Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా

విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే  బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం.

Published : 14 Mar 2024 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లక్షలాది భారతీయ విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలా మంది విద్యార్థులు విదేశీ విద్యకోసం అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు ప్రయాణిస్తున్నారు. ఆ దేశ విశ్వవిద్యాలయాలు విస్తృత శ్రేణి అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌, అత్యాధునిక పరిశోధన అవకాశాలతో నాణ్యతగల ఉన్నత విద్యను అందిస్తున్నాయి.

కొన్ని దేశాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, భద్రత, జీవన నాణ్యత వంటి జీవన ప్రమాణాలు.. విద్య, వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కోరుకునే భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. వేరే దేశానికి చదువుకోవడానికి వెళ్లినప్పుడు చాలా ముఖ్యమైన అంశం ఆరోగ్య రక్షణ గురించి తెలుసుకోవడం. ఊహించని మెడికల్‌ ఎమర్జెన్సీల విషయంలో విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు తగిన ఆరోగ్య బీమా కవరేజీని కలిగి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థుల కోసం అనేక ఆరోగ్య బీమా పథకాలు అందించే కీలకమైన ప్రయోజనాలను ఇక్కడ చూద్దాం.

నగదు రహిత చికిత్స

విదేశంలో విద్యార్థి అనారోగ్యంతో బాధపడినా/ ప్రమాదానికి లోనైన సందర్భంలో వైద్య సహాయం అవసరమైనప్పుడు ఆరోగ్య బీమా పథకాలు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వీలు కల్పిస్తాయి. ఈ బీమా.. డాక్టర్‌ అపాయింట్‌మెంట్స్‌, దంత చికిత్స లాంటి సేవలను కవర్‌ చేస్తుంది. ఆసుపత్రి వైద్యులు.. పేషెంట్‌ రోగ నిర్ధారణ కోసం ఎక్స్‌-రే, అల్ట్రాసౌండ్‌ లేదా రక్త పరీక్షలను సూచించొచ్చు. ఈ ఖర్చులు కూడా విద్యార్థి ఆరోగ్య బీమా పథకం కింద కవర్‌ అవుతాయి. అన్ని క్లెయిమ్స్‌ నగదు రహిత పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు.

మానసిక ఆరోగ్యం

సాధారణంగా విద్యార్థుల జీవితం ఒత్తిడితో కూడుకున్నది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై, విద్యపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని బీమా సంస్థలు విద్యార్థుల మానసిక ఆరోగ్య ఖర్చులను కూడా కవర్‌ చేయడానికి పాలసీలో అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈ బీమాలో భాగంగా మానసిక ఆరోగ్యానికి ఉపకరించే కౌన్సెలింగ్‌, థెరపీ, సంబంధిత ఖర్చులను కూడా పాలసీ కవర్‌ చేస్తుంది.

రవాణా ఖర్చులు

పేషెంట్‌ చికిత్సకు వైద్యుడి వద్దకు లేదా ఆసుపత్రికి వెళ్లాల్సిన సందర్భంలో అయ్యే రవాణా ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌ చేసుకోవచ్చు. తీవ్ర అనారోగ్యానికి గురయినప్పుడు, ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు.. ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్స్‌ ఛార్జీలను కూడా పాలసీ చెల్లిస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్యానికి గురై, భారత్‌కు తిరిగి వెళ్లాలనుకుంటే.. రవాణా ఖర్చులను కవర్‌ చేస్తుంది. పేషెంట్‌తో పాటు తోడు వెళ్లే సహయకుడి ప్రయాణ ఖర్చులను కూడా అవసరాన్ని బట్టి చెల్లిస్తుంది. చికిత్స కోసం భారత్‌కు చేరుకున్న తర్వాత విద్యార్థులకు వైద్య బీమా 30 రోజుల వరకు చికిత్సను కవర్‌ చేస్తుంది. డాక్టర్లు నిరంతర చికిత్సను సూచిస్తే దాని ఫాలో-అప్‌ల కోసం అయ్యే ఖర్చులు కూడా కవర్ అవుతాయి.

పరిహారం, ట్యూషన్‌ ఫీజు

ఒకవేళ విద్యార్థి అనారోగ్యంపాలై ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉంటే చదువును కొనసాగించలేరు. ఈ అంతరాయం అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలిక చికిత్స భవిష్యత్‌లో అతడికి లభించే అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. ఇటువంటి సమయంలో ఆరోగ్య బీమా.. విద్యార్థికి జరిగిన అంతరాయానికి నష్ట పరిహారాన్ని అందిస్తుంది. ఇంకా, కొంత మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించే స్పాన్సర్స్‌ ఉంటారు. స్పాన్సర్‌ వల్ల విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ విద్యార్థికి సంబంధించిన స్పాన్సర్‌ చనిపోతే, మిగిలిన కాలవ్యవధికి చెల్లించవలసిన ట్యూషన్‌ ఫీజును మెడికల్‌ ఇన్సురెన్స్‌ భర్తీ చేస్తుంది. దీనివల్ల విద్యార్థి ఆర్థిక విషయాలపై దృష్టిపెట్టకుండా చదువును కొనసాగించే అవకాశం ఉంది.

ప్రయాణం కోసం

విద్యార్థి విదేశాలలో తీవ్ర అనారోగ్యానికి గురై 7 రోజుల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉండాల్సి రావచ్చు. అటువంటప్పుడు తల్లిదండ్రులు పేషెంట్‌ (విద్యార్థి)ని చూడడానికి, రానుపోను ప్రయాణానికి విమానం టిక్కెట్ల ఖర్చులను బీమా సంస్థ చెల్లిస్తుంది. దురదృష్టవశాత్తు విద్యార్థి మరణించిన సందర్భంలో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులనూ బీమా పాలసీ కవర్‌ చేస్తుంది. లేదా విదేశంలో ఖననం/దహన సంస్కారాలు జరిగినప్పుడు అయ్యే ఖర్చులను కూడా కవర్‌ చేస్తుంది.

విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు పాలసీలను అందిస్తున్నాయి... ఈ పాలసీలు ఎటువంటి కవరేజీలను ఇస్తున్నాయో ఇక్కడ చూడండి.

ఐసీఐసీఐ లాంబార్డ్‌ స్టూడెంట్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ సురక్ష, బజాజ్‌ అలయన్జ్‌ గ్లోబల్‌ పర్సనల్‌ గార్డ్‌, టాటా ఏఐజీ స్టూడెంట్‌ గార్డ్‌ పాలసీలు పేషేంట్‌కు సంబంధించిన డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఫీజులు, ఆసుపత్రిలో చికిత్స, అంబులెన్స్‌లో తరలింపు వంటి ఖర్చులను అందిస్తున్నాయి. ఒకవేళ పేషెంట్‌ చనిపోతే మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి అయ్యే ఖర్చులను చెల్లిస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలకు సమగ్ర కవరేజీని అందిస్తున్నాయి. ముందస్తు వ్యాధులను వెయిటింగ్‌ పీరియడ్‌ను బట్టి కవర్‌ చేస్తాయి. నగదు రహిత చికిత్స సేవలను అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో.. అత్యవసర సమయంలో పేషెంట్‌ (స్టూడెంట్‌) తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లడానికి అయ్యే విమాన ఖర్చులను కూడా భరిస్తుంది. బజాజ్‌ అలయన్జ్‌.. ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం, అత్యవసర దంత చికిత్స, పాస్‌పోర్ట్‌, ఇతర ముఖ్యమైన పత్రాల నష్టానికి కూడా పరిహారాన్ని అందిస్తోంది.

చివరిగా: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఒక సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని కలిగి ఉండడం వల్ల అనుకోని వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక రక్షణతో పాటు మనశ్శాంతి లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని