Health Insurance: ఆరోగ్య బీమాను సకాలంలో పునరుద్ధరించట్లేదా? ఈ ప్రయోజనాలు కోల్పోతారు!

Health Insurance | ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లించాలి. లేదంటే పాలసీ నిలిచిపోతుంది. ఆ సమయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇబ్బందులు ఎదురవుతాయి.

Updated : 09 Jan 2024 12:34 IST

Health Insurance | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా పాలసీని (Health Insurance) సకాలంలో పునరుద్ధరించాలి. అప్పుడే వయసు లేదా మారుతున్న ఆరోగ్య స్థితితో సంబంధం లేకుండా నిరంతర కవరేజీని పొందొచ్చు. పాలసీ (Health Insurance) అమల్లోకి రావడానికి ముందు ఉండే నిరీక్షణ వ్యవధి కూడా ఆలస్యం కాకుండా ముగుస్తుంది. వయసు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్ల కారణంగా క్లెయిం తిరస్కరణకు గురయ్యే ప్రమాదమూ ఉండదు.

సకాలంలో ఆరోగ్య బీమా పాలసీని పునరుద్ధరించకపోతే కలిగే నష్టాలేంటో చూద్దాం..

నిరంతర కవరేజీ కోల్పోతాం..

అనారోగ్య సమస్యలు చెప్పిరావు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీని సకాలంలో పునరుద్ధరించకపోతే.. సరిగ్గా అదే సమయంలో ఏదైనా జబ్బు చేస్తే ఇబ్బందులు తప్పవు. వైద్య ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థికంగా గడ్డుకాలం ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు పాలసీని పునరుద్ధరించాలి.

నిరీక్షణ వ్యవధి పొడిగింపు..

పాలసీ తీసుకున్న వెంటనే అది అమల్లోకి రాదు. కొంతకాలం వేచి చూడాలి. ఈ గడువునే నిరీక్షణ వ్యవధి అంటారు. ఇది 30 నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. కొన్ని తీవ్రమైన జబ్బులకు 4-5 ఏళ్లూ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాలసీ పునరుద్ధరణ సకాలంలో లేకపోతే.. ఈ గడువు పొడిగిస్తూ ఉంటారు. ఫలితంగా అత్యవసర సమయంలో మీకు పాలసీ ఉపయోగపడకపోవచ్చు.

అధిక ప్రీమియం..

కొన్ని బీమా సంస్థలు సకాలంలో పాలసీని పునరుద్ధరించని వారి నుంచి అధిక రుసుము వసూలు చేస్తాయి. ఒక్కోసారి మళ్లీ వైద్య పరీక్షలు చేసుకోవాల్సి రావొచ్చు. అప్పుడు ఏమైనా వ్యాధులు నిర్ధారణైతే అధిక ప్రీమియం తప్పదు. పైగా వయసు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్య స్థితి.. అర్హతలకు తగిన విధంగా లేకపోతే పాలసీని పూర్తిగా రద్దు చేసే ప్రమాదమూ ఉంది.

నో-క్లెయిం బోనస్‌ ఉండదు..

దీర్ఘకాలం పాటు పాలసీని క్లెయిం చేసుకోని వారికి సంస్థలు నో-క్లెయిం బోనస్‌ (No-Claim Bonus) పేరిట ప్రీమియంలో రాయితీ కల్పిస్తాయి. కొన్ని సంస్థలు 100 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నాయి. సకాలంలో పాలసీని పునరుద్ధరించకపోతే.. ఈ ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

పన్ను ప్రయోజనాలూ పోతాయ్‌..

ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్‌ 80డీ ద్వారా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుల కింద రూ.75 వేల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. దీనికి క్రియాశీలకంగా ఉన్న బీమా పాలసీ ఉండాలి. పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయానికి పాలసీని పునరుద్ధరించకపోతే.. ప్రయోజనాన్ని పొందలేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని