logo

Hyderabad Metro: మెట్రో ట్రిప్పుల్లో కోత..

అసలే ఆదరణ అంతంత మాత్రం... ఆపై ఫ్రీక్వెన్సీ తగ్గింపు.. దీంతో మెట్రోరైలు కారిడార్‌-2 జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. గ్రీన్‌లైన్‌లో క్రమంగా మెట్రోరైలు ప్రయాణ ట్రిప్పులను తగ్గించుకుంటూ వస్తున్నారు.

Updated : 12 Jun 2023 08:56 IST

15 నుంచి 17 నిమిషాలపాటు ఎదురుచూపులు
జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో ప్రయాణికులకు అవస్థలు

ఎంజీబీఎస్‌ స్టేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: అసలే ఆదరణ అంతంత మాత్రం... ఆపై ఫ్రీక్వెన్సీ తగ్గింపు.. దీంతో మెట్రోరైలు కారిడార్‌-2 జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. గ్రీన్‌లైన్‌లో క్రమంగా మెట్రోరైలు ప్రయాణ ట్రిప్పులను తగ్గించుకుంటూ వస్తున్నారు. మొదట్లో ఏడు నిమిషాలకు ఒక సర్వీసు నడిపినా.. ప్రయాణికులు తక్కువగా ఉంటున్నారని 12 నిమిషాలకు మార్చారు. అయినా ప్రయాణించేవారు ఓపిగ్గా ఎదురుచూసేవారు. ఇప్పుడు ఏకంగా 15 నిమిషాలకు, కొన్నిసార్లు 17 నిమిషాలకు ఒక మెట్రో వస్తోందని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.  

తక్కువ ఛార్జితో..

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ పది కి.మీ. దూరం ఉంటుంది. మధ్యలో ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడిదాక ప్రయాణించినా ఈ మార్గంలో రూ.15 మాత్రమే వసూలు చేస్తోంది. ఆదరణ తక్కువ ఉండటంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఛార్జీలను సగానికి తగ్గించింది. ప్రస్తుతం ఈ మార్గంలో బస్సు, ఆటోలు, ఇతరత్రా ఏ ప్రయాణ సాధనంతో పోల్చినా మెట్రో ఛార్జీలే తక్కువగా ఉన్నాయి. ఈ ఆఫర్‌తో ప్రయాణికులు సైతం పెరిగారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం అయితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎనిమిది నుంచి 10 నిమిషాలకు ఒకటి చొప్పున నడుపుతూ ట్రిప్పుల సంఖ్యను పెంచితే మేలని ప్రయాణికులు అంటున్నారు.

అనుసంధానం లేదు..

ఫ్రీక్వెన్సీ తగ్గింపుతో ప్రయాణికులు మరో సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రసాద్‌ వారం రోజుల క్రితం మూసాపేట నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వెళ్లేందుకు మెట్రో ఎక్కారు. నేరుగా టిక్కెట్‌ తీసుకున్నారు. పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్‌లో దిగి పక్కనే ఉన్న జేబీఎస్‌ మెట్రోకి చేరుకునే సరికి అప్పుడే ఎంజీబీఎస్‌కు మెట్రో వెళ్లింది. దీంతో ఆయన మరో సర్వీసు వచ్చేవరకు 15 నిమిషాలు ఎదురుచూడక తప్పలేదు. ఇలా రెడ్‌లైన్‌, బ్లూలైన్‌ నుంచి గ్రీన్‌లైన్‌లో ప్రయాణించేవారికి అనుసంధానం సమస్యలు తలెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని