logo

కిడ్నాప్‌ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌

ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ చాంద్‌బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్‌ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది.

Updated : 19 Apr 2024 08:36 IST

మోకిల ఠాణాలో 13 మందిపై కేసు
నిందితుల్లో సైబర్‌క్రైమ్‌ ఏసీపీ చాంద్‌బాషా
తలకొండపల్లి తహసీల్దార్‌ వెంకటరంగారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ చాంద్‌బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్‌ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. వ్యాపారి శ్రీనివాసరాజును కిడ్నాప్‌ చేసి.. రూ.కోట్లు విలువ చేసే 30 ఎకరాల భూమిని  కొందరు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, ఇందులో ఏసీపీ, తహసీల్దార్‌ పాత్ర ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు. వీరితో పాటు మరో 11 మందిపైనా గతేడాది నవంబరులో మోకిల ఠాణాలో కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో తహసీల్దార్‌ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో కిడ్నాప్‌ విషయం వెలుగులోకి వచ్చింది.  కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఈ వ్యవహారంలో పరారీలో ఉన్నారు.

పాత కక్షలతో.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి శ్రీనివాస్‌రాజుకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో 50 ఎకరాల భూమి ఉంది. శ్రీనివాస్‌రాజు మోకిల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కుటుంబంతో ఉంటున్నారు. ఇతనికి తన సమీప బంధువు ఏపీలోని భీమవరం జిల్లాకు చెందిన వ్యాపారి పెరిచర్ల సూర్యనారాయణరాజుతో విభేదాలున్నాయి. 2023 నవంబరు 15న శ్రీనివాస్‌రాజును నాగులపల్లి దగ్గర కొందరు కిడ్నాప్‌ చేశారు. ఈ వ్యవహారంపై మోకిల ఠాణాలో కేసు నమోదైంది. కిడ్నాపర్లు బాధితుడిని కారులో తిప్పుతూ 24 గంటల తర్వాత నేరుగా తలకొండపల్లిలోని తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు.

బలవంతంగా 30 ఎకరాల బదిలీ.. శ్రీనివాసరాజు సమీప బంధువు సూర్యనారాయణరాజు ఈ కిడ్నాప్‌ డ్రామా నడిపించాడు.  నవంబరు 16న తహసీల్దార్‌ కట్ట వెంకట రంగారెడ్డి సమక్షంలో శ్రీనివాసరాజు పేరిట ఉన్న  30 ఎకరాల భూమిని బలవంతంగా సూర్యనారాయణరాజు పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. బాధితుడు విషమ పరిస్థితుల్లో ఉన్నా రిజిస్ట్రేషన్‌ ఎలా చేయించారన్నది ఇంకా వెలుగులోకి రాలేదు. 

బాధితుడి లొకేషన్‌ చెప్పిన ఏసీపీ.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ చాంద్‌బాషా పాత్ర గుర్తించారు. కిడ్నాపర్లకు శ్రీనివాసరాజు ఎక్కడెక్కడ ఉన్నాడనే లొకేషన్‌ సమాచారం ఏసీపీ అందించినట్లు ఓ అధికారి తెలిపారు. దీని ఆధారంగా ఏసీపీపైనా కేసు నమోదు చేశారు.  ఏసీపీ న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. తహసీల్దార్‌ వెంకటరంగారెడ్డి, సూర్యనారాయణరాజు, బాలరామరాజు, ఉపేందర్‌రెడ్డి, రాఘవేంద్ర ఛటర్జీ, సాయి, హరీష్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, గోపి, చందు, శ్రీను నాయక్‌ తదితరుల మీద కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని