హీరో Vs టీవీఎస్‌ Vs బజాజ్‌: మూడు విద్యుత్‌ స్కూటర్ల వివరాలివీ..

హీరో, బజాజ్‌, టీవీఎస్‌ విద్యుత్‌ స్కూటర్లు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఆ మూడు స్కూటర్ల ధరలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Published : 11 Oct 2022 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్ స్కూటర్లు అనగానే నిన్న మొన్నటి వరకు దాదాపు స్టార్టప్‌ కంపెనీల పేర్లే వినిపించేవి. నానాటికీ విద్యుత్‌ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ద్విచక్ర వాహన రంగంలో ఏళ్లుగా ఉన్న ‘బిగ్‌ కంపెనీలు’ సైతం ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. బజాజ్‌, టీవీఎస్‌ ఈ విషయంలో ముందుండగా.. దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో ఈ విషయంలో కాస్త వెనకబడింది. అయినా, పోటీలో ‘తగ్గేదేలే’ అంటూ ఇటీవల విడా వి1 పేరిట ఓ విద్యుత్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ద్విచక్ర వాహన విభాగంలో ఆయా కంపెనీలకు ఏళ్లుగా ఉన్న అనుభవం, బ్రాండ్‌ దృష్ట్యా ఈ మూడింటిపై వినియోగదారులకు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ మూడు స్కూటర్ల ధరలు, ఇతర స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం..

ధర

  • హీరో విడా వి1 పేరిట రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఇందులో వి1 ప్లస్‌ ధరను రూ.1.45 లక్షలు గానూ, వి1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగానూ నిర్ణయించారు.
  • టీవీఎస్‌ కంపెనీకి చెందిన ఐక్యూబ్‌ ధర రూ.1.67 లక్షలు కాగా.. ఐక్యూబ్‌ ఎస్‌ ధరను రూ.1.72 లక్షలుగా నిర్ణయించారు.
  • బజాజ్‌ చేతక్‌ కేవలం ఒకే వేరియంట్‌లో వస్తోంది. దీని ధరను ఆ కంపెనీ రూ.1.52 లక్షలుగా నిర్ణయించింది.

బ్యాటరీ- రేంజ్‌

  • విడా వి1 ప్లస్‌ 3.44 kWh బ్యాటరీతో వస్తోంది. వి1 ప్రో 3.94 kWh బ్యాటరీ ఇస్తున్నారు. రిమూవేబుల్‌ బ్యాటరీతో వస్తోంది. వి1 సింగిల్‌ ఛార్జ్‌తో 143 km, వి1 ప్రోతో 165 km ప్రయాణం చేయొచ్చు. 
  • టీవీఎస్‌ ఐక్యూబ్‌ 3.4 kWh  బ్యాటరీతో వస్తోంది. ఐక్యూబ్‌ 100 కిలోమీటర్లు రేంజ్‌ ప్రయాణిస్తుంది.
  • బజాజ్‌ చేతక్‌లో 3 kWh బ్యాటరీ అమర్చారు. ఎకో మోడ్‌లో వెళితే 95 కిలోమీటర్లు, స్పోర్ట్‌ మోడ్‌లో 85 కిలోమీటర్ల  మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

స్పీడ్‌

హీరో తీసుకొచ్చిన రెండు వేరియంట్ల టాప్‌ స్పీడ్‌ గంటకు 80 కిలోమీటర్లు. బజాజ్‌ చేతక్‌ సైతం గరిష్ఠంగా 80 కిలోమీర్లు ప్రయాణిస్తుంది. టీవీఎస్‌ ఐక్యూబ్‌ గరిష్ఠ వేగం గంటకు 78 కిలోమీటర్లు.

ఇతర ఫీచర్లు

  • హీరో విడాలో 7 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్సుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఇస్తున్నారు. క్రూజ్‌ కంట్రోల్‌, టూ వే థ్రోటల్‌, రివర్స్‌ మోడ్‌, కీ లెస్‌ కంట్రోల్, ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌, రైడింగ్‌ మోడ్స్‌ వంటివి ఉన్నాయి.
  • టీవీఎస్‌ ఐక్యూబ్‌లో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఐక్యూబ్‌ ఎస్‌, ఎస్‌టీలో 7 అంగుళాల యూనిట్‌ను ఇస్తున్నారు. నావిగేషన్‌ కంట్రోల్‌ ఉంది. టీవీఎస్‌ స్మార్ట్‌కనెక్ట్‌, కనెక్టవిటీ, మ్యూజిక్‌ కంట్రోల్‌, వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • చేతక్‌లో రౌండ్‌ హెడ్‌ ల్యాంప్‌ అమర్చారు. ఛార్జింగ్‌, రైడ్‌ రేంజ్‌ వంటివి మైబైల్‌లోనే తెలుసుకోవచ్చు. మొబైల్‌ను బైక్‌కు కనెక్ట్‌ చేసి కాల్స్‌ను చూడొచ్చు. యాక్సెప్ట్‌, రిజెక్ట్‌ చేయొచ్చు.

నోట్‌: పైన మూడు స్కూటర్ల ఎక్స్‌షోరూమ్‌ ధరలే పొందుపరచడం జరిగింది. ఫేమ్‌-2 సబ్సిడీ వల్ల ఆన్‌రోడ్‌ ధరలు తక్కువగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు కూడా సబ్సిడీ సదుపాయం అందిస్తున్నాయి. దీనివల్ల వాటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఆయా వెబ్‌సైట్లను సందర్శించండి..

హీరో విడా: https://www.vidaworld.com/
టీవీఎస్‌ ఐక్యూబ్‌: https://www.tvsmotor.com/iqube
బజాజ్‌ చేతక్‌: https://www.chetak.com/

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని