మార్కెట్లోకి BYD సీల్‌ EV.. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 200km ప్రయాణం

BYD: చైనా ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం BYD.. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ధర, ఇతర వివరాలు ఇవీ..

Published : 06 Mar 2024 02:30 IST

BYD | ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మార్కెట్‌లో మరో లగ్జరీ విద్యుత్‌ కారు విడుదలైంది. చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ BYD భారత్‌లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను లాంచ్‌ చేసింది. మూడు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. ఇందులో డైనమిక్‌ ఎడిషన్‌ బీవైడీ పీల్‌ ధర రూ.41 లక్షలుగా నిర్ణయించింది. ప్రీమియం వెర్షన్‌ ధర రూ.45.55 లక్షలు, పెర్ఫార్మెన్స్‌ వెర్షన్‌ రూ.53 లక్షలుగా పేర్కొంది.

ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ కారును స్పోర్టీ లుక్‌ ఉండేలా తీర్చిదిద్దారు. ఎలక్ట్రానిక్ హిడెన్‌ ఫ్లష్ డోర్ హ్యాండిల్, 19 అంగుళాల ప్రెసిషన్ బ్లేడ్ వీల్ హబ్, వాటర్‌డ్రాప్ ఆకారంలో ఉండే సైడ్ మిర్రర్‌లతో దీన్ని తీసుకొచ్చారు. ఈ కారు కేవలం 3.8 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 650 కిలోమీటర్లు వెళ్తుందని, కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్‌తో 200km ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది.

ఎనిమిదేళ్లు/ 1.6 లక్షల కిలోమీటర్లు పాటు బ్యాటరీపైనా, 8 ఏళ్లు/ 1.5 లక్షల కిలోమీటర్లు మోటార్‌పైనా వారెంటీ ఇస్తోంది. ఆరేళ్ల పాటు డీసీ అసెంబ్లీ, ఎలక్ట్రిక్‌ అసెంబ్లీ వారెంటీ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయని, రూ.1.25 లక్షలు చెల్లించి కారు బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. మార్చి 31లోగా బుక్‌ చేసుకున్న వారికి ఫ్రీ ఇన్‌స్టలేషన్‌తో పాటు 7 kw హోమ్‌ ఛార్జర్‌, 3 kw పోర్టబుల్‌ ఛార్జర్‌, BYD సీల్‌ మొబైల్ పవర్‌ సప్లై యూనిట్‌, ఆరేళ్ల పాటు రోడ్ అసిస్టెన్స్‌, ఒక కాంప్లిమెంటరీ ఇన్‌సెప్షన్‌ సర్వీస్‌ ఉచితంగా అందించనున్నట్లు బీవైడీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేషనల్ సేల్స్‌ హెడ్‌ శ్రీరంగ్‌ జోషి ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని