ఆంధ్రప్రదేశ్‌లో పసిడి తవ్వకాలు 2024లో: డీజీఎంఎల్‌ ఎండీ హనుమా ప్రసాద్‌

దేశంలోనే తొలి పెద్ద ప్రైవేటు బంగారు గనిలో వచ్చే ఏడాది చివర్లో తవ్వకాలు ప్రారంభిస్తామని డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) ఎండీ హనుమా ప్రసాద్‌ వెల్లడించారు.

Updated : 09 Oct 2023 07:22 IST

దిల్లీ: దేశంలోనే తొలి పెద్ద ప్రైవేటు బంగారు గనిలో వచ్చే ఏడాది చివర్లో తవ్వకాలు ప్రారంభిస్తామని డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిమిటెడ్‌ (డీజీఎంఎల్‌) ఎండీ హనుమా ప్రసాద్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరి వద్ద చేపట్టిన ఈ పసిడి  ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు ఇప్పటికే చేపట్టామని, పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత వార్షికంగా సుమారు 750 కిలోల పసిడిని వెలికితీస్తామన్నది అంచనాగా పేర్కొన్నారు. బీఎస్‌ఈలో నమోదైన తొలి, ఒకే ఒక్క పసిడి వెలికితీత కంపెనీ డీజీఎంల్‌ కావడం విశేషం. జియోమైసూర్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌లో 40 శాతం వాటా కలిగిన డీజీఎంఎల్‌ జొన్నగిరిలో తొలి ప్రైవేటు రంగ గోల్డ్‌ మైన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ పసిడి గనిలో ఇప్పటికే రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం నెలకు ఒక కిలో పసిడిని వెలికి తీస్తున్నారు. ‘జొన్నగిరి ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరు నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తికి సిద్ధమవుతుంద’ని ప్రసాద్‌ వివరించారు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో ఎర్రగుడి, పగడిరాయి, జొన్నగిరి గ్రామాల మధ్య ఈ గోల్డ్‌ మైన్‌ ఉంది. 2013లో ఈ గనికి అనుమతి లభించగా, పసిడి వెలికితీతకు సుమారు 8-10 ఏళ్లు సమయం పట్టిందని ప్రసాద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని