AI: కృత్రిమ మేథతో కొన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగు: IMF చీఫ్‌

AI: కృత్రిమ మేథ వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ తెలిపారు.

Updated : 15 Jan 2024 11:16 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు కృత్రిమ మేథతో (Artificial intelligence- AI) ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ సంస్థ ఎండీ క్రిస్టలినా జార్జియేవా అన్నారు. కొన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశమూ ఉందని చెప్పారు. అదే సమయంలో ఉత్పాదకతను గణనీయంగా పెంచి ప్రపంచ వృద్ధికి దోహదం చేసే అవకాశాలనూ ఈ అత్యాధునిక సాంకేతిక తెచ్చిపెడుతుందని వివరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum)’  వార్షిక సదస్సుకు వెళ్లడానికి ముందు ఆదివారం ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 60 శాతం ఉద్యోగాలపై ఏఐ (Artificial intelligence) వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని క్రిస్టలినా తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 40 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు అధికంగా ఉన్న రంగాలపై ఈ సాంకేతికత ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఏఐ వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా పేద దేశాలకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ద్రవ్యోల్బణం (Inflation) క్రమంగా తగ్గుముఖం పడుతోందని క్రిస్టలినా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అమలు చేసిన ద్రవ్య విధానాలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పారు. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉందని వివరించారు. 2024 చాలా కఠినమైన సంవత్సరంగా నిలవనుందని తెలిపారు. కొవిడ్‌-19 సమయంలో పేరుకుపోయిన అప్పులను వివిధ దేశాలు తీర్చాల్సిన సమయం వచ్చిందన్నారు. అలాగే ఈ ఏడాది అనేక దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తుచేశారు. ఇది ఆయా ప్రభుత్వాలపై ఆర్థికంగా ఒత్తిడి పెంచుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని