Q-A: టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా?

మా అబ్బాయికి 10 ఏళ్లు. తనకు ఉపయోగపడేలా నెలకు రూ.5,000 మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దీనితోపాటు ఏడాదికి మరో 20 శాతం చొప్పున పెట్టుబడి పెంచాలనేది ఆలోచన.

Updated : 23 Nov 2022 16:18 IST

* మా అబ్బాయికి 10 ఏళ్లు. తనకు ఉపయోగపడేలా నెలకు రూ.5,000 మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దీనితోపాటు ఏడాదికి మరో 20 శాతం చొప్పున పెట్టుబడి పెంచాలనేది ఆలోచన. పదేళ్లపాటు పెట్టుబడి పెడితే నా దగ్గర ఎంత మొత్తం జమ అవుతుంది?

- శంకర్‌

* ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. అందుకోసం మీ పేరుపై వీలైనంత ఎక్కువ మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. పెట్టుబడిని క్రమంగా పెంచుకుంటూ వెళ్లడమూ మంచిదే. మీరు నెలకు రూ.5వేల చొప్పున మదుపు చేస్తూ, ఏడాదికి 20శాతం పెంచితే.. 10 ఏళ్ల తర్వాత 12 శాతం రాబడి అంచనాతో రూ.23,14,416 అయ్యేందుకు అవకాశం ఉంది. దీనికోసం మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు.


* నేను గృహరుణం తీసుకున్నాను. ప్రస్తుతం వడ్డీ రేటు 9.25 శాతానికి చేరింది. రూ.25 లక్షల రుణంలో రూ.10 లక్షల వరకూ చెల్లించాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? వడ్డీ రేట్లు తగ్గే వరకూ ఎదురుచూడాలా?

- మధుకర్‌

* ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24 కింద గృహరుణం వడ్డీకి రూ.2లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు రూ.22 లక్షల వరకూ గృహరుణాన్ని కొనసాగించవచ్చు. మీరు చెల్లించాలనుకుంటున్న రూ.10లక్షల్లో రూ.5లక్షలను గృహరుణం అసలు కింద జమ చేయండి. మిగతా రూ.5లక్షలను హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. ఏడేళ్ల తర్వాత వచ్చిన మొత్తాన్ని రుణానికి జమ చేయండి. రానున్న రెండేళ్ల వరకూ ఇంటి రుణం వడ్డీ రేట్లు అధికంగానే ఉండే అవకాశం ఉంది. తర్వాత కాస్త తగ్గొచ్చు.


* నా వయసు 46 ఏళ్లు. రెండేళ్ల క్రితం ప్రమాదం జరిగింది. కుడికాలు తీసేశారు. ఉద్యోగంలో కొనసాగుతున్నాను. నేను టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు వీలుంటుందా?

-చంద్ర

* మీరు టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చు. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ పాలసీ ఉండాలి. పాలసీ ఇచ్చేందుకు బీమా సంస్థ వైద్య పరీక్షలను అడిగే అవకాశం ఉంది. దరఖాస్తు ఫారంలో మీ ఆదాయ, ఆరోగ్య వివరాలు పూర్తిగా తెలియజేయండి. వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా బీమా సంస్థ విచక్షణ మేరకు పాలసీ వచ్చేందుకు వీలుంటుంది. కొంత అదనపు ప్రీమియాన్నీ వసూలు చేయొచ్చు.


* మా అమ్మ పేరుమీద రూ.4లక్షలు డిపాజిట్‌ చేద్దామని అనుకుంటున్నాం. తన వయసు 69. నెలనెలా ఆదాయం అందాలంటే ఏ పథకంలో మదుపు చేయాలి?

- సుధీర్‌

* కాస్త మంచి రాబడి రావాలంటే.. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను ఎంచుకోవచ్చు. ఇందులో 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. వడ్డీని మూడు నెలలకోసారి చెల్లిస్తారు. ఇలా వచ్చినా ఇబ్బంది లేదు అనుకుంటే ఈ పథకాన్ని పరిశీలించండి. ప్రతి మూడు నెలలకూ రూ.7,600 అందుతాయి. అయిదేళ్లపాటు ఈ డిపాజిట్‌ను కొనసాగించవచ్చు. కావాలనుకుంటే మరో మూడేళ్లపాటు పునరుద్ధరించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని