Xiaomi Car: షావోమి కారు వచ్చేస్తోంది.. ఎలా ఉందో చూశారా?

Xiaomi Car | షావోమి విద్యుత్‌ కారు ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి రానుంది. చైనాలో విక్రయాల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకుంది.

Published : 16 Nov 2023 13:56 IST

Xiaomi Car | బీజింగ్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమి తమ తొలి కారు (Xiaomi Car)ను త్వరలో తీసుకురాబోతోంది. షావోమి ఎస్‌యూ7 (Xiaomi SU7) పేరిట తీసుకొస్తున్న ఈ విద్యుత్‌ కారు విక్రయాల కోసం కంపెనీ చైనాలో లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది. దీన్ని కంపెనీ స్వయంగా తయారు చేయడం లేదు. ‘బీజింగ్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (BAIC)’కు కాంట్రాక్టుకు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ఈ శాఖ ప్రతినెలా కొత్త కార్ల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలోనే షావోమి కారు వివరాలను సైతం బహిర్గతం చేసింది.

షావోమి ఎస్‌యూ7 (Xiaomi SU7).. సెడాన్‌ విభాగంలో వస్తోంది. కారు వీల్‌బేస్‌ 3000 ఎంఎం. ఈ కారులో లైడర్‌ సెన్సర్‌ కూడా ఉంది. ‘బీ పిల్లర్‌’పై కెమెరా కూడా ఉన్నట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఫేస్‌ రికగ్నిషన్‌ అన్‌లాకింగ్‌’ ఫీచర్‌ ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్‌ట్రెయిన్‌లో రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి 220 కిలోవాట్‌ మోటార్‌తో కూడిన ‘రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD)’.. మరొకటి 495 కిలోవాట్‌ మ్యాగ్జిమమ్‌ పవర్‌ (220 kW + 275 kW)తో కూడిన ‘ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ (AWD)’.

షావోమి ఎస్‌యూ7, ఎస్‌యూ7 ప్రో, ఎస్‌యూ7 మ్యాక్స్‌ అనే మూడు వేరియంట్లలో ఈ కారు రాబోతోంది. టోల్‌ చెల్లింపులు జరిగే సమయంలో వాహనం ఆపాల్సిన అవసరం లేకుండా ఈటీసీ ఫంక్షన్‌ వ్యవస్థను కూడా పొందుపర్చారు. స్మార్ట్‌ఫోన్‌ సహా కార్లలోనూ ఉపయోగించేలా హైపర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దీనికోసం ప్రత్యేకంగా రూపొందించారు. 5 సీట్లతో వస్తున్న ఈ కారు వాణిజ్య తయారీని 2023 డిసెంబర్‌లో ప్రారంభించనుంది. 2024 ఫిబ్రవరి నుంచి కస్టమర్లకు సరఫరా మొదలుపెట్టనున్నారు. BAICలో ఇప్పటికే ప్రయోగాత్మక తయారీ ప్రారంభమైంది. ఈ కంపెనీ ఇప్పటికే చైనా మార్కెట్‌ కోసం మెర్సిడెస్‌ బెంజ్‌ను కూడా ఉత్పత్తి చేస్తోంది. ఈవీ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు షావోమి 2021లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం 10 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. 2023 ఆగస్టులో షావోమిఈవీ.కామ్‌ పేరిట ప్రత్యేక డొమైన్‌ను రిజిస్టర్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని