నాన్న నుంచి ఆస్తి వస్తుందా?

మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మేం ఇద్దరం పిల్లలం. అమ్మ మా చిన్నప్పుడే హైబీపీతో చనిపోవడంతో మా బాగోగులు చూసుకోవడానికని ఆయన మరో పెళ్లి చేసుకున్నారు.

Updated : 22 Aug 2023 12:24 IST

మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మేం ఇద్దరం పిల్లలం. అమ్మ మా చిన్నప్పుడే హైబీపీతో చనిపోవడంతో మా బాగోగులు చూసుకోవడానికని ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. వారికో పాప. తమ కూతురి మరణానికి అల్లుడే కారణమని అమ్మమ్మ తాతయ్యలు మాకు దూరమైపోయారు. పిన్ని మమ్మల్ని ఏ రోజూ సొంత పిల్లల్లా చూడలేదు. చెల్లికి ఇంకా పెళ్లికాలేదు. నాన్నని మాతో కలవనివ్వట్లేదు. ఆయన ఈ మధ్య పదవీ విరమణ చేశారు. కొంత డబ్బు పొదుపు చేశారు. ఆస్తులూ కూడబెట్టారు. మా అత్తింటివారి ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. పుట్టింటి నుంచి కానీ, అమ్మ తల్లిగారింటి నుంచి కానీ మాకేమైనా ఆస్తి వస్తుందా?

- ఓ సోదరి.

మీ ఉత్తరంలో మీ తల్లిదండ్రులకు వారి పిత్రార్జితపు ఆస్తులేమైనా సంక్రమించాయా అన్న వివరాలు ఇవ్వలేదు. మీ అమ్మగారి పేరు మీద ఆస్తులేమైనా ఉంటే హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌-15 ప్రకారం పిల్లలకు భర్తకు సమానంగా చెందుతాయి. మీ నాన్న తన పిత్రార్జితాన్ని అనుభవిస్తుంటే ఇందులోని సెక్షన్‌-8 ప్రకారం ఆయన భాగంలో మీకు కూడా హక్కు ఉంది. ఇది కాక హిందూ దత్తత, భరణాల చట్టం-1956లోని సెక్షన్‌ 20 ప్రకారం క్లాజ్‌ (1) అవివాహిత ఆడపిల్ల తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రే ఆమెను తప్పక పోషించాలని చెబుతోంది. సీఆర్‌పీసీ-1973లోని సెక్షన్‌ 125 క్లాజ్‌(బి) కూడా పెళ్లికాని ఆడపిల్లలు తమని తాము పోషించుకోలేనప్పుడు వారి పోషణ బాధ్యత తండ్రిదేనంటోంది. గృహహింస చట్టం-2005 సెక్షన్‌ 2(బి) ప్రకారం పిల్లలు అంటే 18 ఏళ్లు దాటని వారుగా భావించాలి. సెక్షన్‌ 20 కింద పెళ్లికాని కూతురు తండ్రి తనని నిర్లక్ష్యం చేసినా, హింసకు గురి చేసినా కూడా ఆయన దగ్గర నుంచి పోషణ ఖర్చులు కోరవచ్చు. ఇక,  మీకూ, మీ చెల్లికీ ఆస్తి వాటాలు... మీ తల్లిదండ్రులిద్దరూ వారి పిత్రార్జితపు ఆస్తి అనుభవిస్తే మాత్రమే మీకు వస్తుంది. ముందు మీకు కావలసిందేంటో తేల్చుకోండి. వారి నుంచి ప్రేమ పొందాలనుకుంటే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌కి తీసుకెళ్లండి. ఆస్తి మాత్రమే అవసరమనుకుంటే లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి వెళ్లండి. సమస్య పరిష్కారమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్