logo

రక్షణలేని మరో 19 భవనాలకు తాఖీదులు

అగ్ని ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం క్షేత్రస్థాయి తనిఖీల్లో దూకుడు పెంచింది.

Published : 02 Apr 2023 03:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: అగ్ని ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం క్షేత్రస్థాయి తనిఖీల్లో దూకుడు పెంచింది. ప్రధాన రహదారులపై నిత్యం రద్దీగా ఉండే భవన సముదాయాలు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లను తనిఖీ చేసి ఇటీవల 40 భవనాలకు నోటీసులు ఇవ్వగా, కొత్తగా మరో 19 భవనాలకు ఇచ్చినట్లు ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి శనివారం ప్రకటించారు. మూడురోజుల గడువుతో పరిస్థితిని చక్కదిద్దుకోవాలని హెచ్చరిస్తూ ఆయా వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు.  

ఆక్రమణలపై ఫిర్యాదు చేయండిలా..

నగరవ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాలు, పార్కులకు కేటాయించిన స్థలాల ఆక్రమణలపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి కోరారు. ఆధారాలు, దస్త్రాలు పరిశీలించి వాటిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపిస్తామన్నారు.  

జరిమానా విధింపు..

నివాసయోగ్యపత్రం(ఓసీ) తీసుకున్నాకే హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనలను బేఖాతరు చేస్తూ జూబ్లిహిల్స్‌ రోడ్డు నం.9లోని భవనంలో ఏర్పాటు చేసిన జైతుమ్‌ బ్రీవింగ్‌ కో హోటల్‌, హైటెక్‌సిటీలోని ఇస్తా వెజిటేరియన్‌ హోటల్‌ యాజమాన్యాలకు నోటీసు ఇచ్చామన్నారు. ఈసీఐఎల్‌లోని ఏఎంఆర్‌ ప్లానెట్‌, సికింద్రాబాద్‌లోని లైఫ్‌స్టైల్‌, కుందన్‌బాగ్‌లోని మైహోమ్‌ టైకూన్‌ భవన సముదాయాలు అక్రమంగా పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నాయని తేలడంతో, ఆయా సంస్థలకు రూ.50వేల చొప్పున జరిమానా విధించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని