YouTube: కంటెంట్‌ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌.. ఇకపై యూట్యూబ్‌లోనే డబ్బింగ్‌!

కంటెంట్ క్రియేటర్ల (Content Creators) కోసం యూట్యూబ్‌ (YouTube) కొత్త టూల్‌ను తీసుకొచ్చింది. ఈ టూల్‌తో యూట్యూబర్లు ఆడియో డబ్బింగ్‌ కోసం ఇకపై థర్డ్‌పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరంలేదు. 

Published : 25 Jun 2023 23:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూట్యూబ్‌ (YouTube)లో సరదాగా చేసిన షార్ట్‌ వీడియోలతో ఎంతో మంది సామాన్యులు సెలబ్రిటీలు అయిపోయారు.  గత రెండేళ్లలో కంటెంట్ క్రియేటర్ల (Content Creators) సంఖ్య గణనీయంగా పెరిగింది. కొందరు పాపులారిటీ కోసం కంటెంట్‌ పోస్ట్‌ చేస్తుంటే.. మరికొంతమంది ఆసక్తికర వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. అలాంటి వారి కోసం యూట్యూబ్‌ మరో కొత్త టూల్‌ను తీసుకొచ్చింది. ఈ టూల్‌తో కంటెంట్‌ క్రియేటర్లు తమ వీడియోలోని ఆడియోను ఇతర భాషల్లోకి డబ్‌ చేయొచ్చు. ఇందుకోసం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు అలౌడ్‌ (Aloud) అనే కృత్రిమమేధ (AI) ఆధారిత టూల్‌ను ఉపయోగించాలి. దీంతో కంటెంట్‌ క్రియేటర్లు తమ వీడియోలోని ఆడియోను సులువుగా డబ్ చేయొచ్చని యూట్యూబ్‌ వెల్లడించింది. దానివల్ల ఎక్కువమంది వీడియోలను చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. 

గతేడాది ఏరియా 120 ఇంక్యుబేటర్‌లో భాగంగా అలౌడ్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. పరీక్షల అనంతరం ఈ టూల్‌ను యూట్యూబ్‌ కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్‌ ఈ టూల్‌ను ఉపయోగించి డబ్‌ చేసిన తర్వాత ఆడియోను విని అందులో మార్పులు కూడా చేసుకోవచ్చు. గతంలో ఆడియో డబ్బింగ్ కోసం కంటెంట్‌ క్రియేటర్లు థర్డ్‌ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. అలౌడ్‌తో ఆ సమస్యకు పరిష్కారం లభించిందని యూట్యూబ్‌ అభిప్రాయపడింది. 

ప్రస్తుతం అలౌడ్‌తో ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ భాషల్లోకి ఆడియోను డబ్ చేసుకోవచ్చు. త్వరలో హిందీ సహా ఇతర భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషలను అలౌడ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూట్యూబ్‌ వెల్లడించింది. ‘‘ఇప్పటికే అలౌడ్‌ను పలువురు కంటెంట్ క్రియేటర్లు పరీక్షించారు. విడతల వారీగా అందరికీ ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. భవిష్యత్తులో అలౌడ్‌లో వాయిస్‌ ప్రిజర్వేషన్‌, లిప్‌ రీ-యానిమేషన్‌, ఎమోషన్ ట్రాన్స్‌ఫర్‌ అనే మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తాం’’ అని యూట్యూబ్‌ క్రియేటర్స్ ప్రొడక్ట్స్ వైస్‌ప్రెసిడెంట్ అంజాద్‌ హనీఫ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని