Credit Card Usage: క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించలేకపోతున్నారా?

క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగించకపోతే రుణ ట్రాప్ లో చిక్కుకునే అవకాశం ఉంది. దాంతోపాటు క్రెడిట్ స్కోర్‌ తగ్గిపోతుంది... 

Updated : 18 Sep 2022 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్: క్రెడిట్ కార్డులను (Credit Cards) సక్రమంగా వినియోగించకపోతే రుణ ట్రాప్ లో చిక్కుకునే అవకాశం ఉంది. దాంతోపాటు క్రెడిట్ స్కోర్‌ (Credit Cards) తగ్గిపోతుంది. దీంతో భవిష్యత్తులో రుణాలు పొందే అవకాశాన్నీ కోల్పోతారు. దీనిని అధిగమించడం కోసం ఏం చేయాలో పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు చెబుతున్నారు. 

పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసి...

కొంతమంది క్రెడిట్ కార్డు రుణాన్ని చెల్లించకుండా, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటారు. అదే సమయంలో బ్యాంకు ఖాతాలో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బు ఉంటుంది. అలాగే ఇతర పెట్టుబడులు చేస్తుంటారు. అలాంటి వాళ్లు పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ డబ్బును క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి వినియోగించుకుంటే మంచిది.

భాగాలలో రుణాన్ని చెల్లించొచ్చు

బ్యాంకు నుంచి జరిమానా తప్పించుకోడానికి క్రెడిట్ కార్డు కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లిస్తుంటారు కొంతమంది. ఇలా చేయడం వల్ల జరిమానా నుంచి మాత్రమే బటయపడతారు. కానీ మిగిలిన మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ ఉంటుంది. అన్నట్లు ఆ వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. 

రుణం తీసుకుని అయినా.. 

స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి రుణంగా తీసుకుని.. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి ప్రయత్నించాలి. కావాలంటే అప్పు తీర్చేటప్పుడు వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించండి.  క్రెడిట్‌ కార్డు జారీదారు విధించే జరిమానా, వడ్డీ కంటే బయట తక్కువ వడ్డీకి రుణం దొరకొచ్చు.

వ్యక్తిగత రుణం తీసుకున్నా..

వ్యక్తిగత రుణం (పర్సనల్‌ లోన్‌) కోసం దరఖాస్తు చేసుకొని, వచ్చిన మొత్తాన్ని క్రెడిట్ కార్డు  బిల్లును చెల్లించడం మరో మంచి మార్గం. వ్యక్తిగత రుణ వడ్డీ సుమారు 14 నుంచి 18 శాతం ఉంటుంది.  క్రెడిట్ కార్డు బ్యాలన్స్‌పై అయితే వడ్డీ రేటు సంవత్సరానికి 40 శాతంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే గృహ రుణం ఉన్నవారు.. టాప్ అప్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఇది వ్యక్తిగత రుణం వడ్డీ కంటే చౌకగా ఉంటుంది. 

ఈఎంఐకు మార్చండి

వ్యక్తిగత రుణాన్ని పొందలేకపోతే, బ్యాలెన్స్‌ను ఈఎంఐగా మార్చుకోవచ్చు. దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను 3, 6, 9, 12, 24 నెలల ఈఎంఐగా మార్చుకునే ఆప్షన్‌ను ఇస్తుంటాయి. వడ్డీ రేటు 13 నుంచి 18 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది.

బ్యాలెన్స్ బదిలీ సౌకర్యం..

క్రెడిట్ కార్డు సంస్థలు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ సదుపాయాన్నీ అందిస్తున్నాయి. ఒక క్రెడిట్ కార్డు నుంచి మరొక క్రెడిట్ కార్డుకు నగదు బదిలీ చేయవచ్చు. దాంతోపాటు 3 నెలల వడ్డీ లేని కాలపరిమితి ఇస్తారు. లేదంటే మొదటి కొన్ని నెలల్లో తక్కువ వడ్డీని వసూలు చేయడం వంటి లాభాలను కూడా ఇస్తారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌ఎస్‌బీసీ లాంటి కొన్ని ప్రధాన బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ బదిలీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఆప్షన్‌ను ఎంచుకునే ముందు, ప్రాసెసింగ్ ఫీజు ఉందా? ఉంటే ఎంత అనేది చెక్‌ చేసుకోండి.

క్రెడిట్ కార్డును తెలివిగా...

క్రెడిట్ కార్డు రుణ ట్రాప్‌లో పడకూడదు అంటే ఈ దిగువ ఆలోచనలు ఉపయోగపడతాయి.

  • గడువు తేదీకి 3 రోజుల ముందే మీ క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించండి. 
  • స్థోమతకు మించి ఎక్కువ ఖర్చు చేయవద్దు.
  • క్రెడిట్ కార్డుకు బదులుగా డెబిట్ కార్డును వినియోగించండి. అప్పుడు మీరు అవసరమైన వాటికి మాత్రమే చెల్లిస్తారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని