Updated : 10 Oct 2021 06:13 IST

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా

తాప్సీ పన్ను... ‘ఝుమ్మంది నాదం’తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ దిల్లీ భామ విభిన్న భాషల్లో వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ పేరుతో తెలుగు తెరమీద మళ్లీ కనిపించనున్న తాప్సీ తన మనసులోని ముచ్చట్లను పంచుకుంటోందిలా...


ఈ విజయం వాళ్లదే

మాది సంప్రదాయ కుటుంబ నేపథ్యమైనా అమ్మానాన్నలు నన్నూ, చెల్లినీ అన్నివిధాలా ప్రోత్సహించారే తప్ప ఇది చేయొద్దూ, అది వద్దూ అంటూ ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు. ఆ ప్రోత్సాహం తోనే నేను ఓ వైపు ఎంబీఏ ఎంట్రన్స్‌కు సిద్ధమవుతూనే పాకెట్‌మనీ కోసం మోడలింగ్‌లోకి వచ్చాను. చదువైపోయాక ఆర్నెల్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసినా కూడా సినిమాల్లోకి రావాలనే నిర్ణయించుకున్నా. అప్పుడు కూడా వాళ్లు జాగ్రత్తలు చెప్పారే తప్ప వద్దనలేదు. నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మానాన్నలే.


ఆ రోజులు గుర్తే

మోడలింగ్‌ చేస్తున్నప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నా. ఓసారి ఓ పెద్ద చీరల డిజైనింగ్‌ సంస్థ నాకు మోడలింగ్‌ చేసే  అవకాశం ఇస్తూనే చివరి క్షణంలో వద్దనేసింది. అలా ఆఖరి క్షణంలో పోగొట్టుకున్న ఆఫర్లు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ఏ రోజూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు చేశా. సినిమాల్లోకి వచ్చేవరకూ డొకొమో, రిలయన్స్‌, పీవీఆర్‌ సినిమాస్‌, పాంటలూన్స్‌, ఎయిర్‌టెల్‌, కోకకోలా వంటి సంస్థలెన్నింటికో మోడలింగ్‌ చేసే అవకాశాలు అందుకున్నా. అప్పుడనే కాదు... బాలీవుడ్‌లోకి వెళ్లిన కొత్తల్లోనూ ఏ సినిమా ఆడిషన్‌కి వెళ్లినా బాగా చేయలేదని చెప్పి పంపించేసేవారు. వాటన్నింటినీ మనసుకు తీసుకోకుండా నా పొరపాట్లను నేను దిద్దుకుంటూనే ఒక్కో అవకాశాన్నీ మళ్లీ అందుకున్నా.


కల నిజమైంది

స్కూల్లో అన్నిరకాలుగా రాణిస్తూ, క్రమశిక్షణతో ఉన్నవారినే హెడ్‌గాళ్‌గా చేస్తారని తెలిశాక పర్‌ఫెక్ట్‌గా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని. చివరకు ఓ రోజు నా కలను నిజం చేస్తూ ప్రిన్సిపాల్‌ నాకు హెడ్‌గాళ్‌ బ్యాడ్జ్‌ను పెట్టి.. నా చేత ప్రమాణం చేయించినప్పుడు నా కష్టం వృథా పోలేదని అనిపించింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ నాకు నచ్చినట్లుగా నన్ను నేను మలచుకున్నానే తప్ప ఎవరిపైనా ఆధారపడలేదు. వైఫల్యాలను నా ఖాతాలోనే వేసుకున్నాను. ఒకప్పుడు నన్ను ఐరన్‌లెగ్‌ అన్నవాళ్లూ ఉన్నారు. అలాంటి విమర్శలను తలచుకుని బాధపడి ఉంటే ఈ రోజున సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గానే కొనసాగేదాన్నేమో.


అమితాబ్‌ సహనటుడే

బాలీవుడ్‌లోకి వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే నాకు అమితాబ్‌ బచ్చన్‌ సర్‌తో కలిసి ‘పింక్‌’, ‘బద్లా’ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఓ ప్రముఖ నటుడితో కలిసి తెర పంచుకోవడం అంటే మాటలు కాదు కాబట్టి నాలోనూ ఆ కంగారు ఉండేది. కానీ నేను దాన్నెప్పుడూ బయటపెట్టకుండా సెట్‌లో ఉన్నంతసేపూ అమిత్‌జీని ఓ సహ నటుడిగానే భావించా. బహుశా అందుకే మేమిద్దరం కలిసి చేసిన ఆ సినిమాలకు వందశాతం మార్కులు పడ్డాయనుకుంటా.


అభిరుచులు

రోజులో కాసేపు స్క్వాష్‌ ఆడటం, కుదిరినప్పుడు స్కూబా డైవింగ్‌, బైక్‌ రైడింగ్‌.


బ్రేక్‌ దొరికితే...

హాయిగా స్పాకి వెళ్లిపోతా.


పర్సులో ఉండేవి

వ్యాలెట్‌, కీస్‌, పవర్‌బ్యాంక్‌, లిప్‌బామ్‌.


మొదటి ఆదాయం

ప్రకటన చేసినందుకు నాలుగువేల రూపాయలు అందుకున్నా.


మెచ్చే ఆహారం

చైనీస్‌ వంటకాలూ, పేస్ట్రీలూ, పరోటాలూ... ఇలా చాలానే ఇష్టం కానీ చోళె పూరీ ఎదురుగా ఉందంటే అన్నింటినీ పక్కన పెట్టేస్తా.


ఇష్టమైన సినిమా

క్‌ దే ఇండియా


ముద్దుపేరు

మ్యాగీ... బహుశ నా జుట్టు రింగులు తిరిగి ఉంటుందని అలా పిలిచేవారేమో.


నచ్చే హాలిడే స్పాట్‌

మాల్దీవులు  


ఎక్కువగా కొనేవి

షూలు, హ్యాండ్‌ బ్యాగులు  


తీరని కల

ఇండస్ట్రీలోకి వచ్చినప్పటినుంచీ మణిరత్నం సినిమాలో నటించాలని కోరిక, నెరవేరుతుందో లేదో.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని