పన్ను లేని రాబడి కోసం...

నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? 

Published : 29 Dec 2023 00:08 IST

నెలకు రూ.6,000 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 8 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను. అధిక రాబడి వచ్చేలా ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? 

 - ప్రశాంత్‌

ఎనిమిదేళ్ల సమయం ఉందంటున్నారు కాబట్టి, డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేయొచ్చు. కాస్త నష్టభయం ఉన్నా అధిక రాబడికి అవకాశం ఉంటుంది. వీటితోపాటు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలోనూ మదుపు చేసే ప్రయత్నం చేయొచ్చు. మార్కెట్లు పతనమైనప్పుడు వీటిలో నష్టాలు వచ్చే అవకాశాలుంటాయి. దీర్ఘకాలంలో మంచి రాబడికే అవకాశాలుంటాయి. నెలకు రూ.6వేల చొప్పున 8 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటున 13 శాతం వార్షిక రాబడి అంచనాతో రూ.9,18,522 అయ్యేందుకు అవకాశం ఉంది. వీలును బట్టి, మీ పెట్టుబడులను సమీక్షించుకుంటూ ఉండాలి.


మా అమ్మాయి వయసు 8. తన పేరుమీద కనీసం 16 ఏళ్లపాటు మదుపు చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెడతాం. వీలును బట్టి, పెంచుకుంటూ వెళ్తాం.  మంచి మొత్తం జమ కావాలంటే ఏం చేయాలి?                

- వినయ్‌
ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుమీద తగినంత మొత్తానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా, విద్యా ద్రవ్యోల్బణానికి మించి రాబడి వచ్చేలా చూసుకోండి. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లు ఇందుకు తోడ్పడతాయి. నెలకు రూ.10వేల చొప్పున పెట్టుబడి ప్రారంభించి, ఏటా 10 శాతం మేరకు పెంచుకుంటూ వెళ్తే.. 16 ఏళ్ల తర్వాత 11 శాతం సగటు రాబడితో దాదాపు రూ.85,91,000 అయ్యేందుకు వీలుంది.


బంగారం ధర పెరుగుతోంది కదా. ఈ నేపథ్యంలో పసిడిలో మదుపు చేయాలనే ఆలోచన ఉంది. దీనికోసం సార్వభౌమ పసిడి (సావరీన్‌ గోల్డ్‌) బాండ్లు ఎంచుకోవచ్చా? గోల్డ్‌ ఈటీఎఫ్‌లు మంచివేనా?  
- సత్య
 మీ అవసరాలకు బంగారం కావాలి అనుకుంటేనే గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేయాలి. పెట్టుబడి దృష్టితో చూసినప్పుడు సార్వభౌమ పసిడి బాండ్లను ఎంచుకోవచ్చు. కానీ, ఇవి ఎప్పుడూ అందుబాటులో ఉండవు. ప్రభుత్వం జారీ చేసినప్పుడే పెట్టుబడి పెట్టాలి. కనీసం ఒక గ్రాముకు సమానమైన మొత్తాన్ని మదుపు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడిపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఎనిమిదేళ్లపాటు కొనసాగాలి. వీటికి ప్రత్యామ్నాయంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లనూ ఎంచుకోవచ్చు. డీమ్యాట్‌ ఖాతా అవసరం అవుతుంది.


నేను 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నాను. ఇప్పుడు కొంత మొత్తాన్ని మదుపు చేయాలని అనుకుంటున్నాను. రాబడికి హామీ ఉంటూ, వచ్చిన మొత్తంపై పన్ను పడకుండా ఉండాలంటే ఎలాంటి పథకాలు  ఎంచుకోవాలి?                               

 ప్రవీణ్‌
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం రూ.1,50,000 వరకూ వివిధ పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయొచ్చు. వచ్చిన రాబడిపైనా పన్ను ఉండకూడదు అంటే ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్‌)ని ఎంచుకోండి. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. కనీసం 15 ఏళ్లపాటు మదుపు కొనసాగించాలి. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించవచ్చు. ఇందులో మూడేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. నష్టభయం ఉన్నప్పటికీ, అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే పన్ను చెల్లించిన తర్వాతా మంచి రాబడి అందుకోవచ్చు.         

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని