Apple WWDC 2023: యాపిల్‌ గాగిల్స్‌ వచ్చేశాయ్‌.. ధరెంతో తెలుసా?

Apple Goggles: ఈ గాగిల్స్‌ .. పర్సనల్‌ టెక్నాలజీలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 06 Jun 2023 12:37 IST

కూపర్టినో: నాణ్యమైన, అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలకు పెట్టింది పేరైన టెక్ దిగ్గజం యాపిల్ (Apple) మరో కొత్త ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది. ఎంతో కాలంగా టెక్‌ ప్రియులను ఆతృతకు గురిచేసిన అత్యాధునిక హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. వర్చువల్‌, రియల్‌ ప్రపంచం మధ్య యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనున్న ఈ పరికరాన్ని సోమవారం జరిగిన వార్షిక సమావేశంలో సీఈఓ టిమ్‌ కుక్‌ పరిచయం చేశారు.

ఈ గాగిల్స్‌ (Apple Goggles).. పర్సనల్‌ టెక్నాలజీలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని కుక్‌ అభిప్రాయపడ్డారు. ‘విజన్ ప్రో’గా (Apple Vision Pro) పేర్కొంటున్న దీని ధర 3,500 డాలర్లు, వచ్చే ఏడాది ఆరంభంలో ఇవి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ గాగిల్స్‌లో 12 కెమెరాలు, ఆరు మైక్రోఫోన్లు, వివిధ రకాల సెన్సార్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి యూజర్లు కళ్లు, చేతులతోనే వివిధ రకాల యాప్‌లను నియంత్రించొచ్చు. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌లలో ప్రతి యూజర్‌ త్రీ-డైమెన్షనల్‌ వెర్షన్‌ను క్రియేట్‌ చేసేలా ప్రత్యేక సాంకేతికతను దీంట్లో పొందుపర్చారు.

ఇలా గాగిల్స్‌ లేదా గ్లాసెస్‌లో టెక్నాలజీని మిళితం చేస్తూ ఇప్పటికే పలు కంపెనీలు ప్రొడక్ట్‌లను విడుదల చేశాయి. తద్వారా యూజర్లను కృత్రిమ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. భౌతికంగా లేని వస్తువును మన కళ్ల ముందే ఉన్నట్లు చూపించే ‘ఆగ్మెంటెడ్‌ రియాలిటీ’ని పరిచయం చేశాయి. ఈ సాంకేతికతనే ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ‘మెటావర్స్‌ (metaverse)’గా వ్యవహరిస్తున్నారు. ‘క్వెస్ట్‌’ పేరిట మెటా విక్రయిస్తున్న వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ (virtual reality headset)కు ఇప్పుడు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అయితే, తాజాగా యాపిల్‌ ఎక్కడా తమ విజన్‌ ప్రో (Vision Pro) సాంకేతికతను ‘మెటావర్స్‌’గా పేర్కొనలేదు. దీన్నే వారు ‘స్పేషియల్‌ కంప్యూటింగ్‌ (spatial computing)’గా వ్యవహరించడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని