గృహ రుణం తీసుకుంటున్నారా?ఈ 4 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం మీ వ‌ద్ద ఉందా?

ఇంటి మొత్తం విలువ‌లో 75 నుంచి 90 శాతం వ‌ర‌కు మాత్ర‌మే రుణ సదుపాయం క‌ల్పిస్తుంటాయి బ్యాంకులు.

Published : 08 Jul 2022 14:53 IST

ఇల్లు కొనుగోలు నిర్ణయం తీసుకోవ‌డం అంత తేలిక కాదు. కావాల్సిన ప్ర‌దేశంలో..కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఇల్లు కొనుగోలు చేయాలంటే ఎక్కువ డ‌బ్బు పెట్టాల్సి రావ‌చ్చు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి క‌దా.. అని ముందూ వెనుక ఆలోచించ‌కుండా కొనుగోలుకు సిద్ధ‌ప‌డ‌డం మంచిది కాదు. ఎందుకంటే గృహ రుణం అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది. చెల్లింపుల‌కు కొన్ని సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంది. ఇందుకు ఆర్థిక నిబ‌ద్ధ‌త అవ‌సరం. ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకుని నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి, రుణం తీసుకుని గృహ కొనుగోలు చేసేవారు..నిర్ణ‌యం తీసుకునే ముందు మిమ్మ‌ల్ని మీరు కొన్ని ప్ర‌శ్న‌లు వేసుకోవాలి. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం మీ వ‌ద్ద ఉంది అనుకున్న‌ప్పుడు మాత్రమే కొనుగోలుకు ముంద‌డుగు వేయాలి. 

1. డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించ‌గలం?
ఇల్లు కొనుగోలు చేసేందుకు కావాల్సిన పూర్తి మొత్తాన్ని బ్యాంకులు గానీ, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు గానీ మంజూరు చేయ‌వు. ఇంటి మొత్తం విలువ‌లో 75 నుంచి 90 శాతం వ‌ర‌కు రుణం ఇస్తుంటాయి. మిగిలిన 10 నుంచి 25 శాతంని కొనుగోలు దారులు డౌన్‌పేమెంట్ రూపంలో స్వంతంగా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని లోన్ టు వాల్యు (బ్యాంకులు ఇచ్చే రుణం, రుణ గ్ర‌హీత చెల్లించిన డౌన్‌పేమెంట్‌.. ఈ రెండింటి నిష్ప‌త్తే ఎల్‌టీవీ(LTV)) నిష్ప‌త్తి అంటారు.

చాలా మంది రుణ గ్ర‌హీత‌లు ఎక్కువ‌ ఎల్‌టీవీ నిష్ప‌త్తితో రుణం కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే, త‌క్కువ ఎల్‌టీవీతో రుణం తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణ‌లు చెబుతున్నారు. దీంతో రుణాలు కూడా త్వ‌ర‌గా ల‌భిస్తాయి. త‌క్కువ ఎల్‌టీవీ అంటే డౌన్‌పేమెంట్ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రుణ మొత్తం త‌గ్గుతుంది కాబ‌ట్టి రుణ‌దాత‌కు న‌ష్ట‌భయం త‌గ్గుతుంది. కాబ‌ట్టి త‌ర్వ‌గా మంజూరు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే, రుణ మొత్తం త‌గ్గుతుంది కాబ‌ట్టి  త‌ర్వ‌గా రుణం చెల్లించ‌గ‌లుగుతారు.

ఉదాహ‌ర‌ణ‌కి, మీరు కొనుగోలు చేయాల‌నుకున్న ఇంటి విలువ రూ. 80 ల‌క్ష‌లు అనుకుందాం. డౌన్‌పేమెంట్‌గా క‌నీసం 10 శాతం (రూ. 8 ల‌క్ష‌లు) చెల్లిస్తే..రూ. 72 లక్ష‌ల రుణం తీసుకోవాలి. వ‌డ్డీ రేటు 7.55 శాతం అనుకుంటే..నెల‌కు దాదాపు రూ. 50 వేలు ఈఎమ్ఐ చెల్లిస్తే..రుణం పూర్తిగా తీర్చేందుకు 30 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఇక్క‌డ రుణం మొత్తం పూర్తయ్యే నాటికి మీరు చెల్లించే మొత్తం రూ. 1.82 కోట్లు, ఇందులో వ‌డ్డీ మొత్తం రూ. 1.10 కోట్లు. 

అదే డౌన్‌పేమెంట్‌గా 25 శాతం, అంటే రూ. 20 ల‌క్ష‌లు చెల్లిస్తే..రూ. 60 ల‌క్ష‌ల రుణం తీసుకోవాల్సి వ‌స్తుంది. ఇక్క‌డ కూడా వ‌డ్డీ రేటు 7.55 శాతం అనుకుంటే.. నెల‌కు దాదాపు రూ. 50 వేలు ఈఎమ్ఐ చెల్లిస్తే..రుణం పూర్తిగా తీర్చేందుకు 19 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఇందులో మీరు బ్యాంకుకు చెల్లించే మొత్తం రూ. 1.11 కోట్లు, వ‌డ్డీ మొత్తం రూ. 53 ల‌క్ష‌లు మాత్ర‌మే. 

పై ఉదాహ‌ర‌ణను ప‌రిశీలిస్తే డౌన్‌పేమెంట్ 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుకోవ‌డం వ‌ల్ల రుణ కాల‌వ్య‌వ‌ధిలో చెల్లించే మొత్తం వ‌డ్డీని స‌గం వ‌ర‌కు త‌గ్గించుకోగ‌లుగుతారు. 

గుర్తుంచుకోండి..డౌన్‌పేమెంట్ కోసం మీ అత్య‌వ‌స‌ర నిధిని ఉప‌యోగించ‌డం, ఇత‌ర దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబ‌డుల‌ను మ‌ధ్య‌లోనే నిలిపివేసి ఆ డ‌బ్బును డౌన్‌పేమెంట్ కోసం తీసుకోవ‌డం స‌రైన ప‌నికాదు. ఇలా చేయ‌డం వ‌ల్ల డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఇబ్బందుల్లో ప‌డ‌తారు. అలాగే మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. 

2. క్రెడిట్ స్కోరు ఎంత ఉంది?
రుణ ద‌ర‌ఖాస్తు ఆమోదించేందుకు బ్యాంకులు ముందుగా చూసేది క్రెడిట్ స్కోరే. క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోరుగా ప‌రిగ‌ణించి రుణాల‌ను త్వ‌ర‌గా ఇస్తాయి. అలాగే వ‌డ్డీ రేటును కూడా త‌గ్గించే అవ‌కాశం ఉంది. ఉదాహ‌ర‌ణ‌కి, దేశీయ అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ని తీసుకుంటే సాధార‌ణ గృహ రుణాల విభాగంలో క్రెడిట్ స్కోరు 800 కంటే ఎక్కువ నిర్వ‌హిస్తున్న వారికి 7.55 శాతానికే రుణం ఆఫ‌ర్ చేస్తుండ‌గా, క్రెడిట్ స్కోరు 750 - 799 మ‌ధ్య ఉన్న వారికి 7.65 శాతం, 700 - 749 మ‌ధ్య ఉన్న వారికి 7.75 శాతం, 650 - 699 మ‌ధ్య ఉన్న వారికి 7.85 శాతం, 550 - 649 మ‌ధ్య ఉన్న వారికి 8.05 శాతం వ‌డ్డీ రేటుతో రుణాలు ఇస్తుంది. 

ఇప్పుడు పై ఉదాహ‌ర‌ణ‌నే తీసుకుంటే..రూ. 60 ల‌క్ష‌ల రుణాన్ని  7.55 శాతం వ‌డ్డీ రేటుతో..20 ఏళ్ల కాల‌పరిమ‌తితో తీసుకుంటే కాల‌పరిమితి పూర్త‌య్యే స‌రికి చెల్లించిన మొత్తంలో వ‌డ్డీ రూ. 56,44,607 అవుతుంది. అదే మొత్తాన్ని అంతే కాల‌ప‌రిమితితో, 8.05 శాతం వ‌డ్డీ రేటుతో తీసుకుంటే చెల్లించే మొత్తంలో వ‌డ్డీ భాగం రూ. 60,89,585, అంటే దాదాపు రూ. 4.50 ల‌క్ష‌లు అద‌నంగా చెల్లిస్తున్నారు. అందువ‌ల్లే మంచి క్రెడిట్ స్కోరు నిర్వ‌హించ‌డం ముఖ్య‌మ‌ని నిపుణులు చెబుతుంటారు. ఇందుకోసం మ‌నం చేయాల్సింద‌ల్లా తీసుకున్న రుణాల‌కు సంబంధించిన ఈఎమ్ఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు స‌మ‌యానికి చెల్లించ‌డ‌మే. 

3. నెల‌వారిగా ఎంత మొత్తం చెల్లించ‌గ‌లం?
రుణం తీసుకున్నాక ప్ర‌తీ నెల ఈఎమ్ఐలు చెల్లించాలి. రుణం ఇచ్చే ముందు బ్యాంకులు..త‌మ క‌స్ట‌మ‌ర్లు ఈఎమ్ఐలు స‌క్ర‌మంగా చెల్లించ‌గ‌ల‌రా లేదా అని కూడా చెక్ చేస్తాయి. మీ ప్ర‌స్తుత ఆదాయంలో అన్ని ఈఎమ్ఐ(ఇవ్వ‌బోయే గృహ రుణంతో పాటు, ఇప్ప‌టికే ఉన్న‌..వాహ‌న‌, వ్య‌క్తిగ‌త రుణాలు అన్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు)ల మొత్తం 40 నుంచి 50 శాతానికి మించ‌కుండా లెక్కించి ఈఎమ్ఐ నిర్ణ‌యిస్తాయి. అందువ‌ల్ల గృహ రుణం తీసుకునేముందే ఇత‌ర రుణాల‌న్నింటిని పూర్తిగా చెల్లించ‌డం మంచిది.

పై ఉదాహ‌ర‌ణ‌ని తీసుకుంటే రూ. 20 ల‌క్ష‌లు డౌన్‌పేమెంట్ చెల్లించి రూ. 60 ల‌క్ష‌లు రుణం తీసుకున్నార‌నుకుందాం. మీ ప్ర‌స్తుత నెల‌వారి ఆదాయం రూ. 1 ల‌క్ష అనుకుందాం. ఇందులో 50 శాతం, అంటే రూ. 50 వేల వ‌ర‌కు ఈఎమ్ఐ పెట్టుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి, 19 సంవ‌త్స‌రాలలో రుణం తీర్చ‌గులుగుతారు. ఒక వేళ మీకు ఇప్ప‌టికే వ్య‌క్తిగ‌త‌ రుణం ఉంది అనుకుందాం. ఇందుకోసం మీరు నెల‌వారిగా రూ. 8 వేలు ఈఎమ్ఐ చెల్లిస్తున్నారు అనుకుందాం. అప్పుడు గృహ రుణ ఈఎమ్ఐగా రూ. 42 వేలు మాత్ర‌మే చెల్లించేందుకు బ్యాంకు అంగీక‌రిస్తుంది. అప్పుడు రుణ కాల‌వ్య‌వ‌ధి పెంచుకోమ‌ని లేదా డౌన్‌పేమెంట్ ఎక్కువ చెల్లించ‌మ‌ని బ్యాంకులు చెబుతాయి. ఒక‌వేళ కాల‌వ్య‌వ‌ధి పెంచుకుంటే రూ. 42 వేల ఈఎమ్ఐతో రుణం పూర్తిగా చెల్లించేందుకు 30 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. 

గుర్తుంచుకోండి..గృహ రుణ ఈఎమ్‌లు చెల్లించ‌డం కోసం దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం చేసే పెట్టుబ‌డులను నిలిపి వేయ‌డం మంచిది కాదు. మీ ఆదాయం నుంచి నెల‌వారి ఖ‌ర్చులు, పెట్టుబ‌డుల‌ను తీసివేసిన త‌ర్వాత మొత్ర‌మే రుణం కోసం ఎంత చెల్లించ‌గ‌ల‌రో లెక్కించండి. 

4. అత్య‌వ‌స‌ర నిధిలో గృహ‌రుణ ఈఎమ్ఐ చేర్చారా?
అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవ‌డం వంటి కొన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కొన్ని సార్లు ఈఎమ్ఐ క‌ట్ట‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ‌వ‌చ్చు. ఒకవేళ అలాంటి ప‌రిస్థితులు ఏర్పడి ఈఎమ్ఐ చెల్లించ‌లేక‌పోతే పెనాల్టీలు వ‌ర్తిస్తాయి. దీని ప్ర‌భావం క్రెడిట్ స్కోరు పైనా ప‌డుతుంది. అందువ‌ల్ల మీ అత్య‌వ‌స‌ర నిధిలో క‌నీసం ఆరు నెల‌ల హోమ్ లోన్ ఈఎమ్ఐను చేర్చ‌డం మంచిది. 

చివరిగా.. 
ఇల్లు కొనుగోలు అనేది పెద్ద నిర్ణ‌యం. తొంద‌ర‌పాటు సరి కాదు. ఇల్లు కొనుగోలు చేసేట‌ప్పుడు డౌన్‌పేమెంట్‌తో పాటు స్టాంప్ డ్యూటీ, ఇత‌ర ఖ‌ర్చులు కూడా ఉంటాయి. వీటితో పాటు పై అంశాల‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అన్ని ర‌కాలుగా సిద్ధ‌మైన‌ త‌ర్వాత మాత్ర‌మే..కొనుగోలు చేయాలి. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts