PM Modi: ‘చంద్రయాన్‌-3’ విజయంతో.. దేశంలో పండగల సీజన్‌ మొదలైంది..!

చంద్రయాన్‌-3 విజయంతో భారత్‌ పండగల సీజన్‌ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం బీ20 సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.

Published : 27 Aug 2023 14:39 IST

దిల్లీ: చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయంతో భారత్‌లో పండగల సీజన్‌ ఆగస్టు 23నే మొదలైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దిల్లీలో సాగుతోన్న బీ-20 సదస్సు (B20 Summit)ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుత పారిశ్రామిక యుగంలో డిజిటల్‌ విప్లవానికి భారత్‌ ముఖచిత్రంగా మారిందని చెప్పారు. ‘క్రిప్టో కరెన్సీ’ సమస్యల పరిష్కారంతోపాటు కృత్రిమ మేధ (AI) నైతిక వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ అవసరమన్నారు. జీ20 (G20) కూటమిలో శాశ్వత సభ్యత్వం కోసం ఆఫ్రికన్‌ యూనియన్‌ (African Union)ను ఆహ్వానించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

భారత్‌ విజయానికి ప్రతీక చంద్రయాన్‌-3: మోదీ

‘వ్యాపార భవిష్యత్తుపై ప్రపంచ వృద్ధి ఆధారపడి ఉంది. ఎల్లలు దాటిన వ్యాపార రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇందులో ‘సరఫరా గొలుసు’ కీలకం. సమర్థ, విశ్వసనీయ ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో భారత్‌ ముఖ్యమైన పాత్ర కలిగి ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ఏడాదిలో ఒకరోజు ‘అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవం’ నిర్వహించాలని వ్యాపారవర్గాలకు పిలుపునిచ్చారు. భారత్‌లో హరిత ఇంధనంపై దృష్టి సారించామని, సౌర విద్యుదుత్పత్తిలో సాధించిన ప్రగతిని ఈ రంగంలోనూ ప్రతిబింబిస్తామని చెప్పారు. దేశంలో గత ఐదేళ్లలో దాదాపు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని