logo

పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక

వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్‌ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు.

Updated : 18 Apr 2024 05:07 IST

సివిల్స్‌లో నాలుగోయత్నంలో రాణించిన గొట్లపల్లి యువకుడు అష్ఫక్‌  

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్‌ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు మూడుసార్లు అపజయం ఎదురైనా కుంగిపోలేదు. మరింత పట్టుదలతో నాలుగోసారి సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తాజాగా వెలువడిన ఫలితాల్లో అఖిల భారత సర్వీసులో 770 ర్యాంకు సాధించి అమ్మనాన్నల కలను సాకారం చేశాడు. ఆ యువకుడే పెద్దేముల్‌ మండలం గొట్లపల్లికి చెందిన మహమ్మద్‌ అష్పక్‌. మారుమూల పల్లెటూరుకు చెందిన తమ గ్రామ యువకుడి ప్రతిభను చూసి ప్రజలు అభినందిస్తున్నారు.
వలస జీవులుగా వెళ్లి: అష్పక్‌ తల్లిదండ్రులు జాఫర్‌, రిజ్వాన బేగం. స్వగ్రామం గొట్లపల్లిలో చిన్నపాటి ఓ ఇల్లు. 1.15 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. పదో తరగతి తర్వాత తండ్రి హైదరాబాద్‌ బతుకుదెరువు కోసం వెళ్లాడు. అక్కడే ఐటీఐ చదివి మేనమామ కూతరు రిజ్వానను వివాహం చేసుకున్నాడు. కూతురు ఉజ్మా సుల్తాన, కొడుకు అష్ఫక్‌లను బాగా చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాత్రీ పగలు కష్టించి చదివించారు. కూతురు ఉజ్మా డెంటల్‌ డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. కొడుకు ప్రస్తుతం సివిల్స్‌లో 770వ ర్యాంకుతో రాణించాడు. తమ కలలు నిజమయ్యాయని తల్లిదండ్రులు సంతోష పడుతున్నారు. సొంత ఇల్లు, సొంత దుకాణంతో కుటుంబం సాఫీగా సాగుతోంది జాఫర్‌ తెలిపారు.

చదువులో చురుకుదనం

అష్పక్‌ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే వాడు. టెన్త్‌, ఇంటర్‌ ప్రైవేటుగానే చదివాడు.  దిల్లీలోని శ్రీరాం కాలేజీలో బీఏ ఎకనమిక్స్‌ పూర్తి చేశాడు. ఎంఏ పూర్తి చేసి ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. మూడుసార్లు విఫలమైనా నాలుగోసారి ఫలితాన్ని సాధించాడు. 

మనవడు అష్పక్‌ సివిల్స్‌కు ఎంపికయ్యాడని తెలిసి అవ్వా తాతలు రజాక్‌, సైదానిబీలు సంతోషంలో మునిగిపోయారు. వాడి కష్టానికి తగిన ఫలితందక్కిందన్నారు. ఇంకా ఉన్నతంగా ఎదగాలన్నారు.


మరోసారి యత్నిస్తా- అష్ఫక్‌

ప్రస్తుతం వచ్చిన ర్యాంకుతో సంతృప్తి లభించింది. నాకు ఐఏఎస్‌ సాధించి ప్రజలకు సేవ చేయాలని ఉంది. అందుకోసం మరోసారి యత్నిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని