డెట్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?

ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం.

Updated : 22 Mar 2024 03:47 IST

ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం.

 స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పథకాలన్నింటిలోనూ ఎంతో కొంత నష్టభయం దాగి ఉంటుంది. డెట్‌ పథకాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. కాబట్టి, డెట్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకునే వారు ముందుగా.. ఇవి సురక్షితమైన పెట్టుబడి పథకాలనే అపోహను వీడాలి. ఈక్విటీ ఫండ్లతోపాటు, కొంత మొత్తాన్ని డెట్‌ ఫండ్లకు కేటాయించడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం కనిపిస్తుంది. దీర్ఘకాలంలో రెండు విధాల ఫండ్ల ద్వారా సగటు రాబడి ఆశాజనకంగా ఉంటుందని భావించవచ్చు.

లక్ష్యం ఏమిటి?: డెట్‌ ఫండ్లు ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్‌ బాండ్లు తదితర పథకాల్లో మదుపు చేస్తాయి. సాధారణ ఈక్విటీ పథకాలతో పోలిస్తే వీటి పెట్టుబడి వ్యూహం భిన్నంగా ఉంటుంది. కొన్ని ఫండ్లు మూడేళ్ల పరిమితి ఉన్న బాండ్లలో మదుపు చేస్తాయి. మరికొన్ని స్వల్పకాలిక పథకాలను ఎంచుకుంటాయి. కాబట్టి, డెట్‌ ఫండ్లలో మదుపు చేసే ముందు మీరు ఎంచుకోవాలనుకున్న పథకం వ్యూహం ఏమిటన్నది అర్థం చేసుకోవాలి. అది మీ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఉందా అనేది చూసుకోవాలి.

ఎంత వ్యవధికి?: డెట్‌ ఫండ్లు వివిధ వ్యవధుల బాండ్లు, సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. కొన్ని ఫండ్లు వారం వ్యవధితో ఉన్న బాండ్లలోనూ పెట్టుబడులు పెడతాయి. కాబట్టి, మీరు ఎంత కాలం పెట్టుబడిని కొనసాగిస్తారు అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న డెట్‌ ఫండ్‌ వివిధ పథకాల్లో ఎంత వ్యవధి పాటు పెట్టుబడి కొనసాగిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. దీనివల్ల ఏ స్థాయిలో రాబడి వస్తుందన్న విషయాన్ని అంచనా వేసేందుకు వీలవుతుంది. ఉదాహరణకు ఒక ఫండ్‌ సగటున మూడేళ్ల పాటు వ్యవధి ఉన్న పథకాల్లో మదుపు చేస్తుందనుకుందాం. అప్పుడు రెండు నుంచి మూడేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించాలనుకునే వారే ఆ డెట్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి.

రాబడి మాటేమిటి?: సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు డెట్‌ ఫండ్ల రాబడి తక్కువగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే, వీటి నుంచి కాస్త అధిక రాబడిని ఆశించవచ్చు. వివిధ సందర్భాల్లో ఒక ఫండ్‌ అందించిన ప్రతిఫలాన్ని బేరీజు వేసుకోవాలి. డెట్‌ ఫండ్ల నుంచి సగటున 7-9 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గత రాబడులు భవిష్యత్‌ రాబడికి హామీ ఇవ్వవని గుర్తుంచుకోవాలి. చరిత్ర కేవలం ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వివిధ మార్కెట్‌ పరిస్థితుల్లో ఆ ఫండ్‌ పనితీరు ఎలా ఉందనేది బేరీజు వేసుకొని, ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఏడాది, మూడు, ఐదేళ్ల కాలంలో ఆ ఫండ్‌ ఎలా పనిచేసింది? రాబడులను ఎలా ఇచ్చింది అనేది చూడాలి. ప్రామాణిక సూచీలను అధిగమించిందా? లేదా ఆయా విభాగాల్లోని ఇతర ఫండ్లతో పోల్చి చూసినప్పుడు మెరుగైన రాబడులను ఇచ్చిందా అనేది పోల్చి చూసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత పరిశోధన తప్పనిసరి అనేది మర్చిపోవద్దు.

రేటింగ్‌లను చూడాలి: డెట్‌ ఫండ్ల రాబడి వడ్డీ రేటుతో పాటు అది మదుపు చేసే వివిధ బాండ్ల రేటింగ్‌లపైనా ఆధారపడి ఉంటుంది. మంచి కంపెనీల బాండ్లకు క్రెడిట్‌ రేటింగ్‌ అధికంగా ఉంటుంది. ఏఏఏ రేటింగ్‌ ఉన్న బాండ్లలో మదుపు చేసినప్పుడు ఆ డెట్‌ ఫండ్‌లో నష్టభయం కాస్త తగ్గుతుంది. డెట్‌ ఫండ్లను విశ్లేషించేటప్పుడు అధిక రాబడి కోసం తక్కువ రేటింగ్‌ ఉన్న బాండ్లలో పెట్టుబడి పెట్టేవాటికి కాస్త దూరంగా ఉండటమే మేలు.

పెద్ద ఫండ్లలోనే: డెట్‌ ఫండ్ల ఎంపికలో ఆయా ఫండ్ల కింద ఉన్న నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువనూ(ఏయూఎం) పరిశీలించాలి. అధిక ఏయూఎం ఉన్న ఫండ్‌లలో కాస్త నష్టభయం తక్కువగా ఉంటుంది. అదేకాకుండా సులభంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకూ వెసులుబాటు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని