాతాన్ని తెలపొచ్చు. వాటా శాతం పేర్కొనకపోతే..క్లెయిమ్‌ మొత్తం సమానంగా పంపిణీ అవుతుంది. అలాగే, నామినీలలో ఎవరైనా మరణించినట్లయితే..మిగిలినవారు క్లెయిమ్‌ సమయంలో అతని మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం ద్వారా వాటా సమానంగా పంచుకోవచ్చు. అంతేకాకుండా వ్యక్తులనే నామినీ కింద పేర్కొనాలి, ట్రస్ట్‌ని నామినీ చేయడానికి అవకాశం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని