ఆట ముందు... మాట్లాడాల్సిందే!

64 గళ్ల ఆటలో మన తెలుగు తేజాలు ఎప్పుడూ ప్రత్యేకమే! ఈ పరంపరలో ప్రపంచ వ్యాప్తంగా వినబడుతున్న మరో తెలుగుపేరు దొమ్మరాజు గుకేష్‌. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి... చెస్‌ యువరాజుగా ఎదిగాడీ అబ్బాయి.

Updated : 03 May 2024 14:14 IST

64 గళ్ల ఆటలో మన తెలుగు తేజాలు ఎప్పుడూ ప్రత్యేకమే! ఈ పరంపరలో ప్రపంచ వ్యాప్తంగా వినబడుతున్న మరో తెలుగుపేరు దొమ్మరాజు గుకేష్‌. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి... చెస్‌ యువరాజుగా ఎదిగాడీ అబ్బాయి. అతని విజయంలో కీలకంగా ఉన్న గుకేష్‌ తల్లి డాక్టర్‌ పద్మకుమారి ‘వసుంధర’తో ముచ్చటించారు...

చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం మాది. మా మామగారు అక్కడి రైల్వేలో పనిచేసేవారు. నేనూ, మావారు ఒకే కాలేజీలో మెడిసిన్‌ చదువుకుని డాక్టర్లయ్యాం. మాది ప్రేమ వివాహం. గుకేష్‌ చిన్నప్పుడు బాగా చదివేవాడు. క్లాస్‌ టాపర్‌. ఇంట్లో మేమంతా సరదాగా చెస్‌ ఆడేవాళ్లం. మా మరిది పిల్లలు బాగా ఆడేవారు. వాళ్లవల్లే ఆసక్తి పెంచుకున్నాడు. తనకప్పుడు ఆరేడేళ్లుంటాయి. రోజంతా ఆడటం.. అవతలి వాళ్లని ఓడించడం చేసేవాడు. తనకిది నచ్చిందని సమ్మర్‌క్యాంపుల్లో చేర్పించి చెస్‌ నేర్పించాం. కోచ్‌లూ తనలోని చురుకుదనాన్ని గుర్తించారు. అలా తన కెరియర్‌ చెస్‌వైపు మళ్లింది. పదేళ్ల వయసు నుంచీ టోర్నీలకు పంపడం మొదలుపెట్టాం.

ఇంటి వంటే ఇష్టం..

ఏ టోర్నీకెళ్లినా, ఆటకు ముందు గుకేష్‌ ఓ పని కచ్చితంగా చేస్తాడు. నాతో ఓ పావుగంట ఫోన్‌లో మాట్లాడతాడు. మా మాటల్లో ఎక్కడా చెస్‌ ప్రస్తావన ఉండదు. దాంతో ఎంత మూడాఫ్‌లో ఉన్నా చురుగ్గా అయిపోతాడు. చిన్నప్పుడయితే ఎక్కువసేపు మాట్లాడేవాడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా! అలాగే... ఆట పూర్తయ్యాక కూడా మాట్లాడతాడు. నీతో మాట్లాడితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా అంటాడు. ఎనిమిదేళ్లుగా ఈ రొటీన్‌లో ఏ మార్పూ లేదు. మా కబుర్లలో క్రీడాకారుల విజయగాథలే ఎక్కువగా ఉంటాయి. తన కోసం ఇలాంటివన్నీ ప్రత్యేకించి చదువుతుంటా. నాకు చెస్‌ మీద పెద్దగా అవగాహన లేదు. మావారికి బాగా ఆసక్తి. బాబుకోసం ఆయన తన కెరియర్‌నే త్యాగం చేశారు. ఆటకు సంబంధించిన ఏర్పాట్లు వీసా, టికెట్లు, పర్యటన వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. బాబు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా నేను జాగ్రత్తలు తీసుకుంటా. మంచి డైట్‌ సిద్ధం చేస్తుంటా. ఇంట్లో ఉన్నప్పుడు తనకిష్టమైన వంటకాలన్నీ చేసి తినిపిస్తుంటా. పులిహోరంటే తనకిష్టం. తనతో  కలిసి ఐదారు టోర్నీలకి వెళ్లుంటా అంతే.

అదే తన బలం

గుకేష్‌లో బలం... మౌనంగా ఉండటమే. అలా ఉన్నప్పుడే తన ఆలోచనలు మెరుగవుతూ ఉంటాయి. తను క్రికెట్, బాడ్మింటన్‌, టెన్నిస్‌ కూడా ఆడతాడు. పుస్తకాలు బాగా చదువుతాడు. నేను కూడా చదవమనే చెబుతుంటా. క్యాండిడేట్్స టోర్నీ గెలిచి, ప్రపంచ టైటిల్‌కు అర్హత సాధించిన అతి పిన్నవయస్కుడిగా గుకేష్‌ రికార్డులకెక్కినప్పుడు నేనే గెలిచినంతగా సంబరపడ్డా. ఈ టోర్నీ కోసం మూడు నెలలుగా కష్టపడుతున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ మమ్మల్ని స్వయంగా పిలిచి గౌరవించారు. రాష్ట్రపతి, ప్రధాని నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పిల్లల ఇష్టాల్ని గుర్తించి, ప్రోత్సహిస్తే వాళ్లు విజేతలవుతారు... బలవంతపెడితే కాదు.

 హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్