Harley Davidson X440: హార్లే ప్రియులకు హీరో షాక్‌.. X440 ధర పెంపు

Harley Davidson X440 price Hike: అమెరికా కంపెనీ హార్లే డేవిడ్‌సన్‌తో కలిసి తీసుకొచ్చిన ఎక్స్‌440 మోడల్ ధరను హీరో మోటోకార్ప్‌ పెంచింది. అన్ని మోడళ్లపై రూ.10,500 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.

Published : 02 Aug 2023 13:36 IST

Harley Davidson X440 price Hike | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp).. హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440 (Harley Davidson X440) మోడల్‌ ధరను పెంచింది. అమెరికాకు చెందిన హార్లేతో కలిసి ఈ బైక్‌ను హీరో మోటోకార్ప్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బైక్‌పై రూ.10,500 పెంచుతున్నట్లు బుధవారం (ఆగస్టు 2న) ప్రకటించింది. అన్ని వేరియంట్లకూ ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఇకపై ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.2,39,500 నుంచి మొదలవుతుందని పేర్కొంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హార్లేతో కలిసి హీరో ఎక్స్‌440 మోడల్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.2.29 లక్షలుగా నిర్ణయించారు. 440 సీసీ శక్తిమంతమైన ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఈ బైక్‌ను రూ.5వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు వీలు కల్పించింది. అయితే ఆగస్టు 3 వరకు 2.29 లక్షలకే బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. తర్వాతి బుకింగ్‌ విండో నుంచి పెరిగిన ధర వర్తిస్తుందని పేర్కొంది.

ఓలా ఎస్‌1 ఎయిర్‌పై ఆఫర్‌.. ₹10 వేల డిస్కౌంట్‌!

హార్లే డేవిడ్సన్‌ X440 ప్రొడక్షన్‌ను సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించనున్నారు. రాజస్థాన్‌లోని గార్డెన్‌ ఫ్యాక్టరీలో దీని ఉత్పత్తి చేపట్టనున్నారు. అక్టోబర్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తొలుత బుక్‌ చేసుకున్న వారికి డెలివరీ విషయంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్లు వచ్చిందీ కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు బ్రిటన్‌కు చెందిన ట్రయంఫ్‌ భాగస్వామ్యంతో స్పీడ్‌ 400 పేరిట మరో దేశీయ కంపెనీ బజాజ్‌ పైతం ఓ బైక్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను తొలి 10వేల కస్టమర్లకు రూ.2.23 లక్షలుగా.. ఆ తర్వాత బుక్‌ చేసుకున్న వారికి రూ.2.33 లక్షలుగా పేర్కొన్నారు. మొత్తంగా 14 వేల బుకింగ్‌లు వచ్చినట్లు బజాజ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని