వాహన రిటైల్‌ అమ్మకాలు 11% పెరిగాయ్‌

అధిక గిరాకీ కారణంగా, 2022తో పోలిస్తే గతేడాది (2023) దేశంలో వాహన రిటైల్‌ విక్రయాలు 11% పెరిగాయని డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. 2023లో దేశంలో మొత్తం 2,38,67,990 వాహనాలు అమ్ముడయ్యాయి.

Updated : 09 Jan 2024 06:58 IST

 2023పై ఫాడా

దిల్లీ: అధిక గిరాకీ కారణంగా, 2022తో పోలిస్తే గతేడాది (2023) దేశంలో వాహన రిటైల్‌ విక్రయాలు 11% పెరిగాయని డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. 2023లో దేశంలో మొత్తం 2,38,67,990 వాహనాలు అమ్ముడయ్యాయి. 2022లో ఈ సంఖ్య 2,14,92,324గా ఉంది. ప్రయాణికుల వాహనాల (పీవీ) రిటైల్‌ విక్రయాలు  34,89,953 నుంచి 11% పెరిగి 38,60,268 కు చేరాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1,55,88,352 నుంచి 9% వృద్ధితో 1,70,61,112కు చేరాయి. త్రిచక్ర వాహనాలు 6,81,812 నుంచి 58% పెరిగి 10,80,653గా నమోదయ్యాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 9,18,284 నుంచి 8% పెరిగి 9,94,330కు;  ట్రాక్టర్ల విక్రయాలు 8,13,923 నుంచి 7% అధికమై 8,71,627కు చేరాయి.

డిసెంబరులో ఇలా..

గత నెలలో దేశీయ వాహన రిటైల్‌ అమ్మకాలు 21% పెరిగి 19,90,915గా నమోదయ్యాయి. 2022 డిసెంబరులో వాహన అమ్మకాలు 16,43,514 గా ఉన్నాయి. ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 2,85,429  నుంచి 3% పెరిగి 2,93,005 కు చేరాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11,36,465 నుంచి 28% వృద్ధితో 14,49,693గా నమోదయ్యాయి. దేశంలో ఉన్న 1,442 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోని 1,335 కార్యాలయాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా పై గణాంకాలను ఫాడా విడుదల చేసింది.

వాహన రిటైల్‌ పరిశ్రమలోని ప్రతి ఒక్క విభాగం ఈ ఏడాది వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. కొత్త మోడళ్ల విడుదల, మార్కెట్‌ సెంటిమెంట్‌ స్థిరంగా కొనసాగుతుండటం వల్ల  ప్రయాణికుల వాహనాల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉందని ఫాడా పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, ఎక్కువ మంది విద్యుత్‌ వాహనాలపై మొగ్గు చూపుతుండటం, కొత్త మోడళ్ల విడుదల వల్ల ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలూ రాణించవచ్చని వివరించింది. మౌలిక రంగ ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక కేటాయింపుల కారణంగా వాణిజ్య వాహనాల అమ్మకాలకూ సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.

అశోక్‌ లేలాండ్‌ రికార్డు అమ్మకాలు..

వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ 2023లో రికార్డు స్థాయిలో 1,98,113 వాహనాలను విక్రయించింది. తద్వారా 2018లో నమోదుచేసిన 1,96,579 వాహన అమ్మకాల రికార్డును తిరగరాసింది. కంపెనీ మోడళ్లలో వైవిధ్యం, బలమైన నెట్‌వర్క్‌, దేశీయ- అంతర్జాతీయ విపణుల్లో స్థానాన్ని బలోపేతం చేసుకోవడం లాంటివి రికార్డు అమ్మకాలకు దోహదం చేశాయని కంపెనీ తెలిపింది.

హోండా మోటార్‌ గుజరాత్‌ ప్లాంటు సామర్థ్యం పెంపు

గుజరాత్‌లోని విఠల్‌పూర్‌ వద్ద ఉన్న తన ప్లాంటులో మూడో అసెంబ్లీ లైన్‌ను ప్రారంభించినట్లు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా  (హెచ్‌ఎంఎస్‌ఐ) తెలిపింది. దీని వల్ల అదనంగా 6.5 లక్షల స్కూటర్ల తయారీ సామర్థ్యం చేరుతుందని, తద్వారా మొత్తం వార్షిక సామర్థ్యం 19.7 లక్షలకు పెరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాంటులో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విపణులకు ఎగుమతి చేసే నిమిత్తం స్కూటర్లను హోండా తయారు చేస్తోంది. డియో, యాక్టివా 125, డియో 125 మోడళ్లను ఇక్కడి నుంచే విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని