Microsoft Bing Chat: మైక్రోసాఫ్ట్‌ బింగ్‌లో ఏఐ చాట్‌.. ఎలా పనిచేస్తుందంటే?

చాట్‌జీపీటీ (ChatGPT) రాకతో టెక్‌ కంపెనీ తమ సొంత ఏఐ చాట్‌బాట్‌ల అభివృద్ధిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ బింగ్‌ (Microsoft Bing) సెర్చ్‌ ఇంజిన్‌లో ఏఐ ఆధారిత చాట్‌ సిస్టమ్‌ను పరిచయం చేసింది.

Published : 06 May 2023 10:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT) విడుదలైన తర్వాత బ్రౌజింగ్ చేసే విధానం పూర్తిగా మారిపోయింది. యూజర్‌కు అవసరమైన సమాచారాన్ని సరళంగా అందిస్తుండటంతో ఎక్కువ మంది కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌జీపీటీల వినియోగానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ బార్డ్‌ (Google Bard)ను విడుదల చేయగా.. మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ (Microsoft Bing) సెర్చ్‌ ఇంజిన్‌లో ఏఐ చాట్‌ (AI Chat)ను పరిచయం చేసింది. మెటా (Meta), ట్విటర్‌ (Twitter) వంటి సంస్థలు సొంత చాట్‌జీపీటీలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మరి, మైక్రోసాఫ్ట్‌ బింగ్ చాట్‌ ఎలా పనిచేస్తుంది? ఇది చెప్పే సమాధానాలు కచ్చితమైనవేనా? దీన్ని ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. 

  • మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ (Microsoft Edge) బ్రౌజర్‌ ఓపెన్‌ చేశాక అందులో కుడివైపు బింగ్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే బింగ్ ఏఐ చాట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో కింద సెర్చ్‌ బార్‌ (Ask me Anything)లో యూజర్‌ తనకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నలు అడిగితే బింగ్‌ చాట్ సమాధానాలిస్తుంది. 
  • అలా కాకుండా..ఏదైనా బ్రౌజర్‌లో మైక్రోసాఫ్ట్ బింగ్ అని టైప్‌ చేస్తే సెర్చ్‌ రిజల్ట్‌ వస్తుంది. అందులో బింగ్‌పై క్లిక్‌ చేయగానే సెర్చ్‌ ఇంజిన్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ పేజీలో ఎడమవైపు చాట్(Chat) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఎడ్జ్‌ బ్రౌజర్‌లో మాత్రమే బింగ్ చాట్‌ పనిచేస్తుందని చెబుతుంది. 
  • బింగ్‌ చాట్‌లో మొదటి ఐదు ప్రశ్నలకు ఎలాంటి లాగిన్‌ అవసరంలేదు. అంతకు మించి ప్రశ్నలు అడగాలంటే మైక్రోసాఫ్ట్‌ ఖాతాతో లాగిన్ చేయాల్సిందే. ఒక సెషన్‌లో 20 ప్రశ్నలు మాత్రమే అడిగేందుకు అనుమతి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం.  
  • 20 ప్రశ్నలు పరిమితి ముగిసిన తర్వాత యూజర్‌ కొత్తగా మరో 20 ప్రశ్నలు అడగాలనుకుంటే.. సెర్చ్‌ బార్‌ పక్కనే ఉన్న న్యూ టాపిక్‌ (New Topic) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే అప్పటి వరకు చేసిన చాట్‌ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయి కొత్తగా మరో 20 ప్రశ్నలు అడిగేందుకు బింగ్ చాట్ సిద్ధంగా ఉన్నట్లు చూపిస్తుంది. అలానే పాత హిస్టరీ ఇందులో స్టోర్‌ కాదు. 
  • బింగ్ చాట్ చెప్పే సమాధానాల్లో కొన్ని సరైన సమాచారాన్ని ఇవ్వడంలేదని యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఒక సెషన్‌లో 50 ప్రశ్నల పరిమితిని 20 ప్రశ్నలకు కుదించారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంపై మైక్రోసాఫ్ట్ దృష్టి సారించాలని కోరుతున్నారు. 
  • బింగ్ చాట్ తరహాలోనే ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్ పరిచయం చేసింది. బింగ్‌ ఇమేజ్‌ క్రియేటర్‌ (Bing Image Creator), బింగ్‌ ఎడ్జ్‌ యాక్షన్స్‌ (Bing Edge Actions), బింగ్ కంపోజ్‌ (Bing Compose), బింగ్‌ యాక్షన్స్‌ (Bing Actions) పేరుతో కొత్త ఫీచర్లను క్రియేట్ చేసింది. వీటితో యూజర్లు బింగ్‌ ఏఐ సాయంతో తమకు నచ్చిన విధంగా ఇమేజ్‌లను క్రియేట్‌ చేసుకోవడంతోపాటు, లెటర్లు కంపోజ్‌ చేసుకోవచ్చని తెలిపింది. వెబ్‌ విహారంలో ఇవి యూజర్‌కు కోపైలట్‌లాగా సహాయకారిగా ఉంటాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని