Elon Musk: మస్క్‌కు అంత వేతనమా..? వదులుకోవాలని కోర్టు తీర్పు!

Elon Musk: 2018లో మస్క్‌కు భారీ మొత్తం వేతనాన్ని చెల్లించిన టెస్లా బోర్డు నిర్ణయాన్ని డెలావెర్ కోర్టు తప్పుబట్టింది.

Published : 31 Jan 2024 08:45 IST

న్యూయార్క్‌: టెస్లా (Tesla) సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) 2018లో అందుకున్న భారీ వేతనాన్ని వదులుకోవాలని డెలావర్‌ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు తప్పుడు నిర్ణయమే అంత మొత్తం ప్యాకేజీ ఇవ్వడానికి దారి తీసిందని పేర్కొంది. ఇది కార్పొరేట్‌ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. దీనికి వాటాదారుల మద్దతు ఉన్నట్లు కూడా నిరూపించలేకపోయారని తెలిపింది.

ఎలాన్ మస్క్‌ (Elon Musk) 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్‌ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని డైరెక్టర్ల తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి కాథలీన్ మెక్‌కార్మిక్ మాత్రం వేతన ప్యాకేజీని నిర్ణయించడంలో తప్పు జరిగిందని తేల్చారు. డైరెక్టర్లు ప్రపంచంలో మస్క్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ప్యాకేజీని నిర్ణయించారని అభిప్రాయపడ్డారు. పైగా ఆయనతో సన్నిహిత సంబంధాలున్నవారే వేతనాన్ని నిర్ణయించే చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోందన్నారు. పైగా ఈ నిర్ణయాన్ని వాటాదారులందరికీ తెలియజేసి వారి ఆమోదం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. మస్క్‌ (Elon Musk) వేతనాన్ని నిర్ణయించేందుకు అసలు చర్చలు జరిపారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ తీర్పును టెస్లా బృందం డెలావెర్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

కోర్టు తీర్పుపై మస్క్‌ అసహనం వ్యక్తం చేశారు. డెలావెర్‌లో కంపెనీలు రిజిస్టర్‌ చేయొద్దని.. టెక్సాస్‌ లేదా నెవాడా రాష్ట్రాలను ఎంపిక చేసుకోవాలని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు మార్చాలా? అని పోల్‌ కూడా పెట్టారు. భారత కాలమానం ప్రకారం.. దీనిపై బుధవారం ఉదయం 7:45 గంటల సమయానికి 2,89,889 మంది స్పందించారు. ఇందులో 90 శాతం మంది ‘అవును’ అని సమాధానమిచ్చారు.

మస్క్‌కు ప్రస్తుతం టెస్లాలో 13 శాతం వాటా ఉంది. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌’ను కొనుగోలు చేసిన సమయంలో పెద్ద మొత్తంలో టెస్లా (Tesla) షేర్లను విక్రయించి నిధులను సమకూర్చుకున్నారు. అయితే, కంపెనీలో తన వాటాను పెంచుకోవాలనుకుంటున్నట్లు ఇటీవల అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ, రోబోటిక్‌ కంపెనీగా అవతరిస్తున్న టెస్లాలో ‘ఓటింగ్‌ నియంత్రణ’ తమ చేతిలో లేకపోతే ప్రమాదమని వ్యాఖ్యానించారు. లేదంటే కీలక ఉత్పత్తులను కంపెనీతో సంబంధం లేకుండా రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని