Q-A: ఆన్‌లైన్‌లో టర్మ్ పాలసీ మంచిదేనా?

ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ లో మదుపు చేసేది అని అర్ధం. ఇందులో నేరుగా షేర్లు ఎంచుకోవచ్చు లేదా కాస్త రిస్క్ తగ్గించుకుని మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మార్కెట్లో పరోక్షంగా మదుపు చేయవచ్చు.

Updated : 20 Sep 2022 20:37 IST

మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు. వీటిలో ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది?

 - అక్షర

ఈక్విటీ అంటే షేర్ మార్కెట్లో మదుపు చేసేది అని అర్థం. ఇందులో నేరుగా షేర్లు ఎంచుకోవచ్చు లేదా కాస్త రిస్క్ తగ్గించుకుని మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మార్కెట్లో పరోక్షంగా మదుపు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో మీ వీలు ప్రకారం మదుపు చేయవచ్చు లేదా నెల నెలా క్రమంగా (సిప్ ద్వారా) బ్యాంకు ఖాతా నుంచి ఫండ్ కు డబ్బులు బదిలీ అయ్యేలా చేసి మీకు యూనిట్స్ దక్కేలా కూడా చేయవచ్చు.

మీరు కొత్తగా మొదలు పెడుతున్నట్లయితే సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్లు (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యుల‌ర్‌ ప్లాన్ల కంటే 1-2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.


నేను ఒక రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని.. పెన్షన్ వస్తోంది. నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాను. దీనికి స్వల్ప కాల, దీర్ఘకాల మూలధన పన్ను ఎలా ఉంటుంది?

- కృష్ణమూర్తి

షేర్లు కొనుగోలు చేసిన 12 నెలల్లోపు స్టాక్ మార్కెట్లో అమ్మినప్పుడు స్వల్పకాలిక మూలధన లాభం/నష్టంగా పరిగణిస్తారు. మీరు నిర్వహించే లావాదేవీల్లో స్వల్పకాలిక లాభం వచ్చిన సందర్భాల్లో లాభంపై పన్ను15 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

షేర్లు కొనుగోలు చేసి 12 నెలల తరవాత షేర్లను స్టాక్ మార్కెట్లో అమ్మినప్పుడు దీర్ఘకాల మూలధన ఆదాయ పన్నుగా పరిగణిస్తారు. రూ.1 లక్ష వరకు లాభంపై పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఆపై మొత్తంపై మాత్రం 10 శాతం పన్ను ఉంటుంది.


ఏజెంట్ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో టర్మ్ పాలసీ తీసుకోవడం వ‌ల్ల‌ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లాభం ఏంటి?

- శ్రీహాన్

ఏజెంట్ ద్వారా బీమా పాలసీ తీసుకుంటే ఏజెంట్‌కు కొంత వరకు కమీషన్ ఉంటుంది. కాబట్టి పాలసీ ప్రీమియం అధికంగా ఉంటుంది. దీని బదులు ఆన్‌లైన్‌లో టర్మ్ పాలసీ తీసుకున్నట్లయితే నేరుగా కంపెనీ ద్వారా తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గుతుంది. క్లెయిమ్ పరంగా ఏజెంట్ ద్వారా తీసుకున్న పాలసీకి, ఆన్‌లైన్‌ పాలసీకి తేడా ఏమీ ఉండదు.

పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే.. ఏ విధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ఉంటాయి. మీ కుటుంబానికి క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఉన్నట్లయితే నేరుగా కంపెనీని సంప్రదించవచ్చు.


నేనొక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. నేను 30 శాతం పన్ను స్లాబులో ఉన్నాను. పన్ను ఆదా చేసుకోవడానికి ఇంటి రుణం తీసుకోవడం మంచి ఆలోచనేనా?

- క్రాంతి కుమార్

ఇంటి రుణం తీసుకుని అసలుపై సెక్షన్ 80C (గరిష్ఠ పరిమితి రూ.1.50 లక్షలు), వడ్డీపై సెక్షన్ 24 బి (ఏడాదికి రూ.2 లక్షల వరకు ) ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అత్యధిక స్లాబులో ఉన్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, కేవలం పన్ను ఆదా చేసుకోవ‌డానికి ఇంటి రుణం తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. దీర్ఘకాలంలో మీరు చెల్లించే వడ్డీని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రుణాల ఈఎంఐలు మొత్తం జీతంలో 30 శాతం దాటకుండా చూసుకోవాలి. మీకు ఇల్లు అవసరం ఉన్నట్లయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని