ఈఎల్‌ఎస్‌ఎస్‌.. కాస్త భిన్నంగా

ఆదాయపు పన్ను సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఒకటి.

Updated : 09 Dec 2022 05:15 IST

ఆదాయపు పన్ను సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఒకటి. ఇప్పటికే ఈ విభాగంలో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కొంత భిన్నమైన రీతిలో ఒక నూతన ఈఎల్‌ఎస్‌ఎస్‌ను ఐఐఎఫ్‌ఎల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌ పరిజత్‌ గర్గ్‌. ‘ఐఐఎఫ్‌ఎల్‌ ఈఎల్‌ఎస్‌ఎస్‌ నిఫ్టీ 50 ట్యాక్స్‌ సేవర్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ కొత్త పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 21. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ 50 సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. నిఫ్టీ 50 అయిదేళ్ల కాలంలో 14 శాతం వార్షిక సగటు రాబడిని నమోదు చేసింది. ప్రధానంగా నిఫ్టీ 50 షేర్లతో పోర్ట్‌ఫోలియో నిర్మించాలనుకోవడం ఈ పథకంలోని ప్రత్యేకత. తద్వారా హెచ్చుతగ్గులను, రిస్కును తగ్గించుకొని, స్థిరమైన రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది. కనీసం నిఫ్టీ 50 సాధించిన ప్రతిఫలాన్ని ఈ పథకం నమోదు చేస్తుంది. అంతేకాకుండా ఇది ఇండెక్స్‌ ఫండ్‌ కాబట్టి, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టిన పెట్టుబడిని కనీసం మూడేళ్లు కొనసాగించాలి.


రుణ పత్రాల్లో పరోక్ష పెట్టుబడి

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఓపెన్‌ ఎండెడ్‌ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. యాక్సిస్‌ లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 21న ముగియనుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ప్రధానంగా రుణ, మనీ మార్కెట్‌ పత్రాలతో ఈ పథకం పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేస్తారు. ‘నిఫ్టీ లాంగ్‌ డ్యూరేషన్‌ డెట్‌ ఇండెక్స్‌ ఏ-3’ని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పథకానికి డేవంగ్‌ షా, కౌస్తుభ్‌ సూలే, హార్దిక్‌ షా ఫండ్‌ మేనేజర్లు. కేవలం ఈక్విటీ పథకాల్లోనే పెట్టుబడులు ఉన్న మదుపరులు, కొంత మొత్తాన్ని రుణ పథకాలకు మళ్లించాలని, తద్వారా స్థిరమైన ప్రతిఫలాన్ని ఆర్జించాలనుకుంటే.. ఇలాంటి దీర్ఘకాలిక (లాంగ్‌ డ్యూరేషన్‌) పథకాలను పరిశీలించవచ్చు. మార్కెట్లో వడ్డీ రేట్ల స్థితిగతులను ఆధారంగా తీసుకొని, అధిక రాబడిని ఆర్జించే రుణ పత్రాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఫండ్‌ మేనేజర్‌ చొరవ తీసుకునే అవకాశం ఈ తరహా పథకాల్లో ఉంటుంది.


నష్టభయం తక్కువగా..

నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ జీ-సెక్‌ ఆధారిత టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ పథకాన్ని తీసుకొచ్చింది. నిప్పాన్‌ ఇండియా నిఫ్టీ జీ-సెక్‌ జూన్‌ 2036 మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ రుణ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ ఈ నెల 13. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.1,000. కొనుగోలు/అమ్మకపు రుసుములు లేవు. ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత ఫండ్‌ యూనిట్ల క్రయవిక్రయాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతాయి. ‘నిఫ్టీ జీ -సెక్‌ జూన్‌ 2036 ఇండెక్స్‌’ ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఈ పథకానికి వివేక్‌ శర్మ, సిద్ధార్థ్‌ దేబ్‌ ఫండ్‌ మేనేజర్లు. ఈ పథకం కింద ప్రధానంగా జీ-సెక్‌ (ప్రభుత్వ సెక్యూరిటీలు) లతో కూడిన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఉంటుంది. అందువల్ల పెట్టుబడులపై దాదాపు నష్టభయం ఉండదనే చెప్పాలి. అదే సమయంలో స్థిరమైన ప్రతిఫలం ఉంటుంది. దాదాపుగా జీ-సెక్‌ లపై ఎంత వడ్డీరేటు లభిస్తుంటే, దానికి దగ్గరగా ఈ మ్యూచువల్‌ పథకంపై ప్రతిఫలం ఉంటుంది. ఎలాంటి రిస్కూ లేకుండా ఒక మాదిరి ప్రతిఫలంతో సంతృప్తి పడే మదుపరులకు ఇటువంటి పథకాలు అనువుగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని