Banking and loan: క్రెడిట్‌ కార్డు.. 30 శాతం మించకుండా

రుణం ఏదైనా సరే.. సులభంగా రావాలంటే మంచి క్రెడిట్‌ స్కోరు ఉండాల్సిందే. ఒక వ్యక్తి తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తున్న విధానం, ఎన్ని ఏళ్ల నుంచి అప్పులు తీసుకున్నారు, రుణాల మిశ్రమం, కార్డు బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నారా? ఇలా ఎన్నో అంశాలు క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తాయి.

Updated : 27 Oct 2023 11:51 IST

రుణం ఏదైనా సరే.. సులభంగా రావాలంటే మంచి క్రెడిట్‌ స్కోరు ఉండాల్సిందే. ఒక వ్యక్తి తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తున్న విధానం, ఎన్ని ఏళ్ల నుంచి అప్పులు తీసుకున్నారు, రుణాల మిశ్రమం, కార్డు బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నారా? ఇలా ఎన్నో అంశాలు క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తాయి. వీటిలో మరో ముఖ్యమైన అంశమూ ఉంది. అదే క్రెడిట్‌ కార్డును వినియోగిస్తున్న తీరూ స్కోరును మారుస్తుంది.

క్రెడిట్‌ కార్డును వాడటం సర్వసాధారణం అయ్యింది. కార్డు పరిమితి ఉంది కదా అని నెలనెలా పూర్తిగా వాడితేనే ఇబ్బందులు వస్తాయి. కార్డు వాడకం అధికంగా ఉండటం, ఎప్పుడూ అలాగే కొనసాగుతుండటం అంటే.. ఆ వ్యక్తి రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు బ్యాంకులు, రుణ సంస్థలు భావిస్తాయి. కాబట్టి, ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.2లక్షల వరకూ ఉందనుకుందాం. అంటే. రూ.2లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనుగోలు చేయొచ్చు. కానీ, ఇందులో 30 శాతం అంటే.. రూ.60 వేల లోపే మీ కొనుగోళ్లు ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 40 శాతం వరకూ వాడుకోవాలి. అదీ గడువు తేదీ బిల్లులను పూర్తిగా చెల్లించగలను అని నమ్మకం ఉన్నప్పుడే. ఇక అక్కడి నుంచి వినియోగం పెరుగుతున్న కొద్దీ మీపై ఆర్థిక భారం పడుతుంది. అదే సమయంలో మీ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి అధికం అవుతున్నట్లు లెక్క. ఫలితంగా మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తక్కువ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి ఉన్నప్పుడు బాధ్యతగల రుణ గ్రహీత అని బ్యాంకులు నమ్ముతాయి. రుణాలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టవు.

క్రెడిట్‌ బ్యూరోలు వ్యక్తుల స్కోరు గణనకు వేర్వేరు విధానాలను పరిమితులను పాటిస్తుంటాయి. కొన్ని బ్యూరోలు రుణ వినియోగ నిష్పత్తి 30 శాతం కంటే తక్కువే ఉండాలని అంటాయి. మరికొన్ని 35-40 శాతం వరకూ ఉన్నా ఇబ్బంది లేదు అని చెబుతుంటాయి. కానీ, రుణ వినియోగ నిష్పత్తి ఎప్పుడూ 25-30 శాతం లోపే ఉంటే మంచిదని నిపుణుల అభిప్రాయం. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.లక్ష ఉంటే.. ప్రతి నెలా రూ.25వేలకు మించి వాడకపోవడం ఉత్తమం. సాధ్యమైనంత వరకూ ఈ పరిమితి లోపు వినియోగం ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో, అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే అదీ ఏదో ఒక నెలలో వాడుకోవచ్చు.

  • ఎల్లప్పుడూ మీ పరిమితుల్లోనే ఖర్చు చేయండి. వృథా వ్యయాలు చేయొద్దు. క్రెడిట్‌ కార్డు బిల్లును తదుపరి గడువు తేదీకి ముందు చెల్లించగలము అనుకునే మొత్తాలకే పరిమితం చేయాలి. కార్డు బాకీపై కనీస మొత్తం చెల్లించడంలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయొద్దు.
  • అధిక క్రెడిట్‌ పరిమితి ఉన్న కార్డులను దుర్వినియోగం చేయొద్దు. జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
  • మీ క్రెడిట్‌ పరిమితిని పెంచుకోవడానికి మరో మార్గం ఉంది. మీ కార్డు పరిమితి రూ.2 లక్షలు అనుకుందాం. మీరు క్రమం తప్పకుండా రూ.70,000 వరకూ వాడుతున్నారు అనుకుందాం. అంటే.. 35 శాతం. ఒకే కార్డుతో అధిక శాతం వినియోగించడం వల్ల స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో మరో క్రెడిట్‌ కార్డును కనీసం రూ.లక్ష పరిమితితో తీసుకుని, రెండింటినీ కలిపి వాడుకోవచ్చు. దీనివల్ల వినియోగ నిష్పత్తి తగ్గుతుంది.
  • ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉన్నప్పుడు.. ఒకే కార్డుపై అన్ని కొనుగోళ్లనూ పూర్తి చేయొద్దు. వీలును బట్టి, అన్ని కార్డులను వాడేందుకు ప్రయత్నించాలి. ఒకే కార్డుపై పరిమితంగా ఖర్చు చేస్తూ.. మిగతా కార్డులను సాధ్యమైనంత వరకూ వాడకుండానూ చూసుకోవచ్చు.
  • క్రెడిట్‌ కార్డులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే.. కనీసం ఏడాదికోసారైనా క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకోవాలి. దీనివల్ల మీ రుణ చరిత్రలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థలు ఉచితంగానే క్రెడిట్‌ స్కోరును అందిస్తున్నాయి. నమ్మకమైన వెబ్‌సైట్ల నుంచి దీన్ని తీసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని