Festive Offers on Cars: కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.2 లక్షల వరకు పండగ ఆఫర్లు!

Festive Offers on Cars: కార్లపై ఆఫర్లు అక్టోబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి. కంపెనీ, మోడల్‌ను బట్టి వివిధ కార్లపై రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.2 లక్షల వరకు రాయితీ పొందొచ్చు.

Updated : 16 Oct 2023 13:27 IST

Festive Offers on Cars | ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. భారీ ఎత్తున రాయితీలు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కార్లపై రూ.10 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వివిధ రకాల ఆఫర్లు ఉన్నాయి. రాయితీ, ఎక్స్ఛేంజ్‌, లాయల్టీ బోనస్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్ల రూపంలో ఇవి అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు డీలర్లు సైతం తమ వంతుగా కార్ల యాక్సెసరీలపై అదనపు ఆఫర్లను ఇస్తున్నారు. అక్టోబర్‌ 31 వరకు కార్లపై ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. కాంపాక్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌లతో పాటు ఎస్‌యూవీలపైనా ఆఫర్లు ఉండడం విశేషం. సీఎన్‌జీ మోడళ్లనూ రాయితీ ధరతో పొందొచ్చు.

  • డీలర్ల ఆఫర్లతో కలిపి మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఆల్టో, వేగనార్‌, సెలెరియో, ఎస్‌ ప్రెసో కార్లపై రూ.61 వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. స్విఫ్ట్‌పై రూ.54 వేలు విలువ చేసే ఆఫర్లు ఉన్నాయి. అయితే, ఈ రాయితీలు అన్ని మోడళ్లకు వర్తించవని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.
  • హ్యుందాయ్‌ (Hyundai) సైతం తమ కార్లపై రాయితీలు అందిస్తోంది. ఎక్స్‌టర్‌, వెన్యూ, క్రెటా మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.10 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు డిస్కౌంట్లు వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. గ్రాండ్‌ ఐ10 నియోస్‌పై రూ.43 వేలు, ఆరాపై రూ.33 వేల వరకు ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. విద్యుత్‌ వాహనం కోనాపై రూ.రెండు లక్షల వరకు రాయితీ ఉన్నట్లు హ్యుందాయ్ వెల్లడించింది.
  • ఎస్‌యూవీలకు పెట్టింది పేరైన మహీంద్రా అండ్‌ మహీంద్రా (M&M) సైతం రూ.90 వేల వరకు ఆఫర్లను అందిస్తోంది. ఎక్స్‌యూవీ300పై రూ.90 వేలు, విద్యుత్‌ ఎక్స్‌యూవీ400పై రూ.1.25 లక్షల రాయితీ అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అధికంగా అమ్ముడయ్యే బొలెరోపై రూ.70 వేలు, బొలెరో నియోపై రూ.50 వేల రాయితీ ఉన్నట్లు పేర్కొంది. ఎక్స్‌యూవీ700, స్కార్పియో ఎన్‌, స్కార్పియో క్లాసిక్‌పై మాత్రం ఎలాంటి ఆఫర్లు లేవని స్పష్టం చేసింది.
  • నెక్సాన్‌, సఫారీ, హ్యారియర్‌ మోడళ్లలో టాటా (TATA Motors) అప్‌గ్రేడెడ్‌ వెర్షన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత మోడళ్లపై కంపెనీ రూ.1.40 లక్షల వరకు రాయితీ అందిస్తోంది.
  • వివిధ కంపెనీలకు చెందిన ప్రీమియం ఎస్‌యూవీలు టయోటా హీలక్స్‌, సిట్రోయెన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌, ఫోక్స్‌వ్యాగన్‌ టిగువాన్‌, జీప్‌ మెరీడియన్‌, జీప్‌ కంపాస్‌, ఎంజీ హెక్టార్‌, ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీపై రూ.1 లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు రాయితీ ఉండడం గమనార్హం.

నవరాత్రి, దసరా, దీపావళి నేపథ్యంలో ఈసారి కార్ల విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివిధ కారణాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా వాహన తయారీ నెమ్మదించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీలు రాయితీలు ఇవ్వలేకపోయాయి. ఈసారి పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని