రెక్కలు తెగిన పక్షుల్లా విమానాలు

అమిత్‌ ఒక అత్యవసరమైన పనిమీద దుబాయ్‌ వెళ్లాల్సి వచ్చింది. ఒక పేరున్న విమానయాన సంస్థలో టికెట్‌ కొనుక్కొని బయలుదేరాడు. కానీ ఆ విమానంలో అన్నీ సమస్యలే.

Updated : 28 Jan 2024 08:34 IST

విడిభాగాలు లేక నేలచూపులు
నిర్వహణ, మరమ్మతులు సైతం సమస్యే
రద్దీకి తగినట్లుగా సర్వీసులు పెంచలేకపోతున్నారు
పరిశ్రమకు అనూహ్య ఇబ్బందులు
ఈనాడు - హైదరాబాద్‌

మిత్‌ ఒక అత్యవసరమైన పనిమీద దుబాయ్‌ వెళ్లాల్సి వచ్చింది. ఒక పేరున్న విమానయాన సంస్థలో టికెట్‌ కొనుక్కొని బయలుదేరాడు. కానీ ఆ విమానంలో అన్నీ సమస్యలే. వాష్‌రూంకు వెళ్తే నీటి పంపునకు సెన్సర్‌ లేదు. చేత్తో పంపు తిప్పుకోవాల్సి వచ్చింది. సరే అని, సర్దుకొని వచ్చి సీట్లో కూర్చొని కాసేపు పాటలు విందామని, ఇయర్‌ఫోన్‌ చెవిలో పెట్టుకొని ఎదురుగా ఉన్న స్క్రీన్‌ని ఆన్‌ చేశాడు. అది పనిచేయలేదు. ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి అడిగాడు, ఏంటండీ ఇదంతా అని.. ‘విడిభాగాలు దొరకటం లేదు సర్‌, అందువల్ల మెయింటెనెన్స్‌ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి... క్షమించాలి’.. అని బతిమలాడుతున్నట్లుగా చెప్పింది. ఇది ఒక ఉదంతం మాత్రమే.

మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో వివిధ విమానయాన సంస్థలు కూడా విడిభాగాల సమస్యతో సతమతం అవుతున్నాయి. చిన్న చిన్నవి, నాన్‌-క్రిటికల్‌ విడిభాగాలు సైతం సకాలంలో లభ్యం కాని పరిస్థితులను విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్నాయి. దీంతో విమానాల నిర్వహణ మీద ప్రభావం పడుతోంది. తగిన సమయంలో విమానాల మెయింటెనెన్స్‌ పూర్తి చేయలేక వాటిని నిలిపివేయాల్సి వస్తోంది. ఆకాశంలో ఎగరాల్సిన విమానాలు.. ఎయిర్‌పోర్ట్‌ హ్యాంగర్లలో ఎక్కువ కాలం ఉంటున్నాయి.

కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో సమస్య

కొవిడ్‌ ముప్పు సమయంలో విమానాల రాకపోకలు సాధ్యం కాలేదు. దీంతో విమానాల తయారీ, నిర్వహణ, విడిభాగాల ఉత్పత్తి సంస్థలు, విమానయాన సంస్థలు పెద్దఎత్తున తమ ఉద్యోగులను తొలగించాయి. దీంతో విడిభాగాల సరఫరా, విమానాల నిర్వహణపై ప్రభావం పడింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ‘బూమ్‌’ వచ్చింది. దీనికి తోడు భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విమాన పరిశ్రమ అనూహ్యంగా విస్తరిస్తోంది. దీంతో విమానాల ఉత్పత్తి నుంచి నిర్వహణ, విడిభాగాల సరఫరా వరకు భారీ గిరాకీ ఏర్పడింది. ఈ తరుణంలో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. విమానాల నిర్వహణ, విడిభాగాల సరఫరా సమస్యాత్మకంగా మారడంతో.. విమానాలను ఖాళీగా ఉంచాల్సి వస్తున్నట్లు పరిశ్రమ వర్గాల కథనం.

ప్రాట్‌ అండ్‌ విట్నీ ఉదంతం

ప్రాట్‌ అండ్‌ విట్నీ సరఫరా చేసిన ఇంజిన్లతో కూడిన విమానాల్లో తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఎదురుకావటంతో దేశీయ విమానయాన సంస్థ అయిన గో ఎయిర్‌ కష్టాల్లో చిక్కుకుంది. సకాలంలో ఈ ఇంజిన్లను సరిచేయలేక పోవడంతో సమస్య మరింత తీవ్రమయ్యింది. ఈ ఇంజిన్లను ఎయిర్‌బస్‌ ఏ320 నియో, ఇతర విమానాల్లో వినియోగిస్తున్నారు. ‘పౌడర్‌ మెటల్‌’ సమస్య వల్ల ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజిన్లలో పగుళ్లు కనిపించాయి. దీంతో వివిధ విమానాల్లో వినియోగంలో ఉన్న ఇంజిన్లను తనిఖీ చేయటానికి 600-700 మంది ఇంజినీర్లను పురమాయించాల్సి వచ్చింది. మొదట్లో ఈ పని రెండు నెలల్లో పూర్తవుతుందనుకున్నారు. కానీ ఇంజినీర్ల లభ్యత లేకపోవడంతో పాటు ఇతర సమస్యల వల్ల ఏడాది కాలం పడుతుందని భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులకు సైతం ఇబ్బందికరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా 40కి పైగా విమానయాన సంస్థలు ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజిన్ల సమస్యతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. 

‘లోకలైజేషన్‌’తోనే పరిష్కారం

విడిభాగాలను స్థానికంగా సేకరించడం; విమానాల నిర్వహణ, మరమ్మతులను సైతం స్థానికంగానే చేపట్టడమే తగిన పరిష్కారమని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే అది అంత సులువు కాదు. ఎంపిక చేసిన/గుర్తించిన సంస్థల నుంచి మాత్రమే విడిభాగాలను సేకరించి వినియోగించాలని విమానాల తయారీ సంస్థలు నిర్దేశిస్తాయి. విమానాల్లో వినియోగించే టాయ్‌లెట్‌ పేపర్‌, సీట్‌ కవర్లు, నాప్‌కిన్లు, ట్రేలు... తదితర అన్ని రకాలైన వస్తువులకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. తత్ఫలితంగా విడిభాగాలను స్థానికంగా ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నప్పటికీ, వాటి నుంచి ఆయా ఉత్పత్తులను సేకరించలేని పరిస్థితిలో విమానయాన సంస్థలు ఉన్నాయి. మనదేశంలో తగినంతగా ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఓవర్‌హాలింగ్‌) సదుపాయాలూ లేకపోవటం గమనార్హం. డీజీసీఏ(డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నుంచి అనుమతి లేకుండా విడిభాగాలు సేకరించటం సాధ్యం కాదు. మరమ్మతులు, నిర్వహణ విషయంలోనూ అంతే. ఈ పరిస్థితి మారాలంటే, స్థానికంగా లభ్యమయ్యే విడిభాగాలు, వస్తువులు వినియోగించటానికి అనుమతి ఇవ్వటం, ఎంఆర్‌ఓ సదుపాయాలను విస్తరించడమే మార్గంగా కనిపిస్తోంది. అప్పటి వరకూ ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలోనూ విమానయాన సంస్థలకు ఇబ్బందులు తప్పవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని