Electric Vehicles: చలిలో విద్యుత్‌ వాహనాల వాడకం.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Electric Vehicles: శీతాకాలంలో విద్యుత్‌ వాహనాల పనితీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే పడిపోతే మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

Updated : 26 Dec 2023 12:32 IST

Electric Vehicles | ఇంటర్నెట్‌ డెస్క్‌: గతకొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి విజృంభిస్తోంది. ఇలాంటి వాతావరణంలో విద్యుత్‌ వాహనాల (Electric Vehicles- EV) పనితీరు భిన్నంగా ఉంటుంది. లిథియం-అయాన్ బ్యాటరీల్లో ఛార్జింగ్‌ త్వరగా తగ్గిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? శీతల వాతావరణంలో ఈవీలను ఎలా మెయింటైన్‌ చేయాలి? ఛార్జ్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..!

ఎలాంటి ప్రభావం ఉంటుంది?

శీతాకాలంలో ఈవీల (Electric Vehicles) పనితీరు సాధారణం కంటే 20-30 శాతం తగ్గుతుందని వాహన నిపుణులు చెబుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. బ్యాటరీ పనితీరు తగ్గడం ఒకటైతే.. శక్తి వినియోగం పెరగడం మరొకటి. EVల లిథియం-అయాన్ బ్యాటరీలు 15-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సరిగ్గా పనిచేస్తాయి. మరోవైపు చలికాలంలో వాహనాలకు అవసరమైన వేడి కోసం.. బ్యాటరీ నుంచే ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సాధారణ సమయంలో కంటే శీతాకాలంలో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.

మరోవైపు చలిలో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ అంత ప్రభావవంతంగా పనిచేయదు. సాధారణ సమయంలో ఈ అత్యాధునిక బ్రేకింగ్‌ వ్యవస్థ వల్ల బ్యాటరీ కొంతమేర ఛార్జ్‌ అవుతుంది. శీతాకాలంలో మాత్రం కుదరదు. ఈ నేపథ్యంలో చల్లని వాతావరణంలో ఈవీలను (Electric Vehicles) డ్రైవ్ చేయడం కొంత భిన్నంగా అనిపించవచ్చు. పైగా మాన్యువల్ బ్రేకింగ్‌ను ఉపయోగించాల్సి రావచ్చు.

ఇలా ఎందుకు జరుగుతుంది?

చలిలో లిథియం అయాన్‌ బ్యాటరీల్లోని ఎలక్ట్రోలైట్‌ ద్రవం మందంగా మారుతుంది. దీంతో ఎలక్ట్రోకెమికల్‌ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా బ్యాటరీల అంతర్గత నిరోధం పెరుగుతుంది. దీంతో లిథియం అయాన్లు.. యానోడ్‌, క్యాథోడ్‌ మధ్య సులభంగా చలించలేవు. ఇలాంటి స్థితిలో బ్యాటరీ నుంచి ఒక్కసారిగా శక్తిని తీసుకోవడం ప్రారంభిస్తే వోల్టేజ్‌ గణనీయంగా పడిపోయి డిశ్ఛార్జ్‌కు దారితీస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

  • వీలైనంత వరకు ఈవీలను (Electric Vehicles) బహిరంగ ప్రదేశాల్లో పార్క్‌ చేయొద్దు. ఇండోర్‌(Indoor)లో పార్క్‌ చేయడం వల్ల వాటిపై చలి ప్రభావం కొంతమేర తగ్గుతుంది. కుదరకపోతే కనీసం కవర్‌తోనైనా కప్పి ఉంచాలి.
  • ఈవీల (Electric Vehicles) ఛార్జింగ్‌ 20 శాతం కంటే దిగువకు పడిపోకుండా చూసుకోవాలి. లేదంటే వాహనాన్ని స్టార్ట్‌ చేసినప్పుడు కొన్ని పరికరాలు వేడి కావడానికి బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుంటాయి. దీంతో బ్యాటరీ మరింత తొందరగా డిశ్ఛార్జ్‌ అవుతుంది. ఒకవేళ చలికాలంలో దూర ప్రయాణాలను ప్లాన్‌ చేస్తే.. కనీసం 80 శాతానికి పైనే ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ప్రయాణం ప్రారంభించడానికి ముందే ఎలక్ట్రిక్ కార్లను ప్రీ-కండిషన్‌ చేయాలి. ఇంటీరియర్‌ను వేడెక్కించడానికి బ్యాటరీ నుంచే శక్తిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఛార్జింగ్‌ పెట్టడానికి ఆస్కారం ఉన్న సమయంలోనే కారును ప్రయాణానికి సిద్ధం చేసుకుంటే.. తరిగిపోయిన బ్యాటరీని తిరిగి ఛార్జ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలకు వెళ్లే ముందు ఈ జాగ్రత్త చాలా అవసరం.
  • వాహనాల పనితీరుపై టైర్లలోని గాలి ఒత్తిడి ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా టైర్లలో గాలి ఒత్తిడి మారుతుంటుంది. ఇది ఈవీల రేంజ్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే టైర్లలో సరిపడా గాలి ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
  • చలికాలంలో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. బ్యాటరీ చల్లగా ఉంటే మరింత సమయం కావాల్సిందే. అందుకే బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడే ఛార్జింగ్‌ పెట్టడం మేలు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని