Credit Card: రికార్డు స్థాయికి క్రెడిట్‌ కార్డు వ్యయాలు.. అక్టోబరులో రూ.1.78 లక్షల కోట్లు

Credit Card: పండగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో క్రెడిట్‌ కార్డు వ్యయాలు భారీగా పెరిగాయి.

Updated : 24 Nov 2023 17:31 IST

ముంబయి: క్రెడిట్‌ కార్డు ద్వారా చేస్తున్న వ్యయాలు (Credit Card spending) దేశీయంగా 2023 అక్టోబరులో రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క నెలలోనే రూ.1.78 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 సెప్టెంబరులో నమోదైన రూ.1.42 లక్షల కోట్లతో పోలిస్తే 25.35 శాతం వృద్ధి నమోదైంది. పండగ సీజన్‌ నేపథ్యంలో ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (PoS)’, ఇ-కామర్స్‌ లావాదేవీలు పెరగడం భారీ వృద్ధికి దోహదం చేసింది.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. క్రెడిట్‌ కార్డు (Credit card) ద్వారా పీఓఎస్‌ లావాదేవీలు అక్టోబరు నెలలో రూ.57,774 కోట్లకు చేరాయి. అదే సమయంలో ఇ-కామర్స్‌ చెల్లింపులు రూ.1,20,794 కోట్లకు పెరిగాయి. సంస్థలవారీగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన తొలి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సెప్టెంబరులో ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డు (Credit card)ల ద్వారా రూ.38,662 కోట్లు విలువ చేసే లావాదేవీలు జరిగాయి. అక్టోబర్‌లో ఆ మొత్తం రూ.45,173 కోట్లకు పెరిగాయి.

అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డుల లావాదేవీల విలువ రూ.34,158 కోట్లకు, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుల లావాదేవీలు రూ.21,729 కోట్లకు ఎగబాకాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌ ద్వారా జరిగిన లావాదేవీలు విలువ సెప్టెంబరులో నమోదైన రూ.24,966 కోట్ల నుంచి రూ.35,406 కోట్లకు చేరాయి. మరోవైపు దేశీయ రుణ సంస్థలు జారీ చేసిన కొత్త కార్డుల సంఖ్య అక్టోబర్‌లో 17 లక్షలుగా నమోదైంది. దీంతో మొత్తం కార్డుల సంఖ్య 9.48 కోట్లకు చేరాయి.

అక్టోబరు నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు  (Credit card)ల సంఖ్య 1.91 కోట్లకు పెరిగింది. ఎస్‌బీఐ కార్డ్స్‌ 1.87 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.6 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 1.3 కోట్లకు చేరింది. హామీలేని రుణాలపై ఇటీవల ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల రుణ వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని