కేంద్ర బడ్జెట్‌.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..

గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది.

Updated : 02 Feb 2024 05:29 IST

పల్లె ప్రగతికి పెద్దపీట
గ్రామీణాభివృద్ధికి కేటాయింపుల పెంపు

దిల్లీ: గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. 2023-24తో ఇచ్చిన రూ.1.57 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం రూ.86,000 కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన నిధులు రూ.60,000 కోట్లతో పోలిస్తే 43 శాతం ఎక్కువ కేటాయించడం విశేషం. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనకు ఈసారి నిధుల్ని తగ్గించారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.12,000 కోట్లను ప్రకటించారు. గత బడ్జెట్‌లో కేటాయింపులు రూ.19,000 కోట్లు.


బయోమాస్‌ను సీబీజీగా మార్చేందుకు ఆర్థిక సాయం

బయోమాస్‌ను కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ)గా మార్చేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. వాహనాలు, దేశీయ సరఫరాల కోసం ఇంధనంగా వినియోగించేందుకు సహజ వాయువులో తప్పనిసరిగా సీబీజీ కలపడాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశ ఇంధన భద్రతకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. బయోమాస్‌ అగ్రిగేషన్‌ పరికరాలు సమకూర్చుకునేందుకు ఆర్థిక సాయం కల్పిస్తామని అన్నారు. హరిత వృద్ధిని ప్రోత్సాహించేందుకు బయో తయారీ, బయో- ఫౌండ్రీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.


ఎన్నికల సంఘానికి రూ.306 కోట్లు

దిల్లీ: ఈ ఏడాది లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘాని(ఈసీ)కి 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.306.06 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో కేంద్రం రూ.385.67 కోట్లు ఇచ్చింది. న్యాయమంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,502.30 కోట్లు ఇవ్వగా.. 2024-25లో రూ.34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబంధించిన ఎన్నికలు, ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది.


పరిశోధనలకు రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌

దిల్లీ: ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ‘ఈ నిధితో.. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఔత్సాహికులను ప్రోత్సహిస్తాం. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌ లేదా రీఫైనాన్సింగ్‌, పూర్తిగా వడ్డీ లేకుండా సాయం చేస్తాం. యువత, సాంకేతికతను సమ్మిళితం చేసేలా.. సన్‌రైజ్‌ డొమైన్‌లో పరిశోధన, ఆవిష్కరణలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


ఉడాన్‌లో 517 మార్గాలు

దిల్లీ: పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా ప్రస్తుత విమానాశ్రయాల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని వేగంగా కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గత పదేళ్లలో విమానాశ్రయాలు రెట్టింపై 149కు చేరాయని తెలిపారు. దేశీయ సంస్థలు 1120 కొత్త విమానాలకు ఆర్డర్లు పెట్టినట్లు గుర్తు చేశారు.  చిన్న పట్టణాలకు విమానాలు నడిపేందుకు అమలు చేస్తున్న ప్రాంతీయ వాయు అనుసంధానత పథకం (ఉడాన్‌) కింద వాయు ప్రయాణాలను మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎఫ్‌ఎం తెలిపారు. ఈ పథకం కింద 517 కొత్త మార్గాల్లో 1.3 కోట్ల మంది ప్రయాణించారని వివరించారు.

నిధులు ఇలా: 2024-25లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రూ.2,300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 2023-24లో ఈ శాఖకు సవరించిన అంచనా రూ.2,922.12 కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే. ఉడాన్‌కు 2024-25లో రూ.502 కోట్లు కేటాయించారు. 2023-24లో సవరించిన అంచనాలు రూ.850 కోట్ల కంటే ఇది తక్కువ. 22 విమానాశ్రయాలను పునరుద్ధరించడం, 124 వాయు మార్గాలను ప్రారంభించడంతో పాటు ఈశాన్య ప్రాంతాల అనుసంధానత కోసం, వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కోసం తాజాగా కేటాయించిన నిధులను వినియోగించనున్నారు.


‘జనాభా పెరుగుదల- సవాళ్ల’పై ఉన్నత స్థాయి కమిటీ

దిల్లీ: వేగంగా జనాభా పెరుగుదల, అందులో మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాలను చేరుకునేందుకు ఉన్న సవాళ్లను కమిటీ తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుందన్నారు.


అప్పు చేయాల్సిందే!
రెవెన్యూ లోటును పూడ్చేందుకు రూ.14.13 లక్షల కోట్ల రుణాలు

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు రూ.14.13 లక్షల కోట్ల రుణాల్ని తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరం స్థూల రుణ అంచనా రూ.15.43 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. వచ్చే ఏడాది పన్నుల ద్వారా రాబడి పెరుగుతుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు రుణ సేకరణను తగ్గించుకుంది.


జలంతోనే జీవనమని!
జల్‌జీవన్‌ మిషన్‌ మరింత బలోపేతం

తాగునీటి సదుపాయ కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు రూ.98,418 కోట్లను కేటాయించారు. ఇందులో 71 శాతం నిధులు ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కోసం వెచ్చిస్తారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యాన్ని కల్పించనున్నారు. 2023-24 బడ్జెట్‌లో జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు రూ.96,549 కోట్లు కేటాయించారు.

‘జాతీయ గంగా ప్రణాళిక’ కింద గంగ, దాని ఉపనదులకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులు, పథకాల అమలు కోసం రూ.3,500 కోట్లను, ప్రధాన మంత్రి క్రిషి సించాయీ యోజనకు రూ.2,500 కోట్లను తాత్కాలిక బడ్జెట్‌లో కేటాయించారు.


పోషణ్‌ 2.0కు రూ.21,200 కోట్లు

దిల్లీ: మహిళా శిశు సంక్షేమ శాఖకు 2024-25 బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. గతం కంటే 2.52 శాతం నిధులను పెంచి రూ.26,000 కోట్లను కేటాయించారు. వీటిల్లో వివిధ పథకాల ఉమ్మడి కార్యక్రమమైన పోషణ్‌ 2.0కు అత్యధికంగా      రూ.21,200 కోట్లను ఖర్చు చేయనున్నారు. అంగన్‌వాడీ సర్వీసులు, పోషణ్‌ అభియాన్‌ తదితర పథకాలు పోషణ్‌   2.0లో భాగంగా ఉన్నాయి. మహిళల రక్షణ, స్వయంఉపాధికి ప్రారంభించిన మిషన్‌ శక్తికి రూ.3,145.97 కోట్లు, బాలల రక్షణ, సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్‌ వాత్సల్యకు రూ.1,472 కోట్లను కేటాయించారు. ఈ శాఖ కింద పనిచేసే స్వతంత్ర సంస్థలు కేంద్రీయ దత్తత సంసాధన సంస్థ (సీఏఆర్‌ఏ), జాతీయ బాలల రక్షణ, హక్కుల కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌), జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్సీడబ్ల్యూ)లకు గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.15 కోట్లు కోత విధించి    రూ.153 కోట్లు కేటాయించారు.


జనగణన మరింత ఆలస్యం!
కేటాయింపులు తగ్గడమే కారణం

దిల్లీ:  బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం రూ.1,277.80 కోట్లను కేటాయించారు. ఇది మూడేళ్ల క్రితం కంటే చాలా తక్కువ. 2021-2022లో జన గణనకు రూ.3,768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ ఏడాది అంతకన్నా తక్కువ కేటాయించడంతో జనాభా లెక్కలు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రూ.8,754 కోట్లతో 2021లో జనగణన చేపట్టాలని, రూ.3,941 కోట్లతో జాతీయ జనాభా నమోదు నవీకరించాలని గతంలో కేబినెట్‌ నిర్ణయించింది. 2020 ఏప్రిల్‌ 1నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రక్రియ పూర్తి కావాలని ప్రణాళికలు చేసినా ఫలించలేదు. తర్వాత ఇప్పటివరకూ కొత్తగా ప్రకటన చేయలేదు. సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణంగా ఈ ఏడాదీ జనగణన చేపట్టే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు.


‘వికసిత భారత్‌’ సాకారమయ్యేలా..

రాష్ట్రాలకు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు

దిల్లీ: 2047 నాటికి ‘వికసిత భారత్‌’ సాకారానికి రాష్ట్రాలు చేపట్టే సంస్కరణలకు తోడ్పాటు అందించేందుకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను.. 50 ఏళ్ల కాలపరిమితితో అందించనుంది. కాగా, 2024-25 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రాష్ట్రాలకు రూ.22,22,264 కోట్ల నిధులు బదిలీ చేయనున్నారు. ఇందులో రాష్ట్రాల నుంచి వచ్చిన నిధుల్లో వాటాతో పాటు గ్రాంట్లు/రుణాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇచ్చే నిధులు ఉంటాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ కేటాయింపులతో పోల్చితే ఇది రూ.4,13,848 కోట్లు అధికం. దేశ సర్వతోముఖ, సమ్మిళిత అభివృద్ధి సాధించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.


గిరిజనానికి 70% నిధుల పెంపు

దిల్లీ: గిరిజనుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ... కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తాత్కాలిక బడ్జెట్‌లో రూ.13,000 కోట్లను నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.7,605 కోట్లతో పోలిస్తే 70 శాతం ఎక్కువ. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి రూ.6,399 కోట్లను వెచ్చించనున్నారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్‌ గ్రామ యోజనకు రూ.1,000 కోట్లను ప్రకటించారు.


పాఠశాల విద్యకు రూ.73 వేల కోట్లు

దిల్లీ: గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి కేంద్రప్రభుత్వం రూ.73,498 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పీఎం శ్రీ పథకానికి బడ్జెట్‌లో రూ.6,050 కోట్లు కేటాయించారు. సమగ్ర శిక్షా అభియాన్‌, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలకు సైతం ఈ బడ్జెట్‌లో ఎక్కువ నిధులను ఇవ్వనున్నారు. పాఠశాల విద్యకు కేంద్రం వాటాగా రాష్ట్రాలకు వెళ్లాల్సిన నిధులనూ పెంచారు. రాష్ట్రాలకు రూ.8,200 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.308 కోట్ల చొప్పున కేటాయింపులు పెరిగాయి.


2014 తర్వాతే పెద్ద సంఖ్యలో ఐఐటీలు, ఐఐఎంలు

ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను 2014 తర్వాత పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశామని కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. ఈ దశాబ్ద కాలంలో 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్‌, 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పామని పేర్కొన్నారు.


అయిదేళ్లు... రెండు కోట్ల ఇళ్లు!

దిల్లీ: ఎన్నికల వేళ మధ్య తరగతిని ఆకర్షించేందుకు కేంద్రం గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. రానున్న ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ) కింద మరో రెండు కోట్ల ఇళ్లను అదనంగా నిర్మించనున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.80,671 కోట్లను కేటాయించారు. 2023-24లో కేటాయించిన రూ.79,590 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువ. అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీల్లో నివసించే మధ్య తరగతి వారి కోసం గృహాల్ని నిర్మించేందుకు, కొనుగోలు చేసేందుకు ఈ పథకం ఉపకరిస్తుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న మూడు కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోనున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న కుటుంబాల అవసరాల్ని తీర్చేందుకు రాబోయే ఐదేళ్లలో అదనంగా మరో రెండు కోట్ల ఇళ్లను అందుబాటులో తెస్తామంది. ఈ పథకంలో భాగంగా మైదాన ప్రాంత లబ్ధిదారులకు రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లోని వారికి రూ.1.30 లక్షల చొప్పున సాయంగా అందిస్తారు. ఈ వ్యయాన్ని 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.


వాణిజ్యంపై యుద్ధాల ప్రభావం: నిర్మల

దిల్లీ: యుద్ధాలు, సంఘర్షణల నడుమ అంతర్జాతీయ వ్యవహారాలు మరింత సంక్లిష్టంగా, సవాలుగా మారాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ సంక్షోభాల వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు వ్యవస్థలు దెబ్బతిన్నాయని తద్వారా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. చమురు, ఎరువుల ధరలపై ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్‌ విజయవంతంగా ముందుకు వెళుతోందని ఆమె అన్నారు.


అమృతకాలంలో అద్భుత ప్రగతి

ప్రతి రంగంలోనూ భారత్‌ను అగ్రగామి దేశంగా నిలబెట్టే కృషిలో భాగంగా గత పదేళ్ల అమృత కాలంలో మోదీ ప్రభుత్వం సాధించిన మైలురాళ్లపై బడ్జెట్‌ ప్రసంగం వెలుగులు ప్రసరించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను చూడాలన్న మోదీ దార్శనికతకు ఇది మార్గనిర్దేశం చేస్తోంది. ఈ ప్రగతి పునాదులపైనే వికసిత భారత్‌ అనే అద్భుతమైన భవన నిర్మాణం జరుగుతుంది.

అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి


జవాబుదారీతనం, దార్శనికత లేవు

కేంద్ర ఆర్థికమంత్రి గత ప్రభుత్వంపై శ్వేతపత్రం ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు మోదీ సర్కారును మేము అడుగుతున్నాం. గత పదేళ్లుగా మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? ప్రజలకు పెద్ద పెద్ద కలలను చూపించారు. పేర్లు మార్చి పాత పథకాలనే మళ్లీ ప్రారంభించారు. ఈ బడ్జెట్‌లో జవాబుదారీతనం, దార్శనికత రెండూ లేవు. ఇబ్బందులు పడుతున్న పేదలు, మధ్యతరగతి వారి కోసం కొత్త పథకాలు తెస్తారని ఎదురుచూస్తే నిరాశే మిగిలింది.

మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు


ముద్రా యోజనతో రూ. 22.5 లక్షల కోట్ల రుణాలు

జన్‌ధన్‌ ఖాతాల్లో పొదుపు మొత్తం రూ.2.7 లక్షల కోట్లు

దిల్లీ: ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలను అందించామని.. ఆ రుణాల విలువ రూ.22.5 లక్షల కోట్లని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. జన్‌ధన్‌ ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.34 లక్షల కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేయగా.. వాటిల్లో పొదుపు మొత్తం రూ.2.7 లక్షల కోట్లుగా ఉందని  తెలిపారు. గత పదేళ్లలో మహిళలకు     30 కోట్ల ముద్ర రుణాలను అందించామని వెల్లడించారు. అర్హుల్లో చివరి వ్యక్తికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఇదే నిజమైన సామాజిక న్యాయం, లౌకికత్వం  అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని