2G Spectrum Case: అసలు 2G స్పెక్ట్రమ్‌ రగడ ఏంటి? ఆరోజు కాగ్‌ ఏం చెప్పింది?

2G Spectrum Case: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం త్వరలో జరగనున్న నేపథ్యంలో 2జీ స్కాం కేసుకు సంబంధించిన పూర్వాపరాలేంటో చూద్దాం...

Updated : 21 Jul 2022 11:03 IST

2G Spectrum Case: జులై 26న 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన వేలం (5G Auction) జరగబోతోంది. స్పెక్ట్రమ్‌ అనగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది ‘2జీ కుంభకోణం (2G Spectrum Case)’. ఈ కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ.. స్పెక్ట్రమ్‌ వేలం (Spectrum Auction) తెరపైకి వచ్చినప్పుడల్లా దీనిపై చర్చ జరుగుతుంటుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమికి అధికారాన్ని దూరం చేసిన కీలక ఉదంతంగా ప్రజలు దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న భాజపాకు అధికార పక్షంపై సంధించడానికి విమర్శనాస్త్రాల్ని అందించింది ఈ కేసే. ఎన్‌డీఏ కూటమికి అధికారానికి దగ్గర చేసిన అంశాల్లో ఈ 2జీ రగడ ప్రధానమైంది. తాజాగా 5జీ వేలం (5G Auction) నేపథ్యంలో మరోసారి ఈ ‘కుంభకోణం’పై చర్చ జరుగుతోంది. మరి ఆ కేసు పూర్వాపరాలేంటో ఓసారి గుర్తుచేసుకుందాం...

(ఇదీ చదవండి: EXPLAINED: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్‌కి వేలం ఎందుకు?)

ఏమిటీ ‘కుంభకోణం’ కేసులో ఆరోపణలు..

2007లో దీనికి దారులు పడ్డాయి. నాడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. 2జీ టెలికం స్పెక్ట్రమ్‌ (2G Spectrum)కు లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయించింది. 2007 అక్టోబర్‌ 25ను గడువుగా టెలికం శాఖ నిర్దేశించింది. దర్యాప్తు సంస్థల ఆరోపణల ప్రకారం..

* 2008 జనవరి 10న టెలికం శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వేలం ద్వారా కాకుండా ‘మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు’ ప్రాతిపదికన 2జీ లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

* దరఖాస్తుల దాఖలుకు గడువును 2007 అక్టోబరు 1 నుంచి.. అదే ఏడాది సెప్టెంబరు 25కు కుదించింది. దీని వల్ల అనేక దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి.

* అంతేకాదు స్పెక్ట్రమ్‌ ధరను 2008 నాటి ధరల ఆధారంగా కాకుండా 2001 ధరల ప్రాతిపదికన టెలికం శాఖ కేటాయించింది. ఇలా 8 కంపెనీలకు 122 స్పెక్ట్రమ్‌ లైసెన్సులను జారీ చేసింది.

* లూప్‌ టెలికాం సంస్థలకు జరిగిన స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో అవతకవతకలు జరిగినట్లు దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘టెలికాం వాచ్‌డాగ్‌’.. ‘సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (CVC)’ దృష్టికి తీసుకెళ్లింది.

కాగ్‌ ఏం చెప్పింది..

స్పెక్ట్రమ్‌ ‘కుంభకోణా’న్ని 2010 నవంబరు 16న ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (CAG)’ తన నివేదికలో వెలుగులోకి తెచ్చింది. 2జీ లైసెన్సులను కారుచౌకగా కట్టబెట్టినట్లు ఆరోపించింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. పైగా అర్హతలేని, వాస్తవాలు వక్రీకరించిన దరఖాస్తుదారులకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. చౌకగా లైసెన్సులు పొందిన వ్యక్తులు.. ఆ తర్వాత స్వల్ప సమయంలోనే తమ సంస్థల్లోని గణనీయమైన వాటాలను స్వదేశీ/విదేశీ కంపెనీలకు అత్యధిక ప్రీమియంతో విక్రయించి, భారీగా లబ్ధి పొందారని కాగ్‌ పేర్కొంది. కొత్తగా టెలికం రంగంలోకి వచ్చిన ఈ లైసెన్సుదారులు ఆర్జించిన ప్రీమియంను.. స్పెక్ట్రమ్‌ వాస్తవ ధరగా అంచనావేశారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా వేలం ప్రక్రియను నిర్వహిస్తే.. రూ.1.76 లక్షల కోట్లు ప్రభుత్వానికే వచ్చేవని కాగ్‌ పేర్కొంది.

ఆరోపణలు ఎదుర్కొన్నదెవరు?

సీవీసీ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐ చేపట్టింది. డీఎంకే నేత, నాటి టెలికం మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, టెలికం శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌.కె.చందోలియా తదితరులపై తొలి కేసును నమోదు చేసింది. ఈ కేసులో స్వాన్‌ టెలికం, డీబీ గ్రూప్‌ ప్రమోటర్లు అయిన షాహిద్‌ ఉస్మాన్‌ బల్వా, వినోద్‌ గోయెంకా, యూనిటెక్‌ ఎండీ డి.సంజయ్‌ చంద్ర సహా మరికొందరు పేర్లను నిందితులుగా సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.

నిందితులపై ఆరోపణలేంటి?

కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా నిబంధనలను మార్చడానికి, నాటి టెలికం మంత్రి రాజా ప్రధాన కారకుడని కాగ్‌ పేర్కొంది. ట్రాయ్‌, న్యాయ, ఆర్థికశాఖ సలహాలకు విరుద్ధంగా ఆయన నడుచుకున్నారని వివరించింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో రాజా నవంబరు 2010లో రాజీనామా చేశారు. 2011 ఫిబ్రవరిలో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు. అదే ఏడాది మార్చిలో ఈ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులన్నింటినీ అత్యున్నత న్యాయస్థానం 2012లోనే రద్దు చేసింది. 

ఏం ప్రతిఫలం పొందారు?

2011 ఏప్రిల్‌లో సీబీఐ తొలి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. 2జీ ‘కుంభకోణం’ వల్ల రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అర్హత లేకపోయినప్పటికీ.. యూనిటెక్‌ వైర్‌లెస్‌, స్వాన్‌ టెలికంలకు అనుచిత ప్రయోజనం కలిగినట్లు తెలిపింది. స్వాన్‌ టెలికం సంస్థకు లైసెన్సు మంజూరు చేయడానికి ప్రతిగా లంచం రూపంలో డీఎంకే టీవీ ఛానల్‌ కలైనర్‌ టీవీకి రూ.200 కోట్లు మళ్లించారని సీబీఐ ఆరోపించింది. స్వాన్‌ టెలికం ప్రమోటర్లు వినోద్‌ గోయెంకా, షాహిద్‌ బల్వాయి డీబీ గ్రూప్‌లో అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు రూ.200 కోట్ల లంచాన్ని.. డీబీ గ్రూప్‌నకు వాటాలున్న కుసేగావ్‌ ఫ్రూట్స్‌, సినీయుగ్‌ ఫిల్మ్స్‌ ద్వారా మళ్లించారు. రాజా ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి, నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ను తప్పుదోవ పట్టించారని సీబీఐ మొదటి చార్జిషీటు పేర్కొంది.

కనిమొళి పాత్రేంటి?

2011 ఏప్రిల్‌లో సీబీఐ తన రెండో అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఇందులో నాటి డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళిని సహ కుట్రదారుగా పేర్కొంది. కలైనర్‌ టీవీలో 20 శాతం వాటా కలిగిన ఆమె సదరు 200 కోట్ల లంచాన్ని మళ్లించడంలో మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది. ఈ ఛానల్‌లో 60 శాతం వాటా కలిగిన కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాల్‌ పేరును ప్రస్తావించలేదు.

రెండో కేసు ఏం చెబుతోంది?

సీబీఐ దాఖలు చేసిన రెండో కేసులో ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రవి రుయా, ఆయన మేనల్లుడు అన్షుమన్‌ రుయా, లూప్‌ టెలికం ప్రమోటర్‌ కిరణ్‌ ఖైతాన్‌, ఆమె భర్త ఐపీ ఖైతాన్‌, ఎస్సార్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ వికాస్‌ సరాఫ్‌లు నిందితులుగా ఉన్నారు. లూప్‌ టెలికంకు 21 లైసెన్సులు మంజూరయ్యాయి. అర్హత లేకపోయినప్పటికీ ఎస్సార్‌ గ్రూప్‌.. లూప్‌ టెలికంను ముసుగు సంస్థగా ఉపయోగించుకొని లైసెన్సులను పొందిందని సీబీఐ ఆరోపించింది. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చుతూ డిసెంబరు 31, 2017న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.

కేసును ఎందుకు కొట్టివేశారంటే..

  • అప్పటి టెలికం మంత్రి రాజా, శాఖలోని అధికారులతో కలిసి దరఖాస్తుల గడవును ముందకు మార్చారనడంలో, మొదటి వచ్చిన వారికి మొదటి కేటాయింపు పద్దతిలోనూ అవకతవకలు జరిగాయని సీబీఐ రుజువు చేయలేకపోయింది. 
  • టెలికం శాఖ కంటే ముందు యూపీఏ ప్రభుత్వంలో పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన రాజ అప్పుడే 2జీ లబ్ధదారులతో సంబంధాలు ఏర్పర్చుకున్నారని నిరూపించేందుకు సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది. 
  • స్వాన్‌ టెలికం, యూనిటెక్‌ గ్రూప్‌ కంపెనీస్‌కు అర్హత లేకపోయినప్పటికీ.. వారికి స్పెక్ట్రమ్‌ కేటయించారని ఎలాంటి ఆధారాలు లభించలేదు.
  • స్పెక్ట్రమ్‌ కేటాయంపులకు ప్రతిఫలంగానే కలైనర్‌ టీవీలోకి రూ.200 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీబీఐ నిరూపించలేకపోయింది. పైగా రాజాకు దీనికి సంబంధం ఉన్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు.
  • వీటి కారణంగా కేసును కొట్టివేస్తూ, నిందుతులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, దీనిపై సీబీఐ దిల్లీ హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. 
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని