Elon Musk: ఒకే రోజు మస్క్‌ సంపదలో రూ.1.30 లక్షల కోట్లు ఆవిరి

Elon Musk: జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో టెస్లా బలహీన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. దీంతో గురువారం కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ సంస్థలో అత్యధిక వాటాలున్న మస్క్‌ సంపదలో భారీ పతనం నమోదైంది.

Updated : 20 Oct 2023 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంపద గురువారం భారీగా కుంగింది. టెస్లా షేర్ల (Tesla Shares) పతనమే అందుకు కారణం. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో టెస్లా (Tesla) ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో గురువారం కంపెనీ షేర్ల (Tesla Shares)లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

టెస్లా షేర్ల (Tesla Shares) పతనంతో మస్క్‌ (Elon Musk) సంపదలో 16.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.30 లక్షల కోట్లు) ఆవిరయ్యాయి. అయినప్పటికీ.. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. 210 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మస్క్‌ (Elon Musk) సంపద ఇప్పటి వరకు 70 బిలియన్‌ డాలర్లు పెరిగింది. టెస్లా షేర్లు (Tesla Shares) గురువారం ఏకంగా 9.3 శాతం నష్టపోయి 220.11 డాలర్ల వద్ద స్థిరపడింది. మస్క్‌కు ఈ కంపెనీలో 13 శాతం వాటాలు ఉన్నాయి. ఆయన సంపదలో అత్యధిక భాగం టెస్లా షేర్లదే.

ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు టెస్లా (Tesla) గత కొన్ని నెలల్లో కార్ల ధరలను భారీగా తగ్గించింది. దీంతో జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం క్షీణత నమోదైంది. ఆదాయం కూడా విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో టెస్లా షేర్ల (Tesla Shares)లో పతనం నమోదైంది. టెస్లా ఆర్థిక ఒడుదొడుకుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగలదంటూ ఇప్పటి వరకు చెప్పిన మస్క్‌ (Elon Musk).. బుధవారం ఫలితాల ప్రకటన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించారు. దీని వల్లే గిరాకీ నెమ్మదించిందని తెలిపారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ.. కస్టమర్లకు అందించాల్సిన 1.8 మిలియన్ల కార్లను డెలివరీ చేసి తీరతామని టెస్లా తెలిపింది. మరోవైపు నవంబరులో టెస్లా తమ సైబర్‌ట్రక్‌ను విడుదల చేసే యోచనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని